‘ప్రయివేట్’కు పచ్చజెండా | Sakshi
Sakshi News home page

‘ప్రయివేట్’కు పచ్చజెండా

Published Mon, May 19 2014 2:13 AM

‘ప్రయివేట్’కు పచ్చజెండా

  • కొత్త ప్రభుత్వం అండతో ట్రావెల్స్ ఖుషీ
  •  దర్జాగా రాకపోకలు
  •  ఆదాయం ఎరగా చూపి తెరచాటు ప్రయత్నాలు
  •  ప్రయివేటు ట్రావెల్స్ ఇక చక్రం తిప్పనున్నాయి. ఇప్పుడిప్పుడే ఊపిరి తీసుకుంటున్న ఆర్టీసీ మళ్లీ కష్టాల బాట పట్టక తప్పదు. కొత్తగా గద్దెనెక్కబోయే సర్కారుకు ఆదాయం ఎరగా వేసి తమహవా కొనసాగిస్తామనే ధీమాను ప్రయివేటు ఆపరేటర్లు వ్యక్తం చేస్తున్నారు. గతంలో కొన్ని దుర్ఘటనలు చోటు చేసుకోవడంతో రవాణా శాఖాధికారులు ప్రయివేటు వాహనాలపై అప్పట్లో కన్నెర్రజేశారు. ఇప్పుడు నాయకుల అండతో మళ్లీ తమ హవా కొనసాగిస్తామని ప్రయివేటు రవాణాదారులు ధీమాగా చెబుతున్నారు.
     
    విశాఖపట్నం, న్యూస్‌లైన్: ప్రయివేట్ ట్రావెల్స్‌కు కాలం కలిసొచ్చింది. సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం విజయం సాధించడంతో ప్రయివేటు ఆపరేటర్లు ఉత్సాహంగా ఉన్నారు. ఇప్పటికే ట్రావెల్స్ వ్యాపారం ఊపందుకుంది. తమ వ్యాపారానికి ఇక అడ్డు లేదని ఆపరేటర్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆ మధ్య కాలంలో మహారాష్ట్రలోని షోలాపూర్, మహబూబ్‌నగర్ వద్ద పాలెం బస్సు దుర్ఘటనలు ప్రయివేట్ ట్రావెల్స్ వ్యాపారంపై తీవ్ర ప్రభావం చూపాయి.

    ప్రభుత్వ చర్యలతో ప్రయివేట్ బస్సుల రాకపోకలు నిలిచాయి. ప్రముఖ ట్రావెల్స్‌కు చెందిన బస్సులు నడుస్తున్నా చిన్నా చితకా ట్రావెల్స్ బస్సులు రోడ్డెక్కడం లేదు. వందలాది బస్సులు బకాయిలు తీర్చలేక ఫైనాన్స్ కంపెనీల గూటికి చేరాయి. త్రైమాసిక పన్నులు, బీమా, ఫిట్‌నెస్ లేని కారణంగా అనేక బస్సులు గ్యారేజీలకు పరిమితమయ్యాయి.

    రవాణా శాఖాధికారులు మార్గమధ్యంలో బస్సులు నిలిపి ప్రయాణికులను ఇబ్బందులకు గురి చేయవద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడంతో వ్యాపారులు సేద తీరారు. గమ్యస్థానంలో సీజ్ చేసుకోవచ్చని హైకోర్టు వెల్లడించిన తీర్పు ఆపరేటర్లకు కలిసివచ్చింది. ఇదే సాకుతో అధికారులు తనిఖీలకు పుల్‌స్టాప్ పెట్టిన సంగతి తెలిసిందే.
     
    చట్టపరంగా రాకపోకలు

    ఇక  రాబోయే రోజుల్లో చట్టపరంగా రాకపోకలు చేస్తామని ఆపరేటర్లు చెబుతున్నారు. కాంట్రాక్ట్ పర్మిట్ ఉండి స్టేజి క్యారియర్‌గా రాకపోకలు చేయడం నిబంధనలకు విరుద్ధమని చట్టం చెబుతోంది. స్టేజి క్యారియర్ పర్మిట్ మంజూరుతో ఎటువంటి ఇబ్బందులు ఉండవు కదా! అనే దిశగా వ్యాపారులు తెరచాటు ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. ‘ఇన్నాళ్లు ఓపిక పట్టాం, ఇక సహించం..వచ్చింది మా ప్రభుత్వం’ అంటూ వారు చెబుతుండడం విశేషం. ‘కోర్టుల ద్వారా పోరాడతాం, అవసరమైతే ప్రత్యేక బిల్లుతో ప్రభుత్వం ద్వారా అనుమతులు కచ్చితంగా పొందుతాం’ అని చెప్పడం గమనార్హం.
     
    ఆదాయం లక్ష్యంగా..
     
    ప్రభుత్వ ఆదాయం కోసం బస్సులకు స్టేజి క్యారియర్ పర్మిట్‌లు మంజూరు చేయడం ఒక్కటే ఉత్తమమని ప్రయివేట్ ఆపరేటర్లు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. విభజనతో ఇరు రాష్ట్రాలకు కోట్ల రూపాయల ఆదాయం రాబట్టవచ్చని అంటున్నారు. ఆదాయం కోసం ఆయా ప్రభుత్వాలు పర్మిట్‌లు మంజూరు చేయక తప్పదని జోస్యం చెబుతున్నారు.
     
    కొండంత అండగా నాయకులు

     
    విజయవాడ, అనంతపురానికి చెందిన లోక్ సభ సభ్యులు ట్రావెల్స్ వ్యాపారానికి పెద్ద దిక్కుగా మారారు. ఇప్పటికే వారిద్దరూ రాష్ట్రంలో ప్రముఖ ట్రావెల్స్‌కు యజమానులుగా ఉన్నారు. ఎన్నికల్లో గెలుపు కోసం రాష్ట్ర వ్యాప్తంగా ట్రావెల్స్ వ్యాపారులు భారీగా వెచ్చించినట్టు తెలిసింది. వ్యాపార లోకానికి నాయకులు కొండంత అండగా ఉండగా తమకు అడ్డుపడేది ఎవరని ఆపరేటర్లు ధీమాగా ఉన్నారు.
     
    ఉద్యమాలతో ఫలితం
     
    ప్రయివేట్ ట్రావెల్స్ వ్యాపారం పుంజుకుంటోంది అంటే ఆర్టీసీ నష్టాలలోకి వెళ్లడం.. అర్థమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ట్రావెల్స్ వ్యాపారం కుదేలవడంతో గతేడాదిగా ఆర్టీసీ పురోగతి సాధించిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ఆర్టీసీ కార్మిక సంఘాలు ఉద్యమించి పోరాడితే ప్రయివేట్ వ్యాపారానికి అడ్డుకట్ట వేయవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Advertisement
Advertisement