ప్రభాకరా.. ముందు పార్కులు కాపాడు...! | Sakshi
Sakshi News home page

ప్రభాకరా.. ముందు పార్కులు కాపాడు...!

Published Sun, Mar 6 2016 3:15 AM

Prabhakara keep  in front of the  parks

ఎమ్మెల్యేకు ఎర్రిస్వామిరెడ్డి హితవు

 అనంతపురం : ‘నగర పాలక సంస్థకు పాలకవర్గం లేని సమయంలో ఎన్ని స్థలాలను పార్కులుగా చూపించారు? ఈ రోజు అవన్నీ ఏమయ్యాయి? నగరంలో ముందుగా పార్కులు కాపాడు.. తర్వాత కార్యకర్తల గురించి ఆలోచించు..  కనిపించిన స్థలాలను కబ్జా చేస్తున్న మీరు నీతులు చెప్పడం హాస్యాస్పదం’ అంటూ ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరిపై వైఎస్సార్‌సీపీ క్రమశిక్షణ కమిటీ సభ్యులు బీ.ఎర్రిస్వామిరెడ్డి ధ్వజమెత్తారు. శనివారం జిల్లా పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఒకటో  డివిజన్‌లో వంక పొరంబోకు స్థలంలో గుడిసెలు వేసుకున్న వారికి పట్టాలిప్పిస్తామని చెప్పి వారిని ఎమ్మెల్యే టీడీపీలోకి చేర్చుకున్నారని, వారు తన వద్దకు వస్తే పట్టాలిప్పించడం సాధ్యం కాదని స్పష్టం చేశానని అన్నారు.

అయితే ఎమ్మెల్యే పట్టాలెలా ఇప్పిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. అధికారులను బెదిరించి పట్టాలిప్పిస్తావా? అని ప్రశ్నించారు. మాజీ కార్పొరేటర్ చంద్రమౌళి వైఎస్సార్‌సీపీ నుంచి తమ పార్టీలోకి వచ్చాడంటూ ప్రచారం చేస్తున్నారని, ఆయన ఏ పార్టీలో ఉన్నాడో తెలుసుకోకుండా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఇలాంటి నీచ రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. నగర అభివృద్ధిని  పక్కన పెట్టి ఎమ్మెల్యే, మేయర్ కుమ్మక్కై పర్సెంటేజీల పేరుతో దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. నగర పాలక సంస్థలో అధికారులను బెదిరించి, బ్లాక్‌మెయిల్ చేస్తూ సీ-బిల్లులు చేసుకుంటున్నారని ఎర్రిస్వామి రెడ్డి ఆరోపించారు. మాట వినని అధికారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. అధికారులకు తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

నగర అధ్యక్షుడు రంగంపేట గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి టీడీపీలో చేరుతున్నాడని దుష్ర్పచారం చేస్తూ, ముందుగా మీరు చేరితే మీకే గుర్తింపు ఉంటుందని చెబుతూ ఎమ్మెల్యే బలవంతంగా ప్రజల్ని టీడీపీలో చేర్పించుకుంటున్నారన్నారు. 1వ డివిజన్‌లో ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకున్న వారు పార్టీలోకి చేరకపోతే కేసులు పెట్టిస్తామని, గుడిసెలు తొలగిస్తామంటూ భయపెట్టారని ఆరోపించారు.

నెల రోజులుగా వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లను తమ పార్టీలోకి చేర్చుకునేందుకు ఎమ్మెల్యే ప్రభాకరచౌదరి తమ ఛోటా నాయకులతో రాయబారం నడుపుతున్నారన్నారు. అభివృద్ధిని విస్మరించిన టీడీపీలోకి ఎవరూ వెళ్లే ప్రసక్తే లేదన్నారు. అభివృద్ధి చేసి ప్రజలను దగ్గర చేసుకోవాలి తప్ప ప్రలోభాలకు గురి చేస్తే ఎవరూ నమ్మరనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు. సమావేశంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ మైనుద్దీన్, రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి యూపీ నాగిరెడ్డి, రామచంద్రారెడ్డి  పాల్గొన్నారు.

Advertisement
Advertisement