ప్రజల సలహాలే  పార్టీ మేనిఫెస్టో | Sakshi
Sakshi News home page

ప్రజల సలహాలే  పార్టీ మేనిఫెస్టో

Published Sun, Nov 5 2017 8:43 PM

PrajaSankalpaYatra : Jagan speaks webseries started - Sakshi

కడప నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: సోమవారం నుంచి ప్రారంభం కానున్న ప్రజా సంకల్పం పాదయాత్రలో ప్రజలు ఇచ్చే సలహాలు, సూచనలే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఉంటాయని, వారి ఆకాంక్షలకు అనుగుణంగానే దీనిని తీర్చిదిద్దుతామని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వెల్లడించారు. ఇందులో భాగంగా ఆదివారం ‘జగన్‌ స్పీక్స్‌’ అనే కార్యక్రమాన్ని ఫేస్‌బుక్‌తో అనుసంధానిస్తూ ప్రారంభించారు. ఈ కార్యక్రమం కింద ప్రతిరోజూ పాదయాత్రలో తన రోజువారీ అనుభవాలను నెటిజన్లతో పంచుకుంటానని వెల్లడించారు.

ఇకపై జగన్‌ మాట్లాడే వీడియోల పరంపర ఫేస్‌బుక్‌లో అందుబాటులో ఉంటుంది. ఫేస్‌బుక్‌లో విడుదల చేసిన తొలి వీడియోలో జగన్‌ ఇంకా ఏం చెప్పారంటే.. ‘‘తెలుగు ప్రజలకు నమస్కారం.. ఇది వరకు ప్రకటించిన విధంగా ప్రజా సంకల్ప యాత్రను నవంబర్‌ 6వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నాను. వైఎస్సార్‌ కుటుంబం ద్వారా మీరు నా కుటుంబంలో ఒక్కటయ్యారు. భాగమయ్యారు. మీరు నన్ను నమ్మి నాతో ప్రయాణం చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. 7 నెలలపాటు దాదాపు 3 వేల కిలోమీటర్లకు పైగా సాగే ఈ పాదయాత్రతో మీకు మరింత దగ్గరగా అయ్యే ప్రయత్నం చేస్తాను. మీరు చెప్పే ప్రతి అంశాన్నీ వింటాను. మీ కష్టాలను, నష్టాలను పరిష్కరించే ఆలోచనలతోనే అడుగులు ముందుకు వేస్తాను.

నవరత్నాలను గతంలోనే మీతో పంచుకున్నాను. ఆ నవరత్నాలను కూడా మెరుగు పరచడానికి మీరేదైనా సలహా ఇస్తే తీసుకుంటూ అడుగులు ముందుకు వేస్తాను. మనం ఎన్నికల సమయానికి విడుదల చేసే మేనిఫెస్టో ఆఫీసుల్లో కూర్చొని దిద్దిన మేనిఫెస్టోలా కాకుండా ప్రజలు దిద్దిన మేనిఫెస్టోలా బయటకు రావాలి. నా పాదయాత్ర ద్వారా నేను చేసే ప్రయత్నమిదే. ఆ దిశగా మీ సలహాలు, మీరు చెప్పే అంశాలతో, మీరు చేసే మార్పులతోనే ఆ మేనిఫెస్టో విడుదల చేయాలన్న తాపత్రయంతోనే నా పాదయాత్ర సాగుతుంది. ఈ నేపథ్యంలో డిజిటల్‌ మీడియా ద్వారా మీ అందరితో ఇంకా దగ్గర కావడానికి ప్రయత్నం చేస్తాను. మీరందరూ ఈ పాదయాత్రలో భాగస్వామ్యం కావాలని కోరుతున్నా’’ అని పేర్కొన్నారు. ‘జగన్‌ స్పీక్స్‌ వీడియో సిరీస్‌ ద్వారా మీ అందరికీ అందుబాటులో ఉంటా.. ఈ కార్యక్రమానికి సంబంధించి మీతో మమేకం(కనెక్ట్‌) కావడానికి విడుదల చేసిన తొలి వీడియోను ఫేస్‌బుక్‌లో ఉంచుతున్నాను’ అని వైఎస్‌ జగన్‌ ట్విటర్‌లో ట్వీట్‌ చేశారు.  

Advertisement

తప్పక చదవండి

Advertisement