‘విభజన’ ఘర్షణ | Sakshi
Sakshi News home page

‘విభజన’ ఘర్షణ

Published Mon, Aug 26 2013 2:03 AM

‘విభజన’ ఘర్షణ - Sakshi

సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నిర్ణయం ఉద్యోగులు, న్యాయవాదుల మధ్య ప్రాంతాల చిచ్చు పెడుతోంది. తాజాగా ఆదివారమిక్కడ ఏపీఎన్‌జీవో కార్యాలయంలో  జరిగిన సీమాంధ్ర న్యాయవాదుల సమావేశంలోకి తెలంగాణ న్యాయవాదులు దూసుకురావటం ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది. సమైక్య ఉద్యమాన్ని మరింత ఉధృతంగా చేయటానికి అవసరమైన భవిష్యత్ కార్యాచరణ గురించి చర్చించటానికి సీమాంధ్ర న్యాయవాదులు ఆదివారం ఏపీఎన్‌జీవో కార్యాలయంలో భేటీ అయ్యారు.
 
 సమావేశానికి ఉద్యోగ సంఘాల నేతలు కూడా హాజరయ్యారు. ఆ సమావేశం వద్దకు తెలంగాణ న్యాయవాదుల జేఏసీ నాయకులు దూసుకొచ్చారు. పెద్ద ఎత్తున జై తెలంగాణ నినాదాలు చేశారు. ‘సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక’ బ్యానర్‌ను తెలంగాణ న్యాయవాదులు లాగేశారు. దీన్ని సీమాంధ్ర న్యాయవాదులు ప్రతిఘటించి అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం, తోపులాట జరిగింది. ఒక దశలో కుర్చీలతో దాడులు చేసుకున్నారు.  పోలీసులు రంగ ప్రవేశం చేసి తెలంగాణ న్యాయవాదులను అక్కడ నుంచి అబిడ్స్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. న్యాయవాదులు పోలీస్‌స్టేషన్ వద్ద నిరసనకు దిగారు.
 
 సమైక్య ఉద్యమం ఉధృతమవుతుంది: ఏపీఎన్‌జీవోలు
 ‘‘హైదరాబాద్‌లో సీమాంధ్ర ఉద్యోగులకు భద్రత కల్పిస్తామని తెలంగాణ రాజకీయ నాయకులు పలుమార్లు ప్రకటించారు. మా కార్యాలయంలో అంతర్గత సమావేశాలను తెలంగాణవాదులు అడ్డుకున్నారు. దాడికి ప్రయత్నించారు. ఇదేనా మీరు కల్పించే భద్రత?’’ అని ఏపీఎన్‌జీవో సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు ప్రశ్నించారు. ఇరు వర్గాల న్యాయవాదుల ఘర్షణ జరిగిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కొందరు రాజకీయ నేతలు కిరాయి రౌడీలను పంపించి అల్లర్లు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
 
 బెదిరింపులు, దాడుల వల్ల తెలంగాణ రాదని.. తెలంగాణ ఉద్యమం నీరుగారిపోతుందని వ్యాఖ్యానించారు. రెచ్చగొట్టే చర్యలతో సమైక్య ఉద్యమం మరింత ఉధృతమవుతుందని చెప్పారు. యూపీఏ తీసుకున్న విభజన నిర్ణయాన్ని పునఃపరిశీలించమని మాత్రమే తాము కోరుతున్నామని, తెలంగాణ ఉద్యమం మీద ఎన్నడూ మాట్లాడలేదని స్పష్టంచేశారు. వచ్చే నెల 7న హైదరాబాద్‌లో 10 లక్షల మందితో సమైక్య సభ జరిపి తీరుతామన్నారు. సమావేశంలో పాల్గొన్న సీమాంధ్ర న్యాయవాదులు మాట్లాడుతూ.. తెలంగాణవాదులు మహిళల పట్ల దురుసుగా ప్రవర్తించారని, అసభ్యంగా మాట్లాడారని ఆరోపించారు.
 
 మా వాదన వినిపించటానికే: టీ-న్యాయవాదులు
 సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ముసుగులో కొంతమంది రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని, అసత్యాలు ప్రచారం చేస్తున్నారని తెలంగాణ న్యాయవాదుల జేఏసీ కోకన్వీనర్ గోవర్ధన్‌రెడ్డి విమర్శించారు. సమావేశానికి హాజరుకావాలని తమకు మెసేజ్‌లు అందాయని, అందుకే తమ వాదన వినిపించటానికి సమావేశానికి వచ్చామని ఆయన చెప్పారు. సీమాంధ్ర ఉద్యోగులను తాము ఎన్నడూ దూషించలేదన్నారు. అన్నదమ్ముల్లా కలిసున్న ఉద్యోగుల మధ్య ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వైషమ్యాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. అశోక్‌బాబును తెరమీదకు తెచ్చి రెచ్చగొట్టే విధంగా ప్రకటనలు చేయిస్తున్నారన్నారు. వచ్చే నెల 7న నిర్వహించ తలపెట్టిన సమైక్య సభకు అనుమతి ఇవ్వద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అనుమతి ఇస్తే.. తర్వాత జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరించారు.
 
 సీమాంధ్ర లాయర్లపై దాడికి ఖండన
 సీమాంధ్ర న్యాయవాదులపై తెలంగాణ న్యాయవాదులు దాడికి పాల్పడడాన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉద్యోగ సంఘాల అధ్యక్షుడు ఏవీ పటేల్ ఒక ప్రకటనలో ఖండించారు. ప్రజాస్వామ్యంలో ఎక్కడైనా సమావేశాలు ఏర్పాటు చేసుకునే హక్కు ఉందన్నారు. ఒకవైపు హైదరాబాద్‌లోని సీమాంధ్రులకు భద్రత కల్పిస్తామని శాంతియాత్రలు చేస్తూ మరోవైపు దాడులు చేయడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. హైదరాబాద్‌లో సీమాంధ్ర ప్రజలకు రక్షణ లేదన్న విషయం తాజా దాడితో మరోసారి రుజువైందన్నారు.

Advertisement
Advertisement