పెట్టుబడి ఎలా? | Sakshi
Sakshi News home page

పెట్టుబడి ఎలా?

Published Mon, Jun 16 2014 2:08 AM

పెట్టుబడి ఎలా? - Sakshi

 సాక్షి, ఒంగోలు: కౌలు రైతులకు ఏటా కష్టాలే మిగులుతున్నాయి. ప్రభుత్వాలు మారుతున్నా వారి తలరాతలు మాత్రం మారడం లేదు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో కౌలు రైతుల బాగోగులను పట్టించుకున్నారు. వారిని అధికారికంగా గుర్తించి ప్రభుత్వం మంజూరు చేసిన గుర్తింపుకార్డుపై బ్యాంకులు రుణాలివ్వాలనే నిబంధన ప్రవేశపెట్టారు. అయితే, ఆయన హఠాన్మరణం తర్వాత కౌలురైతుల కష్టాలు అన్నీఇన్నీ కావు.
 
 భూయజమాని అయిన రైతుల్లో లేనిపోని అపోహలు సృష్టించి.. కౌలురైతులకు రుణాలివ్వకుండా బ్యాంకర్లు సవాలక్ష నిబంధనలతో కొర్రీలు పెడుతున్నట్టు విమర్శలున్నాయి. రుణఅర్హత కార్డులు ప్రవేశపెట్టిన మొదట్లో జిల్లాలో చాలామంది కౌలురైతులు లబ్ధిపొందారు. మూడేళ్లుగా వారికి రుణఅర్హత కార్డులిచ్చే నాథుడే కరువయ్యారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్ దాటిపోతున్న తరుణంలో ఈసారైనా తమను అధికారికంగా గుర్తించి రుణాలిస్తారా..? లేదా..? అనే అనుమానాలతో కౌలురైతులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.  
 
 = జిల్లా వ్యాప్తంగా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తోన్న రైతుకుటుంబాలు 5.5 లక్షలుండగా, వారిలో కౌలురైతులు 1.5లక్షల మందికి మించే ఉంటారని అంచనా. వారికి అధికారికంగా పంటరుణాలు పంపిణీ చేయకపోవడం, రక్షణ చట్టాలు కొరవడటంతో భూయజమానులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు.
  = ఏటా జూలై మొదటి వారంకల్లా కౌలు రైతులకు రుణ అర్హత కార్డులను మంజూరు చేసి, పంపిణీ చేసేవారు. ఖరీఫ్ రుణాల పంపిణీకి సంబంధించి బ్యాంకర్ల సమావేశంలోనూ కౌలురైతుల రుణాలపై ప్రత్యేకంగా లక్ష్యంను నిర్దేశించేవారు. ఆమేరకు కిందటేడాది జిల్లాలో 30 వేల మంది రైతులకు రుణఅర్హత కార్డులిచ్చి రూ.40 కోట్ల వరకు పంట రుణాలివ్వాలని లక్ష్యంపెట్టుకోగా... రాష్ట్ర విభజన ఉద్యమాల కారణంగా కేవలం 200 మందికి మాత్రమే లబ్ధి చేకూర్చారు. వారికి రూ.30 లక్షలు మాత్రమే రుణంగా విదిల్చి మిగతా వారిని పట్టించుకోలేదు.
 
సవాలక్ష ఆంక్షలు పెట్టి..
పంట రుణాల పంపిణీపై భూ యజమానులు అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో కౌలు రైతులందర్నీ పదిమంది చొప్పున గ్రూపులుగా విడదీసి.. రుణాలు మంజూరు చేయాలనే ప్రభుత్వ నిబంధనను బ్యాంకర్లు తుంగలో తొక్కుతున్నారు. ఇదేవిషయంపై బ్యాంకర్ల సమీక్ష సమావేశాల్లోనూ కలెక్టర్ విజయ్‌కుమార్ బ్యాంకర్లతో చెబుతూనే ఉన్నారు.
 
అయినప్పటికీ, రికవరీలే లక్ష్యంగా తాము వ్యవహరిస్తామంటూ బ్యాంకర్లు లీడ్‌బ్యాంక్ మేనేజర్‌తో స్పష్టం చేస్తున్నారు. 2011-12లో జిల్లావ్యాప్తంగా 14,500 మందికి రుణ అర్హత కార్డులను పంపిణీ చేశారు. 2012-13లో 8,149 మందికి రుణ అర్హత కార్డులిచ్చారు. కిందటేడాది కేవలం 5,213 మందికి మాత్రమే గుర్తింపుకార్డులిచ్చినా.. వారిలో కూడా కేవలం 200 మందికే రుణాలివ్వడం గమనార్హం. ప్రస్తుతం ఖరీఫ్ పనులు ముమ్మరమవుతోన్న నేపథ్యంలో ఇంత వరకు కౌలురైతుల గుర్తింపు కార్డుల పంపిణీపై షెడ్యూల్ ప్రకటించలేకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
Advertisement