అక్రమ రవాణాను అడ్డుకోలేరా? | Sakshi
Sakshi News home page

అక్రమ రవాణాను అడ్డుకోలేరా?

Published Tue, Sep 23 2014 3:18 AM

అక్రమ రవాణాను అడ్డుకోలేరా? - Sakshi

సాక్షి, నెల్లూరు : తక్కువ సమయంలో లక్షలు కొల్లగొట్టే ఆదాయ వనరుగా మారిన ఎర్రచందనం స్మగ్లింగ్ పతాక స్థాయికి చేరింది. కొందరు ప్రజాప్రతినిధులతో పాటు కొన్ని పార్టీల్లో కీలకపాత్ర పోషిస్తున్న నేతలు స్మగ్లర్ల అవతారం ఎత్తడంతో అక్రమ రవాణాకు అడ్డూఅదుపూ లేకుండా పోయింది. అధికారుల్లోనూ కొందరి అండ లభిస్తుండటంతో ఈ అక్రమ వ్యాపారం మూడు చెట్లు..ఆరు దుంగలుగా సాగిపోతోంది. ప్రభుత్వం అదనపు బలగాలను అడవుల్లో మోహరించినా, సిబ్బందికి ఆయుధాలిచ్చినా దుంగల దొంగలకు మాత్రం అడ్డుకట్ట వేయలేకపోతున్నారు.
 జిల్లాలోని మర్రిపాడు, అనంతసాగరం, ఆత్మకూరు, సీతారామపురం, వెంకటగిరి, రాపూరు, డక్కిలి, కలువాయి ప్రాంతాల్లోని అడవుల్లో సుమారు 1.90 లక్షల హెక్టార్లలో ఎర్రచందనంచెట్లు విస్తరించివున్నాయి. నాణ్యమైన ఈ చందనానికి విదేశాల్లో గిరాకీ ఉండడంతో స్మగ్లర్ల కన్ను ఈ చెట్లపై పడింది. అటవీశాఖలోని కొందరు ఇంటి దొంగల సహకారంతో పలువురు నేతలతో పాటు
 కొందరు ప్రజాప్రతినిధులు కూడా స్మగ్లర్ల అవతారం ఎత్తారు. చిత్తూరు, వైఎస్సార్ కడప, నెల్లూరు జిల్లాలకు చెందిన పలువురు ఈ స్మగ్లింగ్ వ్యవహారంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. స్థానిక కూలీలతో పాటు తమిళనాడు నుంచి కూలీలను రప్పించి కోట్లాది రూపాయల విలువైన ఎర్రచందనాన్ని చెన్నై, బెంగళూరు మీదుగా ఎగుమతి చేస్తూ కోట్లు గడిస్తున్నారు.
 ఇంటి దొంగల అండతోనే..
 ఎర్రచందనం స్మగ్లింగ్ రోజురోజుకూ పెరుగుతున్నా అటవీశాఖ అధికారులు అడ్డుకుంటున్న దాఖలాలు లేవు. ఆ శాఖలోని కొందరు అధికారులే స్మగ్లర్లతో కుమ్మక్కు కావడంతో నిజాయితీగా పనిచేసేవారున్నా అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. ధైర్యంగా ముందుకు సాగిన వారు దాడులకు గురికావాల్సి వస్తోంది. స్మగ్లర్లకు సహకరించారనే ఆరోపణలపై ఇప్పటికే మూడు జిల్లాల పరిధిలో 40 మందికిపైగా అధికారులపై చర్యలు తీసుకున్నారు. చర్యల నుంచి తప్పించుకున్న వారి సంఖ్య భారీగానే ఉందనే ఆరోపణలున్నాయి. ఇటీవల ఓ డీఎఫ్‌ఓ భారీ ఎత్తున నగదు తీసుకెళుతూ పట్టుబడగా, తాజాగా స్మగ్లర్లతో కుమ్మక్కైన ఓ డీఎస్పీ ఉదంతం వెలుగులోకి రావడం గమనార్హం.
 సివిల్ పోలీసులకూ పాత్ర
 స్మగ్లింగ్ వ్యవహారంలో అటవీ అధికారులు, సిబ్బందితో పాటు పోలీసుల పాత్రపైనా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎర్రచందనం స్మగ్లింగ్‌కు సహకరిస్తున్నారనే ఆరోపణలపై వైఎస్సార్ కడప జిల్లాలో 2007లో ముగ్గురు సీఐలతో పాటు 21 మంది పోలీసులు, ఫారెస్ట్ సిబ్బందిని సస్పెండ్ చేయడం అప్పట్లో సంచలనం సృష్టించింది. తాజాగా అదే ఆరోపణలతో అదే జిల్లాలో ఓ డీఎస్పీపై సస్పెన్షన్ వేటు పడింది. అయితే సివిల్ పోలీసులతో పాటు అటవీశాఖ ఉద్యోగులు అనేక మంది చర్యల నుంచి తప్పించుకుంటూ స్మగ్లింగ్‌లో కీలకపాత్ర పోషిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఉన్నతాధికారులు వీరిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తున్న దాఖలాలు లేవు. ఏదేని ఘటన జరిగినప్పుడు ప్రకటనలతో హడావుడి చేసి అనంతరం మౌనం దాలుస్తున్నారనే విమర్శలున్నాయి.
 ప్రకటనలకే పరిమితం..
 చిత్తూరు జిల్లాలో అటవీశాఖ అధికారులపై స్మగ్లర్లు దాడులు చేసి హతమార్చిన నేపథ్యంలో సిబ్బందికి ఆయుధాలిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఆయుధాలు నామమాత్రంగా వచ్చాయి. ఇక కూంబింగ్ కోసం అటవీశాఖలోని యువకులైన సిబ్బందితో పాటు సివిల్, ఏపీఎస్పీ బలగాలను మోహరించారు. వారికి కండిషన్‌లో ఉన్న వాహనాలను సమకూరుస్తామని ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ప్రకటించారు. ఇవన్నీ సక్రమంగా ఎప్పటికి అమలై, స్మగ్లింగ్‌కు పూర్తి స్థాయిలో ఎప్పుడు అడ్డుకట్ట పడుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది.



 

Advertisement
Advertisement