గిట్టుబాటు.. ఒట్టి మాట | Sakshi
Sakshi News home page

గిట్టుబాటు.. ఒట్టి మాట

Published Thu, Mar 24 2016 1:42 AM

గిట్టుబాటు.. ఒట్టి మాట - Sakshi

ధర పెంపుపై సుబాబుల్ రైతులకు హామీ ఇచ్చిన మంత్రి పుల్లారావు
అమలుకు నోచుకోని వైనం
ధర లేక అల్లాడుతున్న రైతులు

  
‘రాష్ట్ర వ్యవసాయ మంత్రి మన జిల్లా శాసనసభ్యులే..ఇంకేముంది ఈ ప్రాంతంలో పంటలకు అవసరమైన చేయూతనిచ్చి ఆక్సిజన్‌గా మారతారు..ప్రకృతి సహకరించినా, లేకున్నా..ఆయన కొండంత అండగా ఉంటార’ని రైతులు ఆశలు పెంచుకున్నారు. ఇందులో సుబాబుల్ రైతులకు మంత్రి హామీలిచ్చి వారి ఆశలకు మరింత ఆయుషు పోశారు. ఆరు నెలల కాలం గడిచింది..మంత్రి హామీల అమలు అటకెక్కింది..సుబాబుల్ ధర తగ్గింది.. రైతులకు మాత్రం కష్టాల కట్టె మిగిలింది.
 
 
చిలకలూరిపేటరూరల్ పేపర్ మిల్లులకు రైతులు సుబాబుల్, జామాయిల్ కర్రను తరలించే ఒప్పంద కాలపరిమితి ముగిసి ఆరు మాసాలైంది. నూతన ఒప్పందంలో భాగంగా గిట్టుబాటు ధరను అమలు చేయాలని వేలాది మంది రైతులు రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు విజ్ఞప్తి చేశారు. దీనిపై మంత్రి మాట్లాడుతూ గిట్టుబాటు ధర అమలు చేయటం కాదు ధరను పెంచుతామని స్వయంగా ప్రకటించారు. వీటితోపాటు కర్రను విక్రయించిన రైతులకు ఆన్‌లైన్ ద్వారా చెల్లింపులు చేసేందుకు మార్కెట్ యార్డుల ద్వారా వేబ్రిడ్జిలలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ విషయాలన్నీ మంత్రి గారు మర్చిపోయినట్లు ఉన్నారు. ధర పెంచడం అలా ఉంచితే కనీసం గిట్టుబాటు ధర కూడా కల్పించ లేదు. పేపర్ మిల్లులతో నూతన ఒప్పందమూ చేసుకోలేదు.

జనవరి 19నన గుంటూరు జెడ్పీ భవన్‌లో పేపర్ కంపెనీలు, ఏఎంసీ చైర్మన్‌లు, కార్యదర్శులు, రైతులు, రైతు ప్రతినిధులతో సమావేశం నిర్వ హించారు. మిల్లులకు కర్ర తరలింపు, గిట్టుబాటు ధరల పెంపు, ఆన్‌లైన్ చెల్లింపులు తదితర అంశాలపై మంత్రి హామీలు ఇచ్చారు. ఇందులో ఏ ఒక్కటీ నేటికీ అమలుకు నోచుకోలేదు.

2015 సెప్టెంబర్‌లో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సుబాబుల్ టన్నుకు రూ. 4,600 నుంచి రూ. 4,800 వరకు, జామాయిల్ రూ. 4,800పైన చెల్లిస్తామని ప్రకటించారు. ఇందుకు భిన్నంగా నేడు సుబాబుల్ గరిష్టంగా రూ. 4,600 ఉండగా కొనుగోళ్లు నిలచిపోయాయి. జామాయిల్ కర్రను కొనే నాథుడే లేకపోవటం విశేషం.

మంత్రి నియోజకవర్గంలో సుబాబుల్‌ను నాదెండ్ల, తూబాడు, సాతులూరు, చందవరం, గణపవరం, కమ్మవారిపాలెం, మద్దిరాల, మాచర్ల నియోజకవర్గంలోని అడిగొప్పుల, దుర్గి ప్రాంతాల్లో సాగు చేస్తారు.

చిలకలూరిపేట మార్కెట్ యార్డు ఆవరణలో వేబ్రిడ్జి ద్వారా కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసి రైతులకు ఆన్‌లైన్ ద్వారా నగదు చెల్లింపులు చేస్తామని పేర్కొని ఆర్భాటంగా ఫిబ్రవరిలో ఏర్పాటు చేశారు. నాటి నుంచి నేటి వరకు ఒక్క టన్ను కర్రను సైతం కొనుగోలు చేయకపోవటం విశేషం.

రైతులకే సుబాబుల్ విక్రయాలు గిట్టుబాటు లభించటం లేదని పేర్కొంటుంటే గత నెల రోజుల నుంచి కూలీలు సైతం తమకు గిట్టుబాటు కావటం లేదని కర్ర కోత ఆపేసి సమ్మె చేస్తున్నారు.
 
గుర్తింపు కార్డులు లేవు
గతంలో సుబాబుల్ పంటను పండించే రైతులకు గుర్తింపు కార్డులు మంజూరు చేసేవారు. నేడు కార్డుల మంజూరు ప్రక్రియను నిలిపివేశారు. కర్రను ఎనిమిది పేపర్ మిల్లులకు చెందిన ప్రతినిధులు గతంలో కొనుగోళ్లు చేశారు. నేడు కేవలం మూడు కంపెనీలకు చెందిన వారు మాత్రమే కొనుగోళ్లకు మొగ్గుచూపుతున్నారు. ఇప్పటికైనా పాలకులు, రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి ఈ విషయంపై దృష్టి సారించి సుబాబుల్‌కు గిట్టుబాటు ధరలు కల్పించి వేలాది మంది రైతులుకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Advertisement
Advertisement