మరింతగా.... ఇక్కట్‌లు | Sakshi
Sakshi News home page

మరింతగా.... ఇక్కట్‌లు

Published Sat, Jul 5 2014 4:10 AM

మరింతగా.... ఇక్కట్‌లు - Sakshi

  • విద్యుత్ సంక్షోభం తీవ్రరూపం
  •      రాష్ట్ర వ్యాప్తంగా 1870 మెగావాట్ల
  •      విద్యుత్ ఉత్పత్తి లోటు
  •      శుక్రవారం జిల్లా వ్యాప్తంగా 10 గంటల పాటు నిలిచిన సరఫరా
  •      అల్లాడుతున్న జిల్లా వాసులు
  •  విజయనగరం మున్సిపాలిటీ: విద్యుత్ సంక్షోభం రోజురోజుకూ తీవ్ర రూపం దాలుస్తోంది.  మండుతున్న ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలకు విద్యుత్ కోతలు గోరు చుట్టుపై రోకలి పోటు అన్న చందంగా మారుతున్నాయి. జూలై మొదటి వారంగడుస్తున్నా ప్రకృతికరుణించకపోవడంతో ప్రజ లు అవస్థలకు గురవుతున్నారు.

    విద్యుత్ శాఖ అధికారుల సమాచారం మేరకు రాష్ట్రంలో గల వీటీసీటీపీఎస్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో 210 మెగావాట్లు, ఆర్‌టీపీపీ యూనిట్-1లో 210 మెగావాట్లు, కృష్ణపట్నం విద్యుత్ ఉత్పత్తి కేం ద్రంలో 250 మెగావాట్లు, సింహాద్రి విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో గల యూనిట్-2లో 500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి బ్రేక్ పడడంతో పాటు కేంద్రం నుంచి సరఫరా కావాల్సిన 700 మెగావాట్ల విద్యుత్ రాకపోవడంతో శుక్రవారం  విద్యుత్ కోతలు మరింత ఎక్కువయ్యాయి.

    వారం రోజులుగా విద్యుత్ ఉత్పత్తి లోటు పేరుతో జిల్లాలో రోజుకు 5 నుంచి 7 గంటల పాటు అనధికారికంగా విద్యుత్ కోతలు విధిస్తున్నారు. తాజాగా శుక్రవారం పరిస్థితి మరింత దిగజారడంతో పల్లెపట్టణం తేడా లేకుండా   దారుణంగా కోతలు విధించారు. జిల్లా కేంద్రమైన విజయనగరంలో ఉదయం 6.35 నుంచి 9.35 వరకు, మళ్లీ మధ్యాహ్నం 12.30 నుంచి 4.00 గంటల వరకు,  4.35 నుంచి 7.00 గంటల వరకు మొత్తం 8 గంటల పాటు కోత విధించారు.

    ఇక మిగిలిన ప్రాంతాల్లో అర్ధరాత్రి 12.45 గంటల నుంచి వేకువజాము 2 గంటల వరకు ఉదయం 7.25 గంటల నుంచి 10.25 వరకు,  మధ్యాహ్నం 1.20 నుంచి సాయంత్రం 4.50  గంటల వరకు మొత్తం ఎనిమిది గంటలు సరఫరా నిలిచిపోయింది.  ఇదిలా ఉండగా గృహావసర విద్యుత్ కనెక్షన్‌లకు మెరుగైన సరఫరాను చేయడంలో భాగంగా పరిశ్రమలకు ప్రతి రోజూ సాయంత్రం ఆరు గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు పూర్తి గా సరఫరా నిలిపివేస్తున్నప్పటికీ ప్రయోజనం లేకపోయిం దన్న వాదనలు వినిపిస్తున్నాయి.  

    జిల్లాలో అ మలవుతున్న అనధికారిక విద్యుత్ కోతలతో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతు న్నారు. చిరువ్యాపారుల పరిస్థితి  అస్తవ్యస్తంగా  మారుతోంది. రాత్రి పూట విధిస్తున్న కోతలతో అన్ని వర్గాల ప్రజలకు కునుకు కరవవుతుండగా...చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణులు ఉక్కపోతకు తాళలేక అవస్థలు పడుతున్నారు. అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జిల్లా వాసులు కోరుతున్నారు.

Advertisement
Advertisement