ఆపరేషాన్! | Sakshi
Sakshi News home page

ఆపరేషాన్!

Published Tue, Jun 24 2014 1:59 AM

ఆపరేషాన్! - Sakshi

ప్రొలాప్స్ ఆపరేషన్లలో తీవ్ర జాప్యం
మూడు నెలలుగా నిరీక్షణ
పట్టించుకోని వైద్యులు
ఇబ్బందులు ఎదుర్కొంటున్న వృద్ధులు  

 
ఈమె పేరు చిన్నీరమ్మ. సొంతూరు సోమందేపల్లి మండలం సిద్ధకుంటపల్లి. పేగు జారడంతో ఇబ్బంది పడుతోంది. ప్రోలాప్స్ ఆపరేషన్ కోసం సర్వజనాస్పత్రిలో చేరింది. రెండు నెలలవుతున్నా ఆపరేషన్ చేయలేదు. అసలు చేస్తారో, లేదో కూడా తెలియడం లేదు.గార్లదిన్నె మండలం కోటంకకు చెందిన అంకమ్మ కూడా ప్రోలాప్స్ ఆపరేషన్ కోసం రెండు నెలలుగా ఇదే ఆస్పత్రిలో నిరీక్షిస్తోంది. వైద్యుల కరుణ కోసం ఎదురుచూస్తూనే ఉంది.
 
 అనంతపురం అర్బన్ :
 చిన్నీరమ్మ, అంకమ్మ మాత్రమే కాదు.. ఇలా 18 మంది వృద్ధులు సర్వజనాస్పత్రిలోని గైనిక్ విభాగంలో ఆరోగ్యశ్రీ కింద ప్రొలాప్స్ ఆపరేషన్ల కోసం చేరి ఇబ్బంది పడుతున్నారు. వీరంతా ఏడు పదుల వయసు నిండినవారే. కొన్ని నెలలుగా ఆస్పత్రిలోనే మగ్గుతున్నా ఆరోగ్యశ్రీ అధికారులు గానీ, వైద్యులు గానీ పట్టించుకోవడం లేదు. సాధారణంగా ఏదైనా సమస్య వస్తే 10-15 రోజుల్లో సర్జరీ చేస్తుంటారు. సర్వజనాస్పత్రిలో మాత్రం నెలలు గడుస్తున్నా పట్టించుకోవడం లేదు. వేరే రోగులు రాకుండా, ఆపరేషన్లు చేయకుండా కాలయాపన చేస్తున్నారు. చిన్నాచితక కారణాలు చూపుతూ తప్పించుకుంటున్నారు. ఆస్పత్రిలోని మిగతా విభాగాలతో పోలిస్తే గైనిక్ విభాగంలో వైద్యులు కూడా ఎక్కువగానే ఉన్నారు. అయినప్పటికీ ఆపరేషన్లు సకాలంలో జరగడం లేదు.

అనారోగ్యశ్రీ

సర్వజనాస్పత్రిలో ఆరోగ్యశ్రీ సిబ్బంది తీరు వల్ల రోగులు ఇబ్బంది పడాల్సి వస్తోంది. కిరణ్ సర్కారు 2012 ఏప్రిల్‌లో ప్రొలాప్స్‌తో పాటు అనేక ఆపరేషన్లు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పేద రోగులు గత్యంతరం లేక సర్వజనాస్పత్రిలో చేరుతున్నారు. వీరి పట్ల ఆరోగ్యశ్రీ అధికారులు ఏమాత్రం శ్రద్ధ తీసుకోవడం లేదు. కేసులను ఎప్పటికప్పుడు రాజీవ్ ఆరోగ్యశ్రీ ట్రస్టు అప్రూవల్ కోసం హైదరాబాద్‌కు పంపాల్సి ఉంటుంది. ఈ విషయంలోనూ కాలయాపన చేస్తున్నారు.

సిఫారసు ఉంటే తప్ప త్వరగా అప్రూవల్ కావడం లేదు. ఆరోగ్యశ్రీ విభాగంలో మంచాల కొరత కూడా తీవ్రంగా ఉంది. కేవలం ఎనిమిది మంచాలు ఉన్నాయి. వీటిపైనే చాలా మందిని సర్దుతున్నారు. విధిలేక కొంత మంది నేలపైనే పడుకుంటున్నారు.

మాలాంటోళ్లకు తప్పదయ్యా

ఆపరేషన్ కోసం వచ్చా సార్. పేగు జారిందంట. ఓవైపు నొప్పి వస్తోంది. ఆపరేషన్ ఎప్పుడు చేస్తారో తెలియడం లేదు. మాలాంటోళ్లంటే అందరికీ చులకనే. ఇక్కడ ఉండబట్టి నెలన్నర కావస్తోంది.

 - నల్లమ్మ, సిండికేట్ నగర్, అనంతపురం
 
 50 రోజులవుతోంది

 ఇక్కడికొచ్చి దగ్గర దగ్గర 50 రోజులవుతోంది. పొద్దున్నే లేయడం.. ఇక్కడే స్నానాలు చేయడం సరిపోతోంది. మంచం దొరికితే పైన పడుకుంటాం. లేకపోతే కిందనే గతి.

 - నారమ్మ, కందుకూరు, అనంతపురం రూరల్

టేబుళ్లు లేవు

ఆపరేషన్ల కోసం వచ్చేవారి సంఖ్య పెరుగుతోంది. అక్కడికీఆలస్యం చేయడం లేదు. ఆపరేషన్ థియేటర్‌లో కనీసం టేబుళ్లు సరిగా లేవు. ఈ విషయంపై సూపరింటెండెంట్‌కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తాం.

 - డాక్టర్ సంధ్య, గైనిక్ హెచ్‌ఓడీ

త్వరలో చేయిస్తాం

ఆపరేషన్లు వాయిదా పడుతున్న సంగతి నాకు తెలీదు. ఈ విషయాన్ని పరిశీలిస్తా. త్వరగా చేసేలా శ్రద్ధ చూపుతా.

 - డాక్టర్ ప్రవీణ్, ఆరోగ్యశ్రీ జిల్లా కో ఆర్డినేటర్
 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement