కాసులివ్వండి..! నేరస్తులను తీసుకెళ్లండి..!! | Sakshi
Sakshi News home page

కాసులివ్వండి..! నేరస్తులను తీసుకెళ్లండి..!!

Published Tue, Jan 6 2015 1:52 AM

కాసులివ్వండి..! నేరస్తులను తీసుకెళ్లండి..!!

లక్షలు నొక్కేసి నిందితుని వదిలివేత
కమిషనరేట్‌లో పెరిగిన అవినీతి

 
విజయవాడ సిటీ : ఆసియాలోనే అతిపెద్దదైన జవహర్ ఆటోనగర్‌లో పాత వాహనాల ఖండం(డిస్‌మాంటిలింగ్) వ్యవహారాలు అక్రమాలకు నెలవుగా మారుతున్నాయి. పోలీసు అధికారుల వెన్నుదన్నుతో నిబంధనలకు విరుద్ధంగా వాహనాల ‘సి బుక్’లను విక్రయించి కొందరు వ్యాపారులు కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నారు. వీటిని కొనుగోలు చేసే వ్యక్తులు సరుకుల లోడు మాయం చేసేందుకు.. ఫైనాన్స్ కంపెనీలను మోసగించేందుకు వినియోగిస్తున్నారు. మూడు రోజుల కిందట సి బుక్‌ల విక్రయం కేసులో అదుపులోకి తీసుకున్న డిస్‌మాంటిల్ వ్యాపారిని లక్షలు నొక్కేసి పోలీసులు వదిలేశారు. గతంలో కూడా ఈ తరహా కేసుల్లో పలువురు పట్టుబడినప్పటికీ.. ఎప్పటికప్పుడు పోలీసులను మామూళ్ల మత్తులో ముంచుతూ బయటపడుతున్నట్టు ఆరోపణలు వినబడుతున్నాయి.

ఇదీ జరిగింది

ఆటోనగర్ ఐదో రోడ్డుకు చెందిన ఓ డిస్‌మాంటిల్ వ్యాపారి తన భాగస్వాములతో కలిసి నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో 200 పైబడి పాత వాహనాలు కొనుగోలు చేశాడు. వీటిని తుక్కు కింద చేసిన తర్వాత సి బుక్‌లను బళ్లారి ప్రాంతానికి చెందిన కొందరు వ్యక్తులకు మోడల్‌ను బట్టి రూ.1లక్ష నుంచి 5లక్షల వరకు విక్రయించాడు. వీటిని దొంగ వాహనాలకు వినియోగించేందుకు అక్కడి వారు కొనుగోలు చేసినట్టు తెలిసింది. కొనుగోలు చేసిన సి బుక్స్‌లోని ఇంజిన్, ఛాసిస్ నంబర్లు మార్చేందుకు ఆటోనగర్‌లోనే కొందరు ప్రత్యేకంగా ఉన్నారు. వీరి ద్వారా లారీల ఇంజిన్, ఛాసిస్ నంబర్లను మార్చేసిన ‘బళ్లారి బాబులు’ పెద్ద ఎత్తున ఐరన్ ఓర్, నిత్యావసర సరుకులు  మాయం చేసినట్టు తెలిసింది. వరుస ఘటనలపై దృష్టిసారించిన బళ్లారి పోలీసులకు ఈ వ్యవహారాలు విజయవాడ కేంద్రంగా సాగుతున్నట్టు గుర్తించారు. ఎవరెవరు ఇందుకు సూత్రధారులో గుర్తించేందుకు బళ్లారి పోలీసులు సమాయత్తమవుతున్న విషయం ‘తూర్పు మండలం’ లోని ఓ పోలీసు స్టేషన్ అధికారికి ఉప్పందింది. ఆపై ఆయన రంగంలోకి దిగి తన పని చక్కబెట్టుకున్నారు.
 
రంగంలోకి పాత నేరస్తులు

గతంలో ఈ తరహా నేరాలు చేసిన ఇద్దరు వ్యక్తులు పోలీసు అధికారిని కలిసి మంతనాలు జరిపారు. రూ.6 లక్షలు ఇస్తే వదిలేస్తానని ఆ అధికారి బేరం పెట్టారు. బెంజిసర్కిల్ సమీపంలోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో ఇరువర్గాల మధ్య గంటలకొద్దీ చర్చలు జరిగాయి. ఎట్టకేలకు రూ.3లక్షలు ఇచ్చేందుకు మధ్యవర్తులు అంగీకరించారు. చర్చలు జరిగిన చోటనే నగదు లావాదేవీలు నిర్వహించేందుకు చేసుకున్న ఒప్పందంలో భాగంగా స్టేషన్‌లో ఉంచిన వ్యక్తిని వదిలేశారు. వ్యవహారం సద్దుమణిగే వరకు కొద్ది రోజుల పాటు ఊరు విడిచి వెళ్లాలంటూ ఆ పోలీసు అధికారి చేసిన సూచనకు వారు అంగీకరించారు. అనుకున్నట్టుగానే ఆదివారం నగదు ముట్టింది. విషయం కమిషనరేట్‌లోని కొందరు అధికారులకు తెలియడంతో.. బదిలీపై మరో జోన్‌కు వెళుతూ కూడా బహుమానంగా రూ.3లక్షలు పట్టుకెళ్లాడనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
 
అర్ధరాత్రి వరకు హైడ్రామా

సమాచారం వచ్చిన వెంటనే ఆటోనగర్‌కు చెందిన డిస్‌మాంటిల్ వ్యాపారిని గత శనివారం స్టేషన్‌కి తీసుకొచ్చి అర్ధరాత్రి వదిలేయడం వరకు హైడ్రామా చోటు చేసుకుంది. గతంలో రాజమండ్రి, కాకినాడ, విశాఖపట్నం నుంచి ఈ తరహా కేసులు రాగా, సెటిల్ చేసుకున్న వ్యవహారాలను ఉటంకించారు. తుక్కు చేసిన వాహనాల సి బుక్స్ విక్రయించడం నేరం కాబట్టి కేసు నమోదు చేయక తప్పదన్నారు. తాను అరెస్టు చేసిన తర్వాత బళ్లారి పోలీసులు కూడా వచ్చి అరెస్టు చేస్తారని హెచ్చరించారు. ఏదో ఒకటి సెటిల్ చేసుకోమంటూ హితబోధ చేశారు. ఉదయం నుంచి రాత్రి వరకు స్టేషన్‌లోనే నిర్బంధించడంతో సెటిల్ చేసుకునేందుకు వారు ముందుకొచ్చారు.
 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement