ప్రకాశం బత్తాయి ఒడిశాకు.. | Sakshi
Sakshi News home page

ప్రకాశం బత్తాయి ఒడిశాకు..

Published Mon, Jun 22 2020 12:44 PM

Prakasam Orange Fruits Export to Odisha - Sakshi

యర్రగొండపాలెం: కరోనా ఉధృతి ప్రారంభం నుంచే బత్తాయి రైతులకు గడ్డుకాలం దాపురించింది. వైరస్‌ ప్రబలకుండా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ప్రకటించడంతో రైతులు విలవిల్లాడారు. కోతకొచ్చి మంచి ధర పలుకుతున్న సమయంలో రవాణా సౌకర్యం ఎక్కడివి అక్కడే నిలిచిపోయాయి. లాక్‌డౌన్‌ సందర్భంగా ప్రజలు బయట తిరగకపోవడంతో పండ్ల మండీలు మూతవేశారు. ఈ తరుణంలో టన్ను రూ.55 నుంచి రూ.60 వేల మేరకు ధర పలకాల్సిన బత్తాయి రూ.8 వేలకు పడిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం సూచనల మేరకు ఉద్యాన శాఖ అధికారులు అప్రమత్తమై చెట్టు నుంచి కాయలు కోయకుండా రైతులకు అవగాహన కలిగించారు. చెట్టు నుంచి రాలిపడిన కాయలు మాత్రం స్థానికంగానే అమ్మకాలు జరిపారు. వీరికి వైఎస్సార్‌ క్రాంతి పథం – డీఆర్‌డీఏ శాఖ చేయుతనిచ్చింది. కాయలు కొనుగోలు చేసి డ్వాక్రా గ్రూపుల ద్వారా అమ్మకాలు జరిపించింది. 4 నెలలుగా ఆటు పోట్లకు గురైన బత్తాయి ఇప్పుడిప్పుడే పుంజుకుంటోంది. 

ఒడిశా మార్కెట్‌లో మంచి డిమాండ్‌..
జిల్లాలో మొత్తం 21,250 ఎకరాల్లో బత్తాయి తోటలను పెంచుతున్నారు. ఎకరాకు 8 నుంచి 10 టన్నుల మేర దిగుబడి వస్తుంది. సరాసరిన ఎకరాకు 8 టన్నుల ప్రకారం లెక్కలు వేసుకుంటే 1.70 లక్షల టన్నులు బత్తాయి కాపు కాస్తుంది. టన్ను రూ.35 వేల ప్రకారం బత్తాయి తోటలు పెంచే రైతులకు రూ.595 కోట్ల రాబడి ఉంటుంది. ప్రభుత్వం లాక్‌డౌన్‌ సడలించిన తరువాత బత్తాయికి ఇప్పుడిప్పుడే డిమాండ్‌ పెరిగింది. జిల్లాలో పండిన బత్తాయి పంట ఒడిశాకు ఎక్కువగా రవాణా అవుతుంది. వారం రోజుల క్రితం టన్ను రూ.32 వేలు ధర పలకగా ఒడిశా మార్కెట్‌ తెరుచుకున్న తరువాత బత్తాయికి రోజు రోజుకూ డిమాండ్‌ పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం బత్తాయి ధర టన్ను రూ.40 వేల వరకు ఉందని పలువురు రైతులు తెలిపారు.

ఇప్పుడిప్పుడే దేశంలో పండ్ల మండీలు తెరుచుకుంటున్నాయి  
లాక్‌డౌన్‌ కారణంగా పండ్ల ఉత్పత్తులకు మార్కెటింగ్‌ లేకపోయింది. ఇప్పుడిప్పుడే దేశంలో మండీలు తెరుచుకుంటున్నాయి. దీని వలన బత్తాయికి డిమాండ్‌ పెరిగింది. ప్రస్తుతం టన్ను బత్తాయి రూ.40 వేల వరకు పలుకుతోంది. రానున్న రోజుల్లో బత్తాయి ధరలు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. గత సంవత్సరం టన్ను రూ.60 వేల వరకు అమ్ముడుపోయింది. ఈ సంవత్సరం రూ.70 వేల వరకు అమ్ముడుపోయే అవకాశం ఉందని రైతులు అంచనా వేస్తున్నారు.– షేక్‌.నబీరసూల్, ఉద్యానశాఖాధికారి, వైపాలెం

Advertisement
Advertisement