ఎంత రుణం ఇవ్వొచ్చో అంతకే మాఫీ | Sakshi
Sakshi News home page

ఎంత రుణం ఇవ్వొచ్చో అంతకే మాఫీ

Published Thu, Sep 18 2014 1:36 AM

Previously waived the loan may

బంగారం రుణాల మాఫీలో ఏపీ సర్కారు మరో మెలిక
 
హైదరాబాద్: బంగారంపై పంట రుణం తీసుకున్న రైతులకు రుణమాఫీ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో షరతు విధించిం ది. మాఫీ భారాన్ని తగ్గించుకునే ప్రయత్నాల్లో భాగంగా రెండు రోజులకోసారి కొత్తగా ఆంక్షలు విధిస్తుండటం గమనార్హం. రాష్ట్రంలోని 13 జిల్లా ల్లో పంట రుణాలకన్నా బంగారం కుదవపెట్టి తీసుకున్న పంట రుణాలు అత్యధికంగా ఉండటంతో వీలైనంతగా ఆ రుణ మాఫీ భారాన్ని తగ్గించుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్. కృష్ణారావు మంగళవారం జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో తాజాగా మరో నిబంధన విధించారు. ఈ నేపథ్యంలో బంగారం కుదవపెట్టి రుణం తీసుకున్న రైతులకు మాఫీ వెసులుబాటు అంతంత మా త్రంగానే దొరుకుతుందని, ప్రభుత్వంపై మాఫీ భారం తగ్గిపోతుందని అధికారవర్గాలు అభిప్రాయపడుతున్నారుు. ఏ పంటకు ఎంత మేర రుణం ఇవ్వాలో (స్కేల్ ఆఫ్ ఫైనాన్స్) అనే అంశంపై బ్యాంకర్లకు స్పష్టమైన నిబంధనలున్నారుు. ఈ నిబంధనల మేరకు తీసుకున్న రుణ మెుత్తాలకే మాఫీ వర్తింపజేయనున్నారు. అంటే బంగారం కుదవ పెట్టి ఎకరం వరి పంటకు లక్ష రూపాయలు రుణం తీసుకున్నప్పటికీ.. నిబంధనల ప్రకారం ఎకరం వరి పంటకు ఎంతమేరకు రుణం ఇవ్వవచ్చో.. అంత మేరకే రుణ మాఫీ వర్తింప చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నమాట.

ఒకవేళ ఎకరం వరి పంటకు రూ.25 వేలు మాత్రమే రుణం మంజూరు చేయాలనే నిబంధన ఉండి.. రైతు లక్ష రూపాయల రుణం తీసుకున్నాడనుకుంటే.. రూ.25 వేల రుణం మాత్రమే మాఫీ అవుతుంది. మిగతా రూ.75 వేలు రైతులే బ్యాంకులకు చెల్లించుకోవాల్సి ఉంటుం దని అధికార వర్గాలు వివరించాయి. ఇతర పంటల విషయంలోనూ ఇదే నిబంధన అమలవుతుంది. ఈ నేపథ్యంలో బంగారం కుదవపెట్టి ఎన్ని ఎకరాల్లో ఏ పంటపై రుణం తీసుకున్నారు, ఆ పంటకు ఎకరానికి ఎంత రుణం మంజూరు చేయాలి.. వివరాలను రుణమాఫీ నమూనా పత్రంలో నింపి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకులకు సూచించింది. ఈ మేరకు నమూనా పత్రంలో భూ విస్తీర్ణం, సర్వే నంబరు, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ తదితర అంశాలను చేర్చారు. బ్యాంకులు ఈ నెల 25వ తేదీ వరకు వివరాలు ఇచ్చేందుకు వీలుగా గడువును పొడిగించారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement