పౌల్ట్రీ..పల్టీ.. | Sakshi
Sakshi News home page

పౌల్ట్రీ..పల్టీ..

Published Sun, Jun 15 2014 12:26 AM

పౌల్ట్రీ..పల్టీ.. - Sakshi

ఈ ఏడాది భానుడి చండ ప్రచండ గాడ్పులకు చెట్టంత మనుషులే పిట్టల్లా రాలిపోతున్నారు. మరిక కోళ్ల సంగతో... రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రధాన పరిశ్రమగా గుర్తింపు పొంది, కోట్లాది రూపాయల టర్నోవరు జరుగుతున్న పౌల్ట్రీ పరిశ్రమ ఈ ఎండలకు గుడ్లు తేలేస్తోంది. ఎన్ని రక్షణ చర్యలు తీసుకుంటున్నా...జూన్ రెండోవారంలో సైతం కనీవినీ ఎరుగని రీతిలో కాస్తున్న ఎండలు, వీస్తున్న వడగాడ్పులకు ఓ పక్క కోళ్లు టపటపా రాలిపోతున్నాయి. మరోపక్క ఎండల ప్రభావంతో గుడ్ల ఉత్పత్తి కూడా తగ్గిపోతోంది.
 
 కొల్లిపర
 తెనాలి డివిజన్‌లో గుదిబండివారిపాలెం గ్రామానికి ఓ విశిష్టత ఉంది. ఈ గ్రామంలో రైతులంతా సమష్టి వ్యవసాయం తరహాలో సమష్టిగా కోళ్లఫారాలను నడుపుతుంటారు. రైతుకు గతంలో పాడి పరిశ్రమ ఎలా ఉండేదో, అలా ఇక్కడ పౌల్ట్రీ పరిశ్రమ నడుస్తోంది. కుటీర పరిశ్రమల తరహాలో ఐదారుగురు రైతులు కలసి ఒక కోళ్లఫారం యూనిట్ నడుపుకుంటుంటారు. ఈ విధంగా గ్రామంలో సుమారు 120 మంది రైతులు 34 కోళ్లఫారం యూనిట్లు నిర్వహిస్తున్నారు. దాదాపు 30 ఏళ్లుగా గ్రామంలో కోళ్లఫారాలను నడుపుతూ మిగతా గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
 
 పౌల్ట్రీఫారాలు పెట్టడానికి కారణం...
 డెల్టా ప్రాంతమైన కొల్లిపర మండలంలో దివిసీమ ఉప్పెన అనంతరం పంటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టాల పాలయ్యారు. ఈ ప్రాంతంలో ప్రధానంగా వరితో పాటు వాణిజ్య పంటలైన పసుపు, అరటి పండిస్తారు. వాణిజ్య పంటలకు పెట్టుబడి ఎక్కువ పెట్టాల్సిరావడంతో చిన్నా,చితకా రైతులు పెట్టుబడి పెట్టలేక ప్రత్యామ్నాయంగా కోళ్లఫారాల వైపు మళ్లారు.
 
  వాటికి కూడా ఒక్కరే ఎక్కువ పెట్టుబడి పెట్టలేక... తలా ఒక రెండు వేల కోళ్ల చొప్పున ఐదారుగురు రైతులు కలసి 10 లేదా 12 వేల కోళ్లతో ఒక కోళ్లఫారం యూనిట్ పెట్టుకుని సమష్టిగా నడుపుకోవడం ప్రారంభించారు. అలా గ్రామంలో ఒకరిని చూసి మరొకరు... మొత్తం 34 కోళ్లఫారం యూనిట్లు పెట్టారు. గత మూడు దశాబ్దాలుగా ఫారాలు నడుపుకుంటూ రైతులు ఒకవేళ ఒక ఏడాది పంటలు పండకపోయినా ప్రత్యామ్నాయ ఆర్థిక వ్యవస్థను ఏర్పాటుచేసుకోగలిగారు. మండలంలో గుదిబండివారిపాలెంతో పాటు హనుమాన్‌పాలెం, మున్నంగి గ్రామాల్లో కూడా కోళ్లఫారాలు ఉన్నాయి.
 
 ఎండలకు డంగైపోతున్న కోళ్లు... ఈ ఏడాది మండే ఎండలతో పౌల్ట్రీ పరిశ్రమ నిర్వాహకులు కుదేలైపోతున్నారు. మండలంలో దాదాపు 50 కోళ్ల ఫారాల్లో సుమారుగా 3 లక్షల కోళ్లను పెంచుతున్నారు. రోజుకు 2.50 లక్షల గుడ్లు ఉత్పత్తి అవుతాయి. గుడ్లను ఇక్కడనుంచి అస్సాం, బీహర్, సిక్కిం, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలకు ఎగుమతి  చేస్తుంటారు. ఈ ఏడాది వేసవి కాలంలో ఎండలు, ఈదురుగాలులు తీవ్రంగా ఉండడం వల్ల వేడికి తట్టుకోలేక ఇప్పటికి 10 శాతం కోళ్లు మృతి చెందినట్టు పౌల్ట్రీ యజమానులు చెబుతున్నారు. గుడ్ల ఉత్పత్తి కూడా 30 శాతం తగ్గినట్టు, పెరిగిన దాణా, ఇతర ఖర్చులు, వ్యాధుల కారణంగా గత ఏడాదికంటే ఈ ఏడాది 40 వేల కోళ్ల పెంపకాన్ని తగ్గించినట్టు పౌల్ట్రీ యజమానులు తెలిపారు.
 
 పెరిగిన దాణా ధరలు.. రెండేళ్ల క్రితం కిలో సోయా కేక్ ధర రూ.17 ఉండగా ఇప్పుడు రూ.45 ఉంది. సోయాకు తోడు సన్‌ఫ్లవర్, వేరుశెనగ చెక్క రేట్లు కూడా పెరగడంతో దాణా ఖర్చు విపరీతంగా పెరిగింది. ఒక్కరోజు కోడిపిల్ల నుంచి 150 రోజుల వరకు ఒక్కొక్క కోడికి దాణా ఖర్చు రూ.200 అవుతుంది. కోడి పిల్ల ధర రూ.28 ఉంది. కోడి గుడ్డు పెట్టడం మొదలు పెట్టిన తరువాత 365 రోజు లకు గాను 310 గుడ్లు పెడుతున్నాయి. మొదటి నెల చిన్న గుడ్లు మూలంగా ఏడాదికి ఒక్కో కోడికి వ్యాపారులు నాలుగు రూపాయిలు తగ్గిస్తారు. తగ్గిన గుడ్ల ధరలు.. రిటైల్‌గా కోడిగుడ్డు రూ.4 అమ్ముతుండగా వ్యాపారస్తులు కోళ్ల ఫారాల వద్ద రూ.2.50 పైసలకే కొనుగోలు చేస్తున్నారు. నెక్ ధరల ప్రకారం రూ.2.80 ఉంటుంది. ఒక్కో గుడ్డుకు కనీసం రూ.3.50 ఉంటే గాని గిట్టుబాటు అయ్యే పరిస్థితి లేదు.
 
 మండే ఎండలతో
 మృతిచెందుతున్న కోళ్లు
 గత 10 రోజులుగా ఈదురుగాలులకు, ఎండలకు కోళ్లను సురక్షితంగా ఉంచడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా, కొన్ని కోళ్లు మృతి చెందుతున్నాయి. షెడ్డులపై స్ప్రింకర్లు ఏర్పాటు చేసి నీళ్లు పెడుతున్నా ఉపయోగం లేకుండా పోతోంది. రోజు ఎన్నో కొన్ని కోళ్లు మృతి చెందుతూనే ఉన్నాయని కోళ్ల ఫారం యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ కోతల వల్ల నీళ్లు పెట్టడానికి  కూడా ఇబ్బంది పడాల్సివస్తోందని వాపోతున్నారు. రుతుపవనాలు వచ్చి వర్షాలు పడితే గాని, ఈ పరిస్థితిలో మార్పు ఉండదని భావిస్తున్నారు.
 
 సబ్సిడీపై విద్యుత్ అందించాలి
 మాజీ ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్ రెడ్డి గత ఏడాది నవంబర్‌లో పౌల్ట్రీలకు సబ్సిడీపై విద్యుత్‌ను అందజేస్తామన్నారు. కానీ ఇంతవరకు అమలుకాలేదు. అధికారంలోకి వచ్చిన కొత్త ప్రభుత్వమైనా పౌల్ట్రీ యజమానులను ఆదుకోవాలి. పౌష్టికాహారమైన గుడ్లను ప్రతి ఒక్కరూ వినియోగించుకుంటే రైతులు, కోళ్లఫారం యజమానులు, కోళ్ల ఫారాలపై ఆధారపడి జీవించేవారికి మెరుగైన జీవనోపాధి లభిస్తుంది.     
 - గుదిబండి శ్రీనివాసరెడ్డి
 
 పౌల్ట్రీ పరిశ్రమను ప్రభుత్వం
 ఈ ఏడాది పౌల్ట్రీ పరిశ్రమ పూర్తిగా నష్టాల్లో కూరుకుపోయింది. ఎండ తీవ్రతకు కోళ్లు అధిక సంఖ్యలో చనిపోతున్నాయి. దీంతో పెంపకందారులు నష్టాల బారినపడుతున్నారు. ప్రభుత్వం పరిశ్రమకు ఆర్థిక చేయూత ఇచ్చి ప్రోత్సహించాలి. కోళ్ల దాణా సబ్సిడీపై అందించాలి. పరిశ్రమకు అవసరమైన విద్యుత్‌ను ఉచితంగా అందించాలి.
 - కూరపాటి రవిశేఖర్‌రెడ్డి, కొల్లిపర
 

Advertisement
Advertisement