నానాటికి తీసికట్టు..పుష్కర బడ్జెట్టు | Sakshi
Sakshi News home page

నానాటికి తీసికట్టు..పుష్కర బడ్జెట్టు

Published Thu, Nov 27 2014 1:21 AM

Preparations begin for Godavari Pushkaralu

ప్రకాశ్‌నగర్ (రాజమండ్రి) :గోదావరి పుష్కరాలకు రాజధాని లాంటిది రాజమండ్రి. నదిలో పుణ్యస్నానాలకు భక్తులు వెల్లువెత్తేదీ ప్రధానంగా ఈ నగరానికే. అలాంటి చోట ఆ మహాపర్వానికి నగరపాలక సంస్థ తరఫున పుష్కరాల అంచనాలు.. వేసవిలో గోదావరిలా నానాటికీ సన్నగిల్లిపోతున్నాయి. మొదట నగరపాలక సంస్థ రూ.200 కోట్లతో సాధారణ బడ్జెట్ తయారు చేసి, అందులో రూ.90 కోట్లు పుష్కరాల బడ్జెట్ చూపించి, ఆమోదం కోసం ఉన్నతాధికారులకు పంపింది. తరువాత ఎన్నికలు జరిగి, కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక మొదట రూ.90 కోట్లు, తరువాత రూ.160 కోట్లు, రూ.274 కోట్లు అంటూ అంచనాలను హెచ్చిస్తూ వెళ్లారు.
 
 అయితే లోటు బడ్జెట్ అంటూ ప్రభుత్వం ఆ అంచనాల్ని కుదించాలని ఆదేశించింది. ముందు సాధారణ నిధుల నుంచే ఖర్చు చేయాలనీ సూచించింది. దీంతో నగరపాలక సంస్థ అధికారులు అంచనాలను రూ.30 కోట్లకు కుదించారు. రానున్న పుష్కరాల్ని 144 ఏళ్ల తరువాత వస్తున్న ‘మహాపుష్కరాలు’గా (దీనికి ప్రమాణం ఏమిటో, ఏ కాలమానం ప్రకారం మహాపుష్కరాలుగా పరిగణించాలో స్పష్టం కావలసి ఉంది) కొందరు పేర్కొంటున్నారు. దీంతో ఈ పుష్కరాలకు జాతీయ స్థాయిలో ప్రాధాన్యం ఏర్పడింది. పుష్కర కేంద్రం వంటి రాజమండ్రిలోనూ ఆస్థాయిలోనే ఏర్పాట్లు జరగాలి. అయితే.. ఆకాశమే హద్దు అంటూ ప్రకటనలు చేసిన మంత్రివర్గ ఉపసంఘం చివరకు నామమాత్రపు కేటాయింపులతో సరిపెట్టుకోమంటున్నట్టు సమాచారం.
 
 పుష్కరాలపై సమావేశమైన ప్రతిసారీ బడ్జెట్ అంచనాలను కుదించడం గమనార్హం. చూడబోతే రాష్ట్ర ప్రభుత్వం ఈ పుష్కరాల నిర్వహణకు పూర్తిగా కేంద్ర ప్రభుత్వంపైనే ఆధారపడినట్టు కనిపిస్తోంది. పుష్కరాల ముహూర్తం ముంచుకొస్తున్నా ఏర్పాట్లపై అధికార యంత్రాంగంలో కదలిక లేదు.  అవసరాల మేరకు నిధులు మంజూరు కాకపోతే.. ప్రధానమైన పారిశుద్ధ్యం, యాత్రికులకు తాత్కాలిక సౌకర్యాలు, పైపు మెరుగులతో సరిపెట్టాలన్నది అధికారుల ఆలోచనగా కనిపిస్తోంది. అదే జరిగితే.. 2003 పుష్కరాలకు కొత్త వన్నెలు అద్దుకుని, అభివద్ధి చెందిన రాజమండ్రి ఈసారి అందుకు భిన్నంగా చిన్నబోయే అవకాశముంది.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement