సమష్టి పోరుకు సిద్ధం | Sakshi
Sakshi News home page

సమష్టి పోరుకు సిద్ధం

Published Tue, Nov 11 2014 1:16 AM

సమష్టి పోరుకు సిద్ధం - Sakshi

నవ్యాంధ్ర రాజధాని నిర్మాణంపై ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలు అటు రైతులు, ఇటు ప్రజల్లో తీవ్ర భయాందోళనలు రేపుతున్నాయి. తొలుత తుళ్లూరు మండలంలో 14 గ్రామాలు, మంగళగిరి మండలంలో మూడు గ్రామాల్లో భూ సమీకరణ చేయనున్నట్టు ప్రకటించారు. రెండు రోజుల కిందట తాడికొండ మండలాన్ని కూడా  చేర్చినట్టు  ప్రకటన చేయడంతో మరో మారు వ్యతిరేకత వ్యక్తచేస్తున్న రైతులు ప్రభుత్వంపై సమష్టి పోరుకు సిద్ధమవుతున్నారు.
 
 ముఖ్యమంత్రి చంద్రబాబు రెండో విడత మరికొన్ని గ్రామాల జాబితా ప్రకటించడంతో అక్కడి రైతుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. విజయవాడ,గుంటూరు పాత జాతీయ రహదరి సమీపంలో ఉండవల్లి, ఉండవల్లి సెంటరు, పెనుమాక, నులకపేట, డోలాస్‌నగర్, అంబటినగర్, యర్రబాలెం, నవులూరు, నిడమర్రు గ్రామాలు ఉన్నాయి. ఇక్కడ ఇప్పటికే ఎకరా భూమి రూ.4 నుంచి రూ.5 కోట్ల వరకు ఉంది. దీంతోపాటు మూడు పంటలు పండే భూములు కావడంతో రైతులు తమ భూములు ఇచ్చేందుకు విముఖత వ్యక్తం చేస్తున్నారు.
 
  ఇందులో భాగంగా పెనుమాక, ఉండవల్లి గ్రామస్తులు తమ భూములు ఇచ్చేది లేదంటూ సోమవారం జిల్లా కలెక్టర్ కాంతిలాల్‌దండేను కలిసేందుకు వెళ్లారు.
 
  మరోవైపు తుళ్లూరు మండలంలో కృష్ణానది కరకట్ట సమీపంలోని ఐదు గ్రామాల ప్రజలు రాజధానికి భూములు ఇచ్చేది లేదని తేల్చిచెప్పారు. గ్రామ తీర్మానాల కాపీలనుసైతం అధికారులకు అందచేశారు. తాజాగా మంగళగిరి పరిధిలోని గ్రామాల రైతులు వీరికి జతకలవడంతో రాజధానికి భూముల సమీకరణ వ్యవహారం వేడెక్కింది.
 
  రాజధాని కోసం సేకరిస్తున్న భూముల విషయంలో ఇప్పటి వరకు ప్రభుత్వం ఎలాంటి స్పష్టతనివ్వలేదు. రోజుకో ప్రకటన చేస్తూ రైతులు, ప్రజలను అయోమయానికి భయాందోళనలకు గురిచేస్తోంది.
 
  ఇలాంటి సమయంలో రైతులకు పూర్తిగా అండగా నిలవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకుంది. ఈ నెల 13, 14 తేదీల్లో రాజధాని భూములను పరిశీలించేందుకు వైఎస్సార్‌సీపీ కమిటీ సభ్యులు తుళ్లూరు మండలంలో పర్యటించనున్నారు.
 
  ఇదిలావుంటే వెంటనే శాసనసభ సమావేశం ఏర్పాటు చేసి అసెంబ్లీలో రాజధానిపై తీర్మానం చేయాలని కోరుతూ స్పీకర్ కోడెల శివప్రసాద్‌కు రాయపూడి సొసైటీ అధ్యక్షుడు  హరేంధ్రనాధ్‌చౌదరి సోమవారం లేఖ రాశారు. ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్ సీపీతో పాటు మిగిలిన ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను అసెంబ్లీలో తెలుసుకోవాలని ఆయన లేఖలో పేర్కొన్నారు.
 
  రాష్ట్ర ప్రభుత్వం తొలుత రాజధాని పరిధిలోకి తుళ్లూరు, మంగళగిరి మండలాల్లో 18 గ్రామాలను తీసుకువస్తున్నట్లు ప్రకటించింది. రెండురోజుల కిందట తుళ్లూరు, మంగళగిరి, తాడికొండ మండలాల పరిధిలోని 29 గ్రామాలను రాజధాని పరిధిలోకి చేర్చినట్టు చంద్రబాబునాయుడు ప్రకటించారు. దీంతో మంగళగిరి మండలం పరిధిలోని రైతుల్లో ఒక్కసారిగా తీవ్ర నిరాశ, నిస్పృహలు అలుముకున్నాయి. - ఎట్టిపరిస్థితుల్లోనూ రాజధానికి భూములు ఇచ్చేది లేదని తేల్చిచెబుతున్నారు. రైతులు ప్రత్యేక సమావేశాలు నిర్వహించడంతో పాటు తుళ్లూరు మండలం పరిధిలోని ఐదు గ్రామాల రైతులతో మాట్లాడుతున్నారు. ప్రభుత్వంపై సమష్టి పోరుకు సిద్ధమవుతున్నారు.
 
  వేలాది మంది సన్నకారు రైతుల భూములు ప్రభుత్వం లాక్కుంటే ఆయా కుటుంబాలు రోడ్ల పాలవుతాయని ఆందోళన వ్యక్తం చేస్తూ తమ పొలాలను ప్రభుత్వానికి ఇచ్చేది లేదని మంగళగిరి మండలంలోని పెనుమాక, ఉండవల్లి గ్రామాల రైతులు నినదించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్‌కు వెళ్లి అక్కడి ఏవోకు వినతిపత్రం సమర్పించారు.
 
  ఈ రెండు గ్రామాల్లో 18 వేల మంది జనాభా ఉండగా, 3,026 ఎకరాల పట్టాభూమి ఉంది. అందులో 2,500 మంది రైతులు సాగు చేస్తున్నారు. కూరగాయలు ఇతర ఎక్కువ ఆదాయం వచ్చే పంటలు పండిస్తున్నారు. సంవత్సరానికి ఎకరాకు లక్షా యాభై వేల నుంచి రెండు లక్షల వరకు ఆదాయం లభిస్తోంది. ఈ భూముల ధరలు  ఐదేళ్ల కిందటే ఎకరా రూ. 4 కోట్లు నుంచి 6 కోట్ల  వరకు ధర పలికింది. ప్లాట్ల విషయంలో గజం 8 వేల వరకు విలువ ఉందని, ప్రస్తుతం ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీకి ఎట్టిపరిస్థితుల్లో గిట్టుబాటు కాదని వారు చెబుతున్నారు.

Advertisement
Advertisement