సమస్యల లోగిళ్లు.. సర్కారు స్కూళ్లు | Sakshi
Sakshi News home page

సమస్యల లోగిళ్లు.. సర్కారు స్కూళ్లు

Published Wed, Jun 11 2014 3:00 AM

సమస్యల లోగిళ్లు..  సర్కారు స్కూళ్లు - Sakshi

కనీస వసతులకు నోచుకోని వైనం
మరుగుదొడ్లు, తాగునీరు లేని బడులెన్నో
రేపు పాఠశాలల పునఃప్రారంభం

 
నెల్లూరు(టౌన్) : అన్ని వసతులు కల్పించి ఎక్కడైతే చదువు చెబుతారో ఆ ప్రాంతం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆదాయ వనరులు తక్కువఉన్నా కేరళలో విద్యకు బడ్జెట్‌లో ఎక్కువ నిధులు కేటాయిస్తారు. అందుకే ఆ రాష్ట్రం అక్షరాస్యతలోనే కాకుండా మానవాభివృద్ధి సూచికలో కూడా ముందు వరుసలో నిలుస్తోంది.మన రాష్ట్రంలో విద్యకు ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం బడ్జెట్‌లో నిధుల కోతపడుతోంది. పాలకులెవరైనా విద్యను నిర్లక్ష్యం చేస్తున్నారు. ఫలితంగా మన సర్కారు బడులు.. ఎలాంటి కనీస వసతులకు నోచుకోక సమస్యల వలయంలో చిక్కుకుపోతున్నాయి. ప్రైవేటీకరణ,  సరళీకరణ, సంస్కరణల పేరిట ప్రభుత్వ చదువును పాలకులు నిర్వీర్యం చేస్తున్నారు. చంద్రబాబు లాంటి వారు ఎన్నికల వాగ్దానంలో భాగంగా కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అని చెప్పినప్పటికీ పాఠశాలల్లో సమస్యలు తొలగడం లేదు.  విద్యాహక్కు చట్టాలు వచ్చి సంవత్సరాలు గడుస్తున్నా తాగేందుకు గుక్కెడు నీరు దొరకని సర్కారు బడులున్నాయి. బాలికలు బహిర్భూమికెళ్లాలంటే మరుగుదొడ్లు లేక నరకం అనుభవించిన, అనుభవిస్తున్న సందర్భాలు కోకొల్లలు. కేవలం మరుగుదొడ్లు లేకనే అనేక మంది పేద బాలికలు పాఠశాలలు మానేస్తున్నారని ప్రభుత్వం జరిపిన ఒక సర్వేలోనే తేలింది. ఈ నేపథ్యంలో వేసవి సెలవులు ముగించుకుని పాఠశాలలు గురువారం నుంచి పునఃప్రారంభం కాబోతున్నాయి. పాఠశాలల్లో నెలకొన్న సమస్యలపై ప్రత్యేక కథనం.

జిల్లాలో ఇదీ పరిస్థితి

జిల్లాలో మొత్తం 4,300 పాఠశాలలు ఉన్నాయి. స్థానికసంస్థల ఆధ్వర్యంలో నడిచే  (జెడ్పీ, ఎంపీపీలాంటివి) 2,529 ప్రాథమిక  , 390 ప్రాథమికోన్నత, 305 ఉన్నత పాఠశాలలున్నాయి. నేరుగా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ప్రాథమిక పాఠశాలలు 12, ఉన్నత పాఠశాలలు 14, హయ్యర్ సెకండరీ పాఠశాలలు 7, డైట్ కళాశాల ఒకటి ఉన్నాయి. మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలు 81, మున్సిపల్ ప్రాథమికోన్నత పాఠశాలలు 5, మున్సిపల్ ఉన్నత పాఠశాలలు 20 ఉన్నాయి. ఇవి కాక ప్రైవేటు సంస్థల ఆధ్వర్యంలో అన్ ఎయిడెడ్ ప్రాథమిక పాఠశాలలు 271, ప్రాథమికోన్నత పాఠశాలలు 234, ఉన్నత పాఠశాలలు 245, హయ్యర్‌సెకండరీ పాఠశాలలు 9 నడుస్తున్నాయి. ఇవికాక గురుకుల, కేజీబీ లాంటి మరి కొన్ని పాఠశాలలు కూడా ఉన్నాయి. జిల్లాలో ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో కలిపి దాదాపు నాలుగు లక్షల మంది విద్యార్థులు బడిబాట పడుతున్నారు.  

 సమస్యలకు సజీవ సాక్ష్యాలివిగో:

1. లక్ష్మీపురంలోని బీవీఎస్ మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో  టాయిలెట్స్ లేకపోవడంతో అధికారులు వేసవి సెలవులకు ముందు రెండు లెట్రిన్స్ కట్టించారు. అయితే తలుపులు కూడా బిగించలేదు. పైగా నీటి సదుపాయం  కల్పించలేదు.
2. బాలాజీనగర్‌లో బాజీతోటలోని ప్రాథమిక పాఠశాలలో రెండు చేతి పంపులు మరమ్మతులకు వచ్చాయి. దీంతో తాగునీటికి చిన్నారులు ఏడాదిగా ఇబ్బందులు పడుతున్నా అధికారులు పట్టించుకోలేదు.
3. దర్గామిట్టలో జెడ్పీ బాలికల పాఠశాలలో  రాజీవ్ విద్యామిషన్, ఆర్‌డ బ్ల్యూఎస్ వారు రెండు దఫాలుగా మరుగుదొడ్లు నిర్మించి   నీటి వసతిని కల్పించకపోవడంతో దాదాపు 400 మంది బాలికలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనీసం తాగునీటి వసతిని కూడా కల్పించలేదు. నీటికోసం జెడ్పీ సీఈఓకు విన్నవిస్తే పైపులైను కోసం అంచనాలు వేయమని ఆయన ఏఈని ఆదేశించి ఆరు నెలలైంది. కాని సమస్య తీరలేదు.
4. బుజబుజనెల్లూరు వల్లూరమ్మ కాలనీలోని పాఠశాలలో తగినన్ని బాత్‌రూములు లేవు.
5. విడవలూరు మండలంలోని అలగానిపాడులో నాలుగేళ్లక్రితం హైస్కూల్‌ను ఏర్పాటు చేసిన కనీస వసతులు కల్పించలేదు.
6.స్థానిక కర్ణాలమిట్టలోని గంజిఖానా హైస్కూల్‌లో ఏడాదిగా తెలుగుకు టీచర్ లేరు. దీంతో ఇంగ్లిష్ మాస్టర్ తన సబ్జెక్టుతో పాటు తెలుగును బోధిస్తున్నారు. జిల్లాలో కొన్ని చోట్ల అదనంగా, మరికొన్ని చోట్ల తక్కువగా ఉపాధ్యాయులు ఉన్నారు. ఈ పరిస్థితిని చక్కదిద్దడంలో జిల్లావిద్యాశాఖ విఫలమైంది.
 
 
 

Advertisement
Advertisement