వానవెంటే తెగుళ్లు | Sakshi
Sakshi News home page

వానవెంటే తెగుళ్లు

Published Tue, Sep 8 2015 11:36 PM

వానవెంటే తెగుళ్లు - Sakshi

- ఖరీఫ్ వరికి తెగుళ్ల బెడద
- సాగు వ్యయం తడిసిమోపెడు
- బెంబేలెత్తుతున్న రైతులు
సాక్షి, విశాఖపట్నం :
ఖరీఫ్‌లో వరి సాధారణ విస్తీర్ణం లక్షా 8 వేల హెక్టార్లు. వ్యవసాయాధికారుల లెక్కలప్రకారం ఇప్పటి వరకు 75శాతానికి పైగా నాట్లు పూర్తయ్యాయి. ప్రస్తుతం వర్షాలు పడుతున్నప్పటికీ మిగిలిన ప్రాంతాల్లో నాట్లు వేసినా పంట చేతికొచ్చే సమయంలో లేనిపోని సమస్యలు తప్పవన్న ఆందోళనలో చాలా మంది రైతులున్నారు. వీరంతా ప్రత్యామ్నాయ పంటల వైపు ఆసక్తి కనబరుస్తున్నారు. వారం రోజులుగా అడపా దడపా వర్షాలతో కొంత వరకు ఊపిరి పీల్చుకుంటున్నారు.

ఇక ఇప్పటి వరకు పూర్తయిన నాట్లలో 50శాతానికి పైగా ఆలస్యంగా వేసినవే. అదనుకు ముందే చేలల్లో నీరు చేరి నిల్వ ఉండడంతో నాట్లు దెబ్బతినే అవకాశం ఉందని వారిలో ఒకింత ఆందోళన కనిపిస్తోంది.  ఆలస్యంగా నాట్లు వేసిన ప్రాంతాల్లో వీటి ఉధృతి మరీ ఎక్కువుగా ఉన్నట్టు ఇప్పటికే వ్యవసాయ శాఖాధికారులు గుర్తిం చారు. ముఖ్యంగా 10-15 రోజుల మధ్యలో నాట్లు పడిన చోట చేలల్లో నీటి ఉధృతి రైతులను ఆందోళనకు గురిచేస్తోంది.

వర్షాలు అనుకూలించినా..కలవరమే
సెప్టెంబర్‌లో 8170.4మిల్లీమీటర్లవర్షపాతం నమోదు కావాల్సి ఉండగా..ఇప్పటి వరకు 2075.9 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే రికార్డయింది. ఆరు మండలాల్లో తక్కువ వర్షపాతం నమోదు కాగా, చింతపల్లిలో అసలు వర్షపాతమే నమోదు కాలేదు. గడిచిన 24 గంటల్లో 105 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
 
తెగుళ్లతో ఆందోళన
మరో పక్క ఆరంభంలోనే తెగుళ్ల బెడద మొదలైంది. ఇప్పటికే ఆకు ముడత.. అగ్గితెగులు విజృంభిస్తు న్నాయి. వీటితో పాటు వివిధ రకాల తెగుళ్లు జిల్లాలోని మెట్ట, ఏజెన్సీ ప్రాంతాలు అనే తేడా లేకుండా సుమారు 40శాతం పొలాలపై ఆశించడం రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. తెగుళ్లను సకాలంలో గుర్తించి నివారించకుంటే రైతులు పంటలు కోల్పోయే ప్రమాదం కూడాలేకపోలేదు. తెగుళ్ల నివారణ కోసం ఆరంభంలోనే చేతి చమురు వదలుతుండడంతో ఇక పంట చేతికొచ్చేసమయానికి సాగువ్యయం ఏమేరకు పెరుగుతుందో అనే ఆందోళన రైతుల్లో కనిపిస్తోంది.
 
ఇవీ నివారణ చర్యలు ..
ప్రస్తుతం ఆశిస్తున్న తెగుళ్ల నివారణకు ప్రొఫినోఫాస్ ద్రావణాన్ని లీటరు నీటికి 2 మిల్లీలీటర్లు చొప్పున ఎకరాకు 400 మిల్లీలీటర్ల మందును లేదా ఎస్ఫేట్, లేదా ఇమిడా క్లోఫిడ్ -7.8 ఎస్‌సీ ఫౌడర్‌ను లీటరు నీటికి 1.50 గ్రాముల చొప్పున ఎకరాకు 300 గ్రాముల కలిపి పిచికారీ చేయాలి. అయితే తరచూ ప్రొఫినోఫాస్, ఎసిఫేట్ మందును పిచికారీ చేయకూడదు. పొడతెగులు నివారణకు ఎక్సోకొనాజోల్ ద్రావణాన్ని, తీవ్రత ఎక్కువుగా ఉంటే వేలాడిమైసిన్ 3 శాతం మిల్లీలీటర్ల మందును లీటరు నీటికి 2 మిల్లీలీటర్లుచొప్పున ఎకరాకు 400 మిల్లీలీటర్లు మందును పిచికారీ చేయాలని వ్యవసాయశాఖాధికారులు సూచిస్తున్నారు.

Advertisement
Advertisement