దసరా ఆనందం.. ధరలతో ఆవిరి! | Sakshi
Sakshi News home page

దసరా ఆనందం.. ధరలతో ఆవిరి!

Published Fri, Oct 11 2013 12:47 AM

Price rise makes dasara sour

దసరా పండుగ దగ్గర పడుతున్న కొద్దీ సామాన్యుడి గుండెదడ పెరుగుతోంది. పండుగ సరుకులకు కిరాణా దుకాణానికి వెళ్లాలన్నా.. పిల్లలకు కొత్తబట్టలు కొనేందుకు షాపునకు వెళ్లాలన్నా.. నాలుగైదు సార్లు జేబు తడుముకోవాల్సిన పరిస్థితి. సరదాల దసరా వస్తున్నదని రెండు నెలల నుంచి ప్లాన్ చేసుకున్నా అప్పు మాత్రం తప్పడం లేదు. ఎంత ఒదిగి ఖర్చుచేస్తున్నా కనీసం రూ.10వేలు వదులుతున్నాయి. ముఖ్యంగా వేతన జీవులు ధరల ఛట్రంలో నలిగిపోతున్నారు. 
 
మండిపోతున్న ధరలకు అనుగుణంగా పెరగని జీతం.. అప్పుల ఊబిలోకి నెట్టేస్తోంది. ఏడాదికి ఒక్కసారి చేసుకునే పెద్ద పండుగ కావడంతో ఏదీ కాదనలేని ఖర్చే. ఇద్దరు పిల్లలకు ఒక్కో డ్రెస్సు, భార్యాభర్తలకు చెరో జత కొనాలంటే తక్కువలోతక్కువ రూ.ఆరు వేల పైమాటే ఖర్చు చేయాలి. ఇక పిండి వంటలు సంగతేంటని ఇల్లాలు ప్రశ్నిస్తే.. అవసరమంటవా? అంటూ సణుగుతున్నాడు కుటుంబ పెద్ద. పండుగ పూట పిల్లలు మంది ముఖాలు చూస్తారా.. అంటూ ఇల్లాలు ఒత్తిడి చేస్తే.. తప్పని పరిస్థితిలో సంచీపట్టుకు బయల్దేరాల్సిందే. ఈ పరిస్థితి చూస్తుంటే పండుగ తెచ్చే సరదా ఎంతో కానీ.. పెరిగిన నిత్యావసరాల ధరల ముందు అంతా ఆవిరై పోతోంది!!
 
ఇబ్రహీంపట్నం రూరల్, న్యూస్‌లైన్: పండుగ అంటే ఒకప్పుడు ఓ రెండ్రోజుల ముందు ఇంటికి చుట్టాలు.. అప్పాలు, పిండివంటలు, దావత్‌లు, కొత్త బట్టలు.. ఓహ్! అన్ని వర్గాలకూ సంతోషంగా ఉండేది. ప్రస్తుతం జిల్లాలో ఆ పరిస్థితి ఇప్పుడు లేదు. అసలు పండుగ అంటేనే పట్నం నుంచి పల్లె దాకా ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఉప్పు, పప్పు, నూనె, బియ్యం, ఉల్లిగడ్డలు, కూరగాయలు.. పంచదార, బెల్లం, చింతపండు, కారంపొడి.. అన్ని సరుకుల ధరలు భగ్గుమంటుండటంతో పండుగ జరుపుకోవడానికే భయపడుతున్నారు. నలుగురున్న కుటుంబానికి నాలుగు కారంబిళ్లలు, ఇంత పూస, భక్ష్యాలు చేసుకోవడమే భారంగా మారిన పరిస్థితుల్లో ఇక చుట్టాలనేం పిల్చుకొని దావత్ చేస్తామని ఉసూరుమంటున్నారు. రోజురోజుకూ పెరిగిపోతున్న నిత్యావసర సరుకుల ధరలతో సామాన్యుడికి దసరా సరదా కరువయ్యే పరిస్థితి దాపురించింది.
 
పిండివంటలా వామ్మో!
పేద, ధనిక భేదం లేకుండా దసరాను పెద్ద పండుగగా భావిస్తారు. పిండి వంటలు ఆరగించడానికి ప్రాధాన్యం ఇస్తారు. పండుగకు ఓ రెండ్రోజుల ముందే సకినాలు, అరిసెలు, కారప్పూస, బిళ్లప్పచ్చులు సిద్ధం చేసుకుంటారు. ఇక పండుగ రోజున గారెలు, పూరీలు, పాయసం తప్పనిసరి. అయితే ఈ సారి నూనె, శనగపిండి, మైదా, గోధుమ పిండి, మినపపప్పు, రవ్వ, పెసరపప్పు, పంచదారల ధరలు ఆకాశాన్నంటడంతో పిండివంటలంటేనే సామాన్యులు వామ్మో అంటున్నారు. పండుగ సరుకుల కొనుగోలుకు ముందుకు రావడం లేదు. కొందరైతే ఎక్కడ పండుగ రోజున గ్యాస్ అయిపోతే అదో భారం అనుకుని పిండివంటలు చేయడమే మానుకున్నట్టు చెబుతున్నారు. ఇక దావత్‌లు చేద్దామంటే మటన్, చికెన్ ధరలు కొండెక్కడంతో తలో ముక్క వచ్చేలా కొద్దిగా కొనుగోలు చేసుకునేందుకు నిర్ణయించుకున్నట్టు పేర్కొంటున్నారు.
 
కొత్త దుస్తులు కొనలేం...
దసరా రోజున తప్పనిసరిగా ఇంటిల్లిపాదీ కొత్త దుస్తులు వేసుకొని జమ్మికి వెళ్లడం సంప్రదాయం. అయితే పిల్లలకే ఒక్కో జతకు కనిష్టంగా రూ.వెయ్యి దాకా ధర ఉంటుండటంతో జంకుతున్నారు. ఇక ఒక్కో చీర ధర రూ.1,500 దాకా ఉండటం, పెద్దల ప్యాంటు, షర్టు కలిపి రూ.2,000కి తక్కువ కాకుండా ఉండటంతో కొత్త దుస్తులు కొనలేక పోతున్నామని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంట్లో అందరికీ కొత్త దుస్తులు కొనడానికి రూ.10వేల దాకా ఖర్చు చేయాల్సి వచ్చిందని షాపింగ్ చేసి వచ్చిన వారు పేర్కొంటున్నారు. దుస్తుల ధరలు పోయిన సంవత్సరం కంటే రెట్టింపుస్థాయిలో పెరిగిన మాట వాస్తవమేనని వ్యాపారస్తులు చెబుతున్నారు. గత సంవత్సరం దసరా సీజన్‌లో వారం రోజుల ముందు నుంచే రూ.లక్షల్లో వ్యాపారం చేసినా ఇప్పుడు మాత్రం అంత గిరాకీ లేదని వాపోతున్నారు.
 
ఏం కొనేట్టు లేదు..
పండుగపూట ఆడపిల్లల్ని పుట్టింటికి తీసుకొస్తాం. పిండివంటలు చేస్తాం. కానీ ఈ ధరలు చూస్తే భయమేస్తుంది. అసలు మాలాంటి వారు ఏం కొనే పరిస్థితులు కనిపించడం లేదు. పోయిన సంవత్సరం దసరా పండుగ మొత్తానికి రూ.ఆరు వేల ఖర్చు వచ్చింది. ఇప్పుడైతే ఆ పైసలకు ఇద్దరు పిల్లలకు దుస్తులు కూడా రాని పరిస్థితి.
- మల్లమ్మ, మాన్యగూడ
 
పిల్లల బట్టలకే రూ.3వేలు!
దసరా పండుగ కోసమని అందరికీ ప్రతి సంవత్సరం బట్టలు కొనుక్కుంటాం. ఈ సారి రూ.3వేలు తీసుకొని షాపింగ్‌కు వెళ్తే పిల్లలకు దుస్తులు కొనడానికే అవి సరిపోయాయి. ఇక సరుకుల ధరలు, వంట గ్యాస్ ధర కూడా ఈసారి రెట్టింపయ్యాయి. పండక్కి గ్యాస్ అయిపోతుందేమోనని కట్టెల పొయ్యి మీద వంట చేసుకుంటున్నాం. - పల్లె అనురాధ, గృహిణి, ఆదిబట్ల
 
 సరకు ప్రస్తుత ధర   గతేడాది ధర
 
 1. శనగపిండి 56 45
 2. గోధుమపిండి 26 18
 3. వంటనూనె 99 75
 4. పంచదార 35 28
 5. బెల్లం        46 35
 6. మినపపప్పు 65 55
 7. అల్లం 85 30
 8. వెల్లుల్లి 80 25
 9. ఉల్లిగడ్డ 60 10 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement