Sakshi News home page

మోగిన పుష్కర నగారా

Published Mon, Nov 24 2014 12:29 AM

మోగిన పుష్కర నగారా

 కొవ్వూరు : గోదావరి పుష్కరాలను వచ్చే ఏడాది జూలై 14 నుంచి 25 వరకు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈసారి పుష్కరాల నిర్వహణ  ఏర్పాట్లకు ప్రభుత్వం రూ.900 కోట్లు వెచ్చించనున్నట్టు ప్రకటించింది. జిల్లాలో గత పుష్కరాలకు సుమారు కోటిన్నర మందికి పైగా భక్తులు వచ్చినట్టు అంచనా. దీనిలో సుమారు కోటి మంది భక్తులు కొవ్వూరు గోష్పాద క్షేత్రానికి విచ్చేసినట్టు అంచనా. ప్రస్తుత పుష్కరాలు 144 సంవత్సరాలకు ఒకసారి అరుదుగా వచ్చే మహా పుష్కరాలు కావడం, ప్రసార మాధ్యమాలు పెరగడంతో ఈసారి దేశం నలుమూలల నుంచి రెండు నుంచి మూడుకోట్ల మంది భక్తులు వచ్చే అవ కాశం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కొవ్వూరు, రాజమండ్రిలో 12రోజుల పాటు గోదావరి నదికి మహానీరాజనం సమర్పించనుండడం ఈసారి పుష్కరాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది. ముందుగా జిల్లాలో దేవాదాయశాఖ ఆధ్వర్యంలో రూ. 10.18 కోట్లతో ఆలయాల అభివృద్ధి, మరమ్మతు పనులు డిసెంబర్ నుంచి ప్రారంభించే అవకాశం ఉంది.
 
 అధ్వానంగా స్నాన ఘట్టాలు
 ప్రసిద్ధ కొవ్వూరు గోష్పాదక్షేత్రంలో స్నానఘట్టాలను విస్తరించాల్సి ఉంది. ప్రస్తుతం ఉన్న రేవులు కార్తీకమాసం, మహాశివరాత్రి వంటి ప్రత్యేక పర్వదినాల సమయంలో తరలివచ్చే భక్తులకే  చాలడం లేదు. ఈ నేపథ్యంలో స్నానఘట్టాలను, సౌకర్యాలను మెరుగుపరచాల్సి ఉంది. ఏటా వచ్చే వరదల కారణంగా నదీ తీరంలోని పోలవరం నుంచి నర్సాపురం వరకు ఉన్న 64 స్నానఘట్టాలు పూర్తిగా దెబ్బతిన్నందున వీటిని పూర్తిగా పునరుద్ధరించాల్సి ఉంది. వీటితో పాటు జిల్లాలో మరో 30 స్నానఘట్టాలకు కొత్తగా ప్రతిపాదనలు చేశారు. గోదావ రి నదికి వరదలు వచ్చే సమయంలో పుష్కరాలు రానుండడంతో రేవుల్లో సౌకర్యాలు సక్రమంగా లేకపోతే అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంది.
 
 పట్టణంలో గోష్పాద క్షేత్రంలోని ప్రధాన స్నానఘట్టాలతో పాటు వశిష్ఠం, సీతారామ, సుబ్రహ్మణ్యేశ్వర, భక్తాంజనేయ, కృష్ణ చైతన్య, శ్రీనివాస, ఔరంగబాద్ స్నాన ఘట్టాలున్నాయి. ప్రస్తుతం అన్ని స్నానఘట్టాలను పూర్తిస్థాయిలో పునరుద్దరించాల్సి ఉంది. జూన్ నెల నుంచే గోదావరిలోకి వరద నీరు చేరుతుంది. ఈ నేపథ్యంలో పుష్కరాల పనులు నెలరోజుల ముందుగానే ముగించాల్సి ఉంది. ఇప్పటికీ కొన్ని అభివృద్ధి పనులు ప్రతిపాదనల దశలోనే ఉండడంతో పనులు ప్రారంభం కావడానికి మరింత సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. మంత్రులు డిసెంబరు నుంచి పనులు ప్రారంభిస్తామంటున్నప్పటికీ టెండర్ల ప్రక్రియ పూర్తి కావడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. పనులు ఇప్పటి నుంచే ప్రారంభిస్తే తప్ప సకాలంలో పూర్తయ్యే అవకాశం ఉండదు. గత పుష్కరాల సమయంలో ఇదే విధమైన ఇబ్బందులు ఏర్పడడంతో కొన్ని పనులను హడావిడిగా, అసంపూర్తిగా ముగించారు.  
 
 తూర్పుకే సింహ భాగం నిధులు
 పుష్కరాలకు కేటాయించిన రూ. 900 కోట్లలో రెండొంతుల నిధులు సుమారు రూ.600 కోట్లు తూర్పుగోదావరి జిల్లాకు కేటాయించనున్నారు. మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్‌గా వ్యవహరిస్తున్న ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు, ఉప ముఖ్యమంత్రి నిమ్మలకాయల చినరాజప్పలు అదే జిల్లాకు చెందినవారు కావడంతో సింహభాగం నిధులు కేటాయించారన్న వాదనలు వినిపిస్తున్నాయి. జిల్లాకు అనుకున్న స్థాయిలో నిధులు కేటాయించ పోవడంపై స్థానిక ప్రజాప్రతినిధులు కొంత అసంతృప్తితో ఉన్నారు. దేవాదాయశాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు నిధుల కేటాయింపు కోసం గట్టిగా ప్రయత్నించినప్పటికీ టీడీపీ నేతల సిఫారసులకే అధిక ప్రాధాన్యం ఇచ్చారన్న వాదనలు వినిపిస్తున్నాయి.
 
 రోడ్డు వంతెన ప్రారంభిస్తారా?
 ఉభయగోదావరి జిల్లాల్లో ఈసారి నిర్వహించే పుష్కరాలకు సుమారు ఐదు కోట్ల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నారుు. ప్రస్తుతం రోడ్డు కం రైలు వంతెన పూర్తిగా దెబ్బతింది. దీంతో గోదావరిపై నిర్మిస్తున్న రెండో రోడ్డు వంతెనను ప్రారంభించకపోతే ట్రాఫిక్ ఇబ్బం దులు తలెత్తే అవకాశం ఉంది. వాస్తవానికి 2012 మే నాటికి ఈ వంతెన నిర్మాణం పూర్తి కావాల్సి ఉన్నప్పటికీ వరదలు, భూసేకరణ ఇబ్బందులు, ఇసుక కొరత తదితర కారణాలతో నేటీకీ పనులు పూర్తికాలేదు. ప్రస్తుతం అన్ని అడ్డంకులు తొల గినందున ప్రభుత్వం వచ్చే పుష్కరాల సమయానికైనా వంతెన ప్రారంభానికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
 

Advertisement
Advertisement