ఎక్కడి సమస్యలు అక్కడే | Sakshi
Sakshi News home page

ఎక్కడి సమస్యలు అక్కడే

Published Tue, Apr 3 2018 12:30 PM

Problems Still Continue With Meekosam Programme - Sakshi

సాక్షి ప్రతినిధి, ఏలూరు:‘రేషన్‌ ఇప్పించాలంటూ రెండేళ్లుగా తిరుగుతున్నాను. కాళ్లరిగిపోతున్నాయి కాని సమస్య మాత్రం పరిష్కారం కాలేదు. ప్రమాదంలో గాయపడటంతో గుంటూరు ఆసుపత్రిలో రెండునెలలు ఉండాల్సి వచ్చింది.దీంతో రేషన్‌ నిలిపివేశారు. దీని కోసం రెండేళ్ల నుంచి కలెక్టరేట్‌ చుట్టూ తిరుగుతూనే ఉన్నాను’. ఇది ఒక్కడి ఆవేదన కాదు. కలెక్టరేట్‌కు ప్రతి సోమవారం మీ కోసం కార్యక్రమానికి వచ్చేవారిలో సగానికి పైగా బాధితులు రెండు, మూడుసార్లు జిల్లాలో మారుమూల ప్రాంతాల నుంచి తమ సమస్యలు విన్నవించుకోవడానికి కలెక్టరేట్‌కు వచ్చినవారే. మండల, గ్రామస్థాయిలో పరిష్కారం కావాల్సిన సమస్యలు అక్కడ పరిష్కారం కాకపోవడంతో జిల్లా కలెక్టరేట్‌కువస్తున్నారు. ఇక్కడ కూడా మళ్లీ అక్కడి అధికారులకే రిఫర్‌ చేస్తున్నా వారు స్పందించడం లేదు. దీంతో ఒకటికి రెండుసార్లు జిల్లా కలెక్టర్‌ను కలిస్తేగాని సమస్య పరిష్కారం కాని పరిస్థితి ఏర్పడుతోంది. వీటికి తోడు వ్యక్తిగత సమస్యలతో కూడా జిల్లా కలెక్టరేట్‌కు వస్తున్నారు. కుటుంబసభ్యులు సరిగ్గా చూడకపోయినా మీ కోసం కార్యక్రమానికి వస్తున్నారు. దీంతో వీరిని మళ్లీ ఎస్పీ కార్యాలయానికి పంపుతున్నారు.

రాజకీయ కారణాలతో ఇళ్లస్థలాలు, రేషన్‌ కార్డులు, పింఛన్లు తిరస్కరించిన వాటిపై ఎక్కువ దరఖాస్తులు వస్తున్నాయి. తమతో పాటు దరఖాస్తు చేసుకున్న వారందరికి ఇళ్ల స్థలం మంజూరు అయినా ఎంపీటీసీ అడ్డం పడటంతో తమకు రాలేదని కోడూరుపాడుకు చెందిన ఒక మహిళ ఫిర్యాదు చేసింది. అక్రమంగా మట్టి తవ్వకాలు, అనుమతి లేకుండా చేపల చెరువులు, రొయ్యల చెరువుల తవ్వకాలపై పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయి. అయితే వాటిపై చర్యలు ఉండటం లేదు. దీంతో పదేపదే ఆదే ఫిర్యాదుపై రావాల్సి వస్తోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏడాది క్రితం భూమిని స్వాధీనం చేసుకున్నా పరిహారం అందక బాధితులు కలెక్టరేట్‌కు వచ్చారు. ఇంతకుముందే స్థానిక ఎమ్మార్వోతో పాటు అడిషనల్‌ జేసీని కలిసినా తమకు న్యాయం జరగలేదని వాపోయారు.

గణపవరం మండలం కొమ్మర గ్రామంలో చేపల చెరువులకు అనుమతులు తీసుకుని ఉప్పునీరు తోడి రొయ్యలు సాగు చేస్తున్నారని దానివల్ల సమీపంలో ఉన్న అన్ని పంట పొలాలు దెబ్బతిని దిగుబడి తగ్గిపోయి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. గోపాలపురం మండలం గుడ్డిగూడెం గ్రామంలో సర్వే నెంబర్‌ 235లో సబ్‌డివిజన్‌ చేయకుండా, లే అవుట్‌ వేయకుండా అర్హత లేని వారికి కూడా ఇళ్ల పట్టాలు మంజూరు చేశారని, గ్రామంలో అర్హత ఉన్న పేదలను పట్టించుకోకుండా గ్రామ సర్పంచ్‌ బంధువులకు ఇళ్ల పట్టాలు మంజూరు చేశారని ఫిర్యాదు చేశారు. ఇదే మండలం దొండపూడి గ్రామంలో పంచాయతీకి సంబంధించిన స్థలంలో సర్పంచ్‌ దగ్గర బంధువు సొంతంగా పక్కా బిల్డింగ్‌ నిర్మాణం చేస్తున్నారని అధికారుల దృష్టికి తీసుకువచ్చినా పట్టించుకోవడం  లేదని ఫిర్యాదు చేశారు.

సమగ్ర విచారణ చేసి న్యాయం చేస్తాంఇన్‌ఛార్జి కలెక్టర్‌  పులిపాటి కోటేశ్వరరావు
మీ – కోసంలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అవసరమైతే సమగ్ర విచారణ చేసి తప్పనిసరిగా అర్జీదారులకు న్యాయం చేస్తామని ఇన్‌చార్జి కలెక్టర్‌ పులిపాటి కోటేశ్వరరావు చెప్పారు. స్థానిక కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన మీకోసం కార్యక్రమంలో అర్జీదారులు నుండి ఇన్‌చార్జి కలెక్టర్‌ వినతులు, ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్జీదారులు ఫిర్యాదులను అందచేసి పరిష్కారం కాలేదంటూ మళ్ళీ వారం మీకోసం కార్యక్రమానికి సమయం, సొమ్ములు వెచ్చించుకుని వస్తున్నారని అయితే ఇచ్చిన దరఖాస్తులు అధికారులు పరిశీలించి విచారణ చేసి అవసరమైన చర్యలు తీసుకుని అర్జీదారులకు పూర్తి న్యాయం చేయడానికి కొంత సమయం పడుతుందని, అర్జీదారులు వేచి చూడాల్సిన అవసరం ఉందన్నారు. పదే పదే మీకోసం కార్యక్రమానికి సమయం, సొమ్ము వృథా చేసుకుని రావాల్సిన అవసరం లేదని ఇచ్చిన దరఖాస్తులను తప్పనిసరిగా పరిశీలించి అవసరమైన న్యాయం చేయడానికి అధికారులు ఎప్పుడూ చిత్తశుద్ధిగా వ్యవహరిస్తారని ఆయన చెప్పారు.

Advertisement
Advertisement