ప్రజా సంకల్పయాత్ర @ 2,500 కిలోమీటర్లు | Sakshi
Sakshi News home page

ప్రజా సంకల్పయాత్ర @ 2,500  కిలోమీటర్లు

Published Mon, Jul 9 2018 2:30 AM

Praja Sankalpa Yatra Reached 2,500 km Milestone - Sakshi

ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి:  ‘నాన్న గారు చనిపోయినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. ఒక కొడుకుగా చాలా బాధ పడ్డాను. కానీ ఆ బాధలో నుంచి బయటికి రావడానికి కారణం నాన్న గారు ఎక్కడికీ పోలేదని.. ప్రతి గుండెలోనూ బతికే ఉన్నారనే ధీమా.. నాకు ఇంత పెద్ద కుటుంబాన్ని (ప్రజలు)ఇచ్చాడన్న ధైర్యం, భరోసాలే నన్ను నడిపిస్తున్నాయి.’  పశ్చిమగోదావరి జిల్లాలో పాదయాత్ర 2,000 కిలోమీటర్ల  మైలురాయిని అధిగమించినపుడు ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్న మాటలివి.  ఆ మాటలు అక్షర సత్యమని నిరూపిస్తూ జననేత చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర పాలకుల గుండెల్లో గుబులు రేపుతూ అప్రతిహతంగా సాగిపోతోంది.

తూర్పుగోదావరి జిల్లా పసలపూడి శివారులో ఆదివారం 208వ రోజు పాదయాత్ర 2,500 కిలోమీటర్ల మైలు రాయిని అధిగమించింది. సరిగ్గా ఈ రోజే దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతి రోజు కావడం యాదృచ్ఛికం. తనకు ఇంతటి భారీ కుటుంబాన్ని ఇచ్చి కనిపించని లోకాలకు వెళ్లిన తండ్రిని ఉదయాన్నే స్మరించుకున్నారు. బాధను దిగమింగుకుని శిబిరంలో ఏర్పాటు చేసిన తన తండ్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం వైఎస్‌ జయంతిని పురస్కరించుకుని తయారు చేసిన భారీ కేక్‌ను పార్టీ నేతలు, అభిమానుల మధ్య ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ చేత కట్‌ చేయించారు. వేద పండితుల ఆశీర్వాదం పొందారు. తన వెంటే జనం రూపంలో మహానేత ఉన్నారనే నిబ్బరంతో యథావిధిగా తను బస చేసిన శిబిరం నుంచి పాదయాత్రగా బయలుదేరారు.

శిబిరం నుంచి బయటకు రాగానే ప్రజల నుంచి జగన్‌కు అనూహ్యమైన స్పందన లభించింది. పసలపూడి మొదలు చెల్లూరు, మాచవరం, సోమేశ్వరం వరకూ జనమే జనం. మహిళలు పెద్ద సంఖ్యలో ఆయనకు ఎదురేగి హారతులు పట్టారు. వృద్ధులు దీవెనలు అందజేశారు. అన్నొచ్చారంటూ యువతీ యువకులు సంతోషంతో జైజగన్‌ నినాదాలు చేశారు. రామచంద్రాపురం నియోజకవర్గం దాటుకుని మండపేట నియోజకవర్గంలోకి జననేత ప్రవేశించినపుడు సంఘీభావం ప్రకటించడానికి వచ్చిన జనంతో ఆ ప్రాంతం కిక్కిరిసింది. జననేత అడుగు తీసి అడుగు వేయడానికి అభిమానం అడ్డుపడింది. దీంతో యాత్ర బాగా ఆలస్యంగా ముందుకు సాగింది. జగన్‌తో మాట్లాడాలని, కరచాలనం చేయాలని, సమస్యలు చెప్పుకుని ఊరట పొందాలని వివిధ వర్గాల ప్రజలు అసంఖ్యాకంగా తరలి వచ్చారు. ఆదివారం సాయంత్రం పాదయాత్ర ముగిసే ప్రాంతానికి సమీపంలోని సోమేశ్వరం సెంటర్‌ బహిరంగ సభను తలపిస్తూ కిటకిటలాడింది. వేలాది మంది జనం దివంగత ముఖ్యమంత్రిని స్మరించుకుంటూ జననేత అడుగులో అడుగు వేశారు.  
 
ఊరూరా ఘన స్వాగతం 
జననేత పసలపూడి చేరుకోగానే గ్రామస్తులు, అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. అక్కడున్న వైఎస్‌ విగ్రహానికి వినమ్రంగా నమస్కరించి.. పార్టీ నేతలు తెచ్చిన కేక్‌ను స్వయంగా కట్‌ చేసి ముందుకు సాగారు. కొద్ది దూరం నడవగానే పాదయాత్ర 2,500 కిలోమీటర్ల మైలు రాయిని అధిగమించడంతో అందుకు గుర్తుగా వేప మొక్కను నాటారు. చెల్లూరు షుగర్‌ ఫ్యాక్టరీ వైపు సాగుతున్నపుడు అభిమానులు తెచ్చిన మరో రెండు కేకులను కూడా (వేర్వేరు చోట్ల) కట్‌ చేశారు. మధ్యాహ్నం మాచవరం గ్రామంలో కూడా ఆ ఊరి యువకులు ప్రత్యేకంగా తెచ్చిన కేక్‌ను జగన్‌ను కట్‌ చేశారు. పాదయాత్రకు ముందు ఒంటెలు, గుర్రాలపై స్వారీ చేస్తున్న యువకులు.. అన్నొస్తున్నారంటూ సందడి చేశారు.

మాచవరంలో పెద్ద సంఖ్యలో మహిళలు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పతాకం రంగులతో కూడిన చీరలను ధరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఊరు ఊరంతా తరలి వచ్చి జననేతకు స్వాగతం పలికింది. కాగా, అంతకు ముందు పసలపూడి వద్ద పార్టీ నేతలు నిర్వహించిన శిబిరంలో పెద్ద సంఖ్యలో నేతలు, కార్యకర్తలు, అభిమానులు రక్తదానం చేశారు. దారిపొడవునా వివిధ వర్గాల ప్రజలు జననేతకు సమస్యలు చెప్పుకున్నారు. పింఛన్లు, రేషన్‌కార్డులు ఇవ్వడం లేదని, ఉన్న ఉద్యోగాల్లోంచి కూడా తీసేస్తున్నారని, వైఎస్సార్‌ సానుభూతిపరులను ఇబ్బంది పెడుతున్నారని వాపోయారు. అందరి సమస్యలను ఓపికగా విన్న జగన్‌.. మనందరి ప్రభుత్వం రాగానే ఆదుకుంటామని భరోసా ఇస్తూ ముందుకు సాగారు.  

పసలపూడిని పట్టించుకోండన్నా.. 
పిఠాపురం: ‘గలగలపారే గోదావరి.. పచ్చని చెట్లు.. మెలికలు తిరిగిన కాలువలు.. పురాతన భవనాలు.. ఇలా ఒకటేమిటి పకృతి అందాల నెలవు పసలపూడి. ‘సిరిసిరిమువ్వ’ నుంచి ‘పరుగు’ సినిమాల వరకు ఈ ప్రాంతంలోనే చిత్రీకరణ జరిగింది. ఇంతటి ఖ్యాతిగాంచిన పసలపూడిని పాలకులు పట్టించుకోవడం లేదు. దీంతో ఆ ఆహ్లాదం కనుమరుగవుతోంది. ఎలాగైనా మీరే రక్షించి సినీ రంగానికి చేదోడుగా ఉండాలి’ అని ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ కర్రి రమణారెడ్డి ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌కు విజ్ఞప్తి చేశారు.

ఆదివారం పాదయాత్రలో ఆయన జగన్‌ను కలిసి పసలపూడి విశిష్టత గురించి వివరించారు. ‘సినీ ప్రముఖులు ఎస్వీ కృష్ణారెడ్డి, వంశీ, చందు, దేవీశ్రీ ప్రసాద్, చోటాకే నాయుడు, చోటకే శ్యామ్, శ్రీను వైట్ల, సందీప్‌ కిషన్, వాసు వర్మ, రాళ్లపల్లి, బాలాజీ తదితరులు ఈ ప్రాంతానికి చెందినవారు. ప్రముఖ నిర్మాతలు తాడి గంగిరెడ్డి, చింతా సూరారెడ్డి, కర్రి సముద్రా రెడ్డి, కర్రి ప్రద్యుమ్నరెడ్డి, కర్రి సుధాకరరెడ్డి, రామారెడ్డిలు కూడా ఇక్కడి వారే. ప్రకృతి అందాలు పుష్కలంగా ఉన్న పసర్లపూడికి రహదారి సౌకర్యం కూడా బాగుండటంతో ఇక్కడ ఎక్కువగా షూటింగ్‌లు జరుగుతాయి. అందువల్ల ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేస్తే ఎంతో మందికి ఉపాధి లభిస్తుంది. మౌలిక సౌకర్యాల కొరత వల్ల ఎక్కడికక్కడ రూ.కోట్లు వెచ్చించి సెట్టింగులు వేస్తున్నారు తప్ప ప్రకృతి ప్రసాదించిన ఇక్కడి అందాలను ఉపయోగించుకోలేకపోతున్నారు. మీరు అధికారంలోకి రాగానే ఈ ప్రాంతాన్ని మరింతగా అభివృద్ధి చేయాలి’ అని విజ్ఞప్తి చేశారు.  

Advertisement
Advertisement