ప్రొద్దుటూరు మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నిక వాయిదా | Sakshi
Sakshi News home page

తెలుగు తమ్ముళ్ల వీరంగం, కుర్చీలు ధ్వంసం

Published Sat, Apr 15 2017 11:59 AM

ప్రొద్దుటూరు మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నిక వాయిదా - Sakshi

వైఎస్‌ఆర్‌ జిల్లా: తీవ్ర గందరగోళం మధ్య ప్రొద్దుటూరు మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నిక ఆదివారానికి వాయిదా పడింది.  శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందంటూ అధికార టీడీపీ చైర్మన్‌  ఎన్నికను రేపటికి వాయిదా వేయించింది. ఇప్పటికిప్పుడు ఎన్నిక జరిగితే తమ ఓటమి ఖాయమనుకున్న టీడీపీ సభ్యులు శనివారం పక్కా ప్రణాళికతో ఎన్నికల హాలులో వీరంగం సృష్టించారు.

తక్షణమే ఎన్నికను వాయిదా వేయాలంటూ టీడీపీ కౌన్సిలర్లు కుర్చీలు, ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. దీంతో శాంతి భద్రతలను సాకుగా చూపిన అధికారులు ఛైర్మెన్ ఎన్నికను రేపటికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఎమ్మెల్సీ సీటును దక్కించుకున్న విధంగానే... ఎలాగైనా ప్రొద్దుటూరు మున్సిపల్ ఛైర్మన్‌ కూడా దక్కించుకోవాలని టీడీపీ కుటిల ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే మంత్రి ఆదినారాయణ రెడ్డి ప్రతిపక్ష సభ్యులకు లేఖ రాస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారు.

కాగా అంతకు ముందు  ఎన్నికల హాల్‌లో కుర్చీలను ధ్వంసం చేసిన టీడీపీ కౌన్సిలర్లు...అనంతరం మినిట్స్‌ బుక్ను లాక్కువెళ్లారు. ఈ ప్రయత్నాన్ని వైఎస్‌ఆర్‌ సీపీ సభ్యులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. మరోవైపు పోలీసులు రంగప్రవేశం చేసి టీడీపీ కౌన్సిలర్‌ పుల్లయ్య వద్ద నుంచి మినిట్స్‌ బుక్‌ను స్వాధీనం చేసుకున్నారు. మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నిక నేపథ్యంలో వైఎస్‌ఆర్‌ సీపీ నిన్నే విప్‌ జారీ  చేసింది. దీంతో గతంలో టీడీపీకి మద్దతు పలికిన కౌన్సిలర్లు.. తిరిగి వైఎస్‌ఆర్‌ సీపీలోకి వచ్చారు.

కాగా సమావేశం నిర్వహించాలంటే మొత‍్తం 41మందిలో 21మంది హాజరు కావాల్సి ఉంటుంది. ఏ ఒక్కరు హాజరుకాకపోయినా ఎన్నికను ఎన్నికల అధికారి వాయిదా వేయాల్సి ఉంటుంది. ఆదివారం కూడా కోరం లేకపోతే తిరిగి ఎన్నికల కమిషన్‌కు తెలిపి తదుపరి వచ్చే నోటిఫికేషన్‌ వరకూ ఆగాల్సి ఉంది. మరోవైపు చిత్తూరు మేయర్‌గా కఠారి హేమలత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆమె ఎన్నికను అధికారికంగా ప్రకటించిన జిల్లా కలెక్టర్‌... అనంతరం హేమలతతో ప్రమాణ స్వీకారం చేయించారు.

Advertisement
Advertisement