ప్రేమ కథ చిత్రం | Sakshi
Sakshi News home page

ప్రేమ కథ చిత్రం

Published Tue, Jan 28 2014 2:20 AM

ప్రేమ కథ చిత్రం

  • ప్రేమతో దగ్గరైంది.. పెళ్లి తరువాత ఆవిరైంది
  •  చదివించి ఉద్యోగం ఇప్పిస్తే చిదిమేశాడు
  •  
    ప్రేమ పేరుతో దగ్గరైన ఆ యువజంట ఆదర్శంగా జీవిస్తుందని అందరూ అనుకున్నారు.. ఇంతలోనే వారి నడుమ అనుమానంతో పాటు ఆర్థిక భూతం చొరబడింది.. కాలంతోపాటే కళ్ల ముందే రంగుల ప్రేమ కల చెదిరిపోయింది.. ఆమె కంటే డబ్బుకే విలువిచ్చిన ఆ యువకుడు భార్యనే కడతేర్చాడు. ఇదీ పూణేలో ముగిసిన నందిగామ యువతి ఖాజాబీ ప్రేమకథ పర్యవసానం.
     
    సాక్షి, మచిలీపట్నం/ నందిగామ, న్యూస్‌లైన్ : నేటి యువత అందానికి ఆకర్షితులై.. విద్య, ఉద్యోగం ఉన్నవారిని లక్ష్యంగా చేసుకుని ప్రేమ వల విసిరి.. పెళ్లి పేరుతో దగ్గరై.. అటు తరువాత వారి నడుమ ఆకర్షణ ఆవిరై.. ఆర్థికపరమైన విషయాల్లో వివాదాలకు ఆలవాలమై.. వీలైతే విడిపోవడం.. కాదంటే కడతేరడం వరకు దారితీస్తున్న ఘటనలు సభ్యసమాజాన్ని కలవరపాటుకు గురిచేస్తున్నాయి. నందిగామకు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఖాజాబీ ప్రేమకథా వ్యథ దీనికి ఓ ఉదాహరణ.

    హైదరాబాద్‌లో ఖాజాబీ, ఖమ్మం జిల్లా మధిరకు చెందిన షేక్ మునీబ్  బీఎస్సీ కంప్యూటర్స్ చదువుకునే సమయంలోనే ప్రేమలో పడ్డారు. ఆమెకు క్యాంపస్ ఇంటర్వ్యూలో హైదరాబాద్‌లోనే మొదట ఉద్యోగం వచ్చింది. ఈ నేపథ్యంలో ఆమె సొంత డబ్బుతో మునీబ్‌ను బీటెక్ చదివించింది. ఖాజాబీ కృషి ఫలించి మునీబ్‌కు పూణేలో ఉద్యోగం వచ్చింది. మరో రాష్ట్రంలోని ఎల్ అండ్ టీ కంపెనీలో ఉద్యోగం ఇప్పించి తన ప్రియుడి ఎదుగుదలను చూసి మురిసిపోయింది. అప్పటివరకు గుట్టుగా ఉంచిన తమ ప్రేమాయణాన్ని పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. పెద్దల అంగీకారం లేకుండానే పెళ్లి చేసుకున్నారు. అంతేకాదు ఆమె హైదరాబాద్ నుంచి తన భర్త మునీబ్ ఉద్యోగం చేస్తున్న పూణేకు బదిలీ చేయించుకుని అక్కడే కొత్త కాపురం పెట్టారు.
     
    అనుమానం... ఆర్థికం...
     
    ప్రేమించిన యువకుడిని దక్కించుకున్నానన్న మునీబ్ ఆనందం ఎంతోకాలం నిలవలేదు. తనను కేవలం డబ్బు కోసమే పెళ్లి చేసుకున్నాడని తెలిసి తల్లడిల్లింది. అనుమానపు పిశాచిగా మారిన భర్త తరచూ డబ్బు తేవాలని వేధిస్తున్న వైనాన్ని ఇటీవల తల్లిదండ్రులకు చెప్పి వాపోయింది. కట్నంగా రూ.ఐదు లక్షల విలువ చేసే బంగారం, నగదును తన తల్లిదండ్రుల నుంచి మునీబ్‌కు  ఇప్పించింది. కట్నం ఇస్తే తనను బాగా చూసుకుంటాడని నమ్మిన ఖాజాబీకి మింగుడుపడని నిజం తెలిసింది. మునీబ్ విజయవాడలోని బంధువుల యువతితో పెళ్లి కుదుర్చుకోవడం ఆమెను కుంగదీసింది. ఈ నేపథ్యంలో అతని నుంచి విడిపోయి దూరంగా జీవనం సాగించే యోచనలో ఉన్న ఆమె ఇంతలోనే అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.
     
    భర్తే కడతేర్చాడా..?

    ప్రేమ పేరుతో వంచించి.. డబ్బు కోసం వేధించి.. మరో యువతిని పెళ్లాడేందుకు మునీబ్ తన భార్యను హతమార్చి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నట్టు ఖాజాబీ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఆమెను అడ్డు తొలగించుకునేందుకు కసాయి భర్త తన బంధువుల సహాయంతో కడతేర్చి ఆత్మహత్యగా సృష్టించాడని ఖాజాబీ తల్లిదండ్రులు గుల్‌షాద్, లాల్‌అహ్మద్ ఆరోపిస్తున్నారు. ఇదే విషయాన్ని ఖాజాబీ తల్లి గుల్‌షాద్ ఫిర్యాదు మేరకు మహారాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేశారు. ఖాజాబీ మృతదేహానికి పూణేలో నిర్వహించిన పోస్టుమార్టంలో సైతం భర్తగా మునీబ్ సంతకాన్ని తీసుకోవడాన్ని మృతురాలి తల్లిదండ్రులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కేసులో నిందితుడి సంతకాన్ని ఎలా తీసుకుంటారని వారు ప్రశ్నిస్తున్నారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న మునీబ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
     
    మహారాష్ట్ర పోలీసుల తీరుపై విమర్శలు...
     
    అనూహ్య.. ఖాజాబీ రెండు ఘటనల్లోను మహారాష్ట్ర పోలీసుల తీరుపై జిల్లా వాసులు మండిపడుతున్నారు. అనూహ్య ఆచూకీ తెలియడంలేదని ఆమె తండ్రి ప్రసాద్, బంధువులు ఫిర్యాదు చేసినా ముంబై పోలీసులు కనీసం స్పందించలేదు. ఖాజాబీ మృతిపై ఆమె తల్లిదండ్రులు గుల్ షాద్, లాల్ అహ్మద్‌లు ఫిర్యాదు చేసినా పూణే పోలీసులు స్పందించలేదని వాపోతున్నారు. తమ కూతుర్ని అల్లుడే హత్య చేశాడని ఆరోపించినా అతనికి రాచమర్యాదలు చేయడంపై మండిపడితున్నారు.
     

Advertisement
Advertisement