హైడల్ ప్రాజెక్టు కోసం ముమ్మర ప్రయత్నాలు | Sakshi
Sakshi News home page

హైడల్ ప్రాజెక్టు కోసం ముమ్మర ప్రయత్నాలు

Published Sat, Nov 23 2013 5:36 AM

Power generation company puts Intensive efforts for Hydel project

ఆదిలాబాద్/బోథ్/నేరడిగొండ, న్యూస్‌లైన్ : కుంటాల జలపాతంపై జలవిద్యుత్ ప్రాజెక్టు(హైడల్) నిర్మాణానికి ‘రాజీ’ విద్యుత్ ఉత్పత్తి సంస్థ ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఈనెల 4న అటవీ శాఖాధికారులతో కలిసి రాజీ పవర్ కార్పొరేషన్ ఎండీ సురపరాజు కుంటాల జలపాతాన్ని సందర్శించారు. దీనిపై గిరిజన సంఘాలతోపాటు పలు గ్రామాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా శుక్రవారం సురపరాజు అటవీశాఖాధికారులతో కలిసి జలపాతాన్ని సందర్శించడం విమర్శలకు దారితీస్తోంది. పగలు కుంటాల జలపాతాన్ని పరిశీలించిన సురపరాజు రాత్రి బోథ్ అటవీ శాఖ రేంజ్ కార్యాలయానికి చేరుకొని అటవీశాఖాధికారులతో మంతనాలు జరిపారు. రాత్రిపూట అధికారులతో చర్చలు జరపడం అనుమానాలకు తావిస్తోంది.
 
 కొనసాగుతున్న కుట్రలు..
 ఆదివాసీలు వ్యతిరేకిస్తున్నా కుట్రలు ఆగడం లేదు. మొదట 6 మెగావాట్లకు ప్రతిపాదనలు, తర్వాత 15 మెగావాట్లకు పెంచారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు పర్యాటక, నీటిపారుదల, ఆర్‌అండ్‌బీ, కాలుష్య నియంత్రణ మండలి, స్థానిక వన సంరక్షణ సమితి(వీఏఎస్‌ఎస్)ల అనుమతి లభించింది. అటవీశాఖ ఉన్నతాధికారులు అలాంటి ప్రయత్నాలు ఏమీ లేవని పైకి చెబుతు న్నా అంతర్గతంగా సర్వే చేపడుతున్నారు. రాష్ట్ర విభజనకు ఒకవైపు కేంద్రంలో ప్రయత్నాలు తీవ్రమవుతుండగా ఆలోపే ఈ సంస్థ పనులు ప్రారంభించేందుకు సీమాంధ్ర సర్కార్‌పై ఒత్తిళ్లు తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే రాష్ట్రస్థాయిలో పర్యాటక కేంద్రంగా పేరున్న కుంటాల జలపాతం కొద్ది రోజుల్లోనే కనుమరుగయ్యే అవకాశాలు ఉన్నాయి. త్వరలో గిరిజన సంఘాల నాయకులు, ప్రజలు హైదరాబాద్‌లోని అభయరణ్యంలో అటవీశాఖాధికారులను కలిసి ఈ ప్రయత్నాలను నిలిపివేయాలని కోరనున్నట్లు సమాచారం.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement