‘ఉపాధి’.. పచ్చ పునాది | Sakshi
Sakshi News home page

‘ఉపాధి’.. పచ్చ పునాది

Published Sun, Apr 12 2015 3:02 AM

‘ఉపాధి’.. పచ్చ పునాది - Sakshi

ఎఫ్‌ఏల నియామక బాధ్యత జన్మభూమి కమిటీలకు
- 939 మంది ఫీల్డ్ అసిస్టెంట్ల నియామకాలకు సన్నాహాలు
- జన్మభూమి కమిటీలు సూచించిన వారికే ఉద్యోగాలు

సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో కిందిస్థాయిలో పచ్చ చొక్కాల పంట పండుతోంది. గతంలో ‘పనికి ఆహారం’ తరహాలోనే ఇప్పుడు పచ్చ చొక్కాలకు పనులు అప్పగిస్తున్నారు. సామాజిక కార్యకర్తల పేరుతో అధికార తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులతో ప్రతి గ్రామంలో ఇప్పటికే ఏర్పాటు చేసిన జన్మభూమి కమిటీలు సిఫారసు చేసిన వారికే ప్రభుత్వ ప్రయోజనాలు చేకూరనున్నాయి. ఆఖరుకు ప్రభుత్వ ఉద్యోగులను నియమించే బాధ్యతలను కూడా ఆ కమిటీలకే అప్పగించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. తాజాగా ఉపాధి హామీ పథకంలో ఫీల్డు అసిస్టెంట్ ఉద్యోగాలు కూడా ఈ కమిటీలు సూచించిన వారికే దక్కబోతున్నాయి.
 
వారికే ‘ఉపాధి’
చంద్రబాబు తిరిగి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక వృద్ధాప్య, వితంతు, వికలాంగుల పింఛనుదారులలో అనర్హుల ఏరివేత  కోసమంటూ గతేడాది సెప్టెంబర్ 17వ తేదీన గ్రామ, మున్సిపల్ వార్డు స్థాయిలో కమిటీల నియామకానికి ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం ఆరుగురు ఉండే ఈ కమిటీలో నలుగురు ఆయా జిల్లా మంత్రి సూచించినవారే ఉంటారు. మిగిలిన ఇద్దరిలో ఒకరు సర్పంచ్, మరొకరు ఆ గ్రామ ఎంపీటీసీ సభ్యుడు. అప్పట్లో గ్రామాల్లో పింఛన్లలో కోతలు పెట్టడానికి అనర్హుల గుర్తింపు బాధ్యతను ఈ కమిటీలకు అప్పగించారు.

అవి ఫింఛన్లకు అర్హులైన లక్షలాది మందిని కూడా ఈ కమిటీలు ఏరివేశాయి. వీటిపై మరోసారి పరిశీలన జరిపినప్పుడు అర్హులను ఏరివేశారని తేలింది. దీంతో చివరికి ప్రభుత్వం పునఃవిచారణ చేసి.. తొలగించిన వారిలో సగానికి ఎక్కువమందికి తిరిగి పింఛన్లు మంజూరు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అటువంటి ఈ కమిటీలను ఆ తరువాత ప్రభుత్వం అనేక ఇతర సంక్షేమ కార్యక్రమాల లబ్ధిదారుల ఎంపికలోనూ భాగస్వాములుగా చేసింది. ప్రభుత్వం నిర్వహించే జన్మభూమి-మావూరు కార్యక్రమ బాధ్యతలను ఈ కమిటీలకే అప్పగించారు.

ఇప్పుడు ఇదే కమిటీలకు ఉపాధి హామీ పథకంలో ఫీల్డు అసిస్టెంట్ల ఎంపిక ప్రక్రియను అప్పగించారు. ఇప్పటికే ఫీల్డు అసిస్టెంట్ ఉద్యోగం ఖాళీగా ఉన్న గ్రామంలో ఉన్న ఈ జన్మభూమి కమిటీ ముగ్గురు పేర్ల జాబితాను స్థానిక ఎంపీడీవోకు అందజేస్తుంది. ఆ ముగ్గురిలో ఒకరిని ఎంపీడీవో తప్పనిసరిగా ఎంపిక చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు ఫీల్డు అసిస్టెంట్ల ఎంపిక ప్రక్రియకు సంబంధించి మార్గదర్శకాలను ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి శాఖ సర్క్యులర్ నం. 3141ని జారీ చేసింది.
 
పదిరోజుల్లో నోటిఫికేషన్లు
రాష్ట్రంలో 13,083 గ్రామపంచాయతీల్లో ఉపాధి హామీ పథకం అమలులో ఉంది. అయితే గ్రామంలోని మొత్తం కూలీలందరికీ కలపి ఏడాదికి వెయ్యి రోజులకు మించి పనిదినాలు కల్పించేచోట్ల మాత్రమే ఫీల్డు అసిస్టెంట్‌ను నియమిస్తారు. ఇలాంటివి దాదాపు పదివేల గ్రామాల వరకు ఉండగా.. వీటిలో ప్రస్తుతం 939 గ్రామపంచాయతీల్లో ప్రస్తుతం ఫీల్డు అసిస్టెంట్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. వీటి భర్తీకి పదిరోజుల్లో ఆయా జిల్లాల డ్వామా పీడీలు నోటిఫికేషన్లు జారీ చేయనున్నారు.  ఫీల్డు అసిస్టెంట్ ఎంపికకు గాను ఐదు రకాల నిబంధనలను పాటించాలని గ్రామ జన్మభూమి కమిటీలకు ప్రభుత్వం సూచించింది.
 
రేషన్ కార్డుల్లోనూ...
గతేడాది ప్రభుత్వం నిర్వహించిన జన్మభూమి-మా ఊరు కార్యక్రమం సందర్భంగా రేషన్ కార్డుల్లేని వారినుంచి అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. ఇందులో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా 11.05 లక్షల మంది నుంచి దరఖాస్తులు వచ్చాయి. ఈ రకంగా అందిన దరఖాస్తుల్లో అర్హులను గుర్తించే బాధ్యతను జన్మభూమి కమిటీలకు అప్పగించారు. ఇది అందరికీ ఆందోళన కలిగిస్తోంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement