ప్రమోషన్ ప్లీజ్..! | Sakshi
Sakshi News home page

ప్రమోషన్ ప్లీజ్..!

Published Thu, Aug 13 2015 1:07 AM

ప్రమోషన్ ప్లీజ్..!

రాష్ట్ర విభజనతో వైద్యుల పదోన్నతుల్లో జాప్యం
రెండు రాష్ట్రాలకు జరగని వైద్యుల విభజన
ఆ తర్వాతే పదోన్నతులంటున్న ఉన్నతాధికారులు

 
లబ్బీపేట : పదోన్నతుల కోసం ప్రభుత్వ వైద్యులు ఎదురుచూస్తున్నారు. రాష్ట్ర విభజన ప్రభావంతో పదోన్నతులకు నోచుకోవడం లేదు. ఏడాది కిందటే పదోన్నతులు రావాల్సిన వారు ఎందరో ఉన్నప్పటికీ ఎప్పుడు అమలవుతుందో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు వైద్యుల విభజన జరగకపోవడంతో పదోన్నతులూ నిలిచిపోయాయి. ఉద్యోగుల విభజనపై వేసిన కమలనాథన్ కమిటీ  ఇచ్చిన నివేదిక ఆధారంగా కేటాయింపులు జరిగిన తర్వాత పదోన్నతులు ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది.
 
ప్రొఫెసర్ పదోన్నతి కోసం ఎదురు చూపులు
 రాష్ట్రంలోని బోధనాస్పత్రిలో పనిచేస్తున్న  50 మందికి ప్రొఫెసర్లుగా ఏడాది కిందటే పదోన్నతి రావాల్సివుంది. అయితే ఆ సమయానికి రాష్ట్ర విభజన జరగడంతో ప్రమోషన్లు నిలిచిపోయాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వైద్యులు హైదరాబాద్‌లోని ఉస్మానియా, గాంధీ, నిలోఫర్, వరంగల్ కాకతీయ వైద్య కళాశాలల్లో పని చేస్తున్నారు. వైద్యుల విభజన జరిగితే వారందరిని ఆంధ్రప్రదేశ్‌లోని పలు ఆస్పత్రుల్లో సర్దుబాటు చేయాలి. ఈ నేపథ్యంలో పదోన్నతికి అర్హులు ఉన్నా నిలిపివేశారు.
 
 తీవ్రంగా నష్టపోతున్నాం

 సకాలంలో పదోన్నతి రాకపోతే సర్వీసులో తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని పలువురు వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జీతం నష్టపోవడమే కాకుండా, అనంతరం అడిషనల్ డెరైక్టర్ పదోన్నతులు కూడా జాప్యమయ్యే అవకాశాలు ఉన్నాయని పేర్కొంటున్నారు. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసి, బోధనాస్పత్రికి వచ్చిన వైద్యులు కొందరు  పదోన్నతుల్లో తీవ్రంగా నష్టపోయారు. ప్రస్తుత జాప్యంతో మరింత నష్టపోవాల్సి వస్తోం దని వారు పేర్కొంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేయకుండా నేరుగా వైద్య కళాశాలల్లో చేరిన తమ కన్నా జూనియర్లు ప్రొఫెసర్లుగా పనిచేస్తుంటే, గ్రామీణ సేవలు అందించినందుకు తాము అసోసియేట్‌లుగానే మిగిలామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అడిషనల్ డెరైక్టర్లదీ అదే దుస్థితి
 రాష్ట్రంలో సుమారు 20 అడిషనల్ డెరైక్టర్ పోస్టులు ఉన్నాయి. అవి అన్నీ ఖాళీగానే ఉన్నాయి. వాటిలో ప్రొఫెసర్లు ఇంచార్జులుగా కొనసాగుతున్నారు. చివరికి రాష్ట్ర వైద్య విద్యా సంచాలకుడు, అదనపు సంచాలకులు సైతం ప్రొఫెసర్ కేటగిరిలోనే ఉంటూ ఇన్‌చార్జులుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అడిషనల్ డెరైక్టర్ల పదోన్నతుల విషయంలో ప్రభుత్వాలు ఎప్పటి నుంచో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఈ దుస్థితి నెలకొందని వైద్యులు ముక్తకంఠంతో ఆరోపిస్తున్నారు.
 
 ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం

 వైద్యుల పదోన్నతుల విషయంలో జాప్యాన్ని ఇప్పటికే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. రెండు రాష్ట్రాల్లో వైద్యుల విభజనపై కమలనాథన్ కమిటీ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు. ఇప్పటికే ఎంతో మంది పదోన్నతులు కోసం ఎదురు చూస్తున్నారు. దీర్ఘకాలంగా పదోన్నతి దక్కకుంటే సర్వీసులో ఎంతో నష్టపోవాల్సి వస్తుంది. ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలి.     
 - డాక్టర్ ఎన్.ఎస్.విఠల్‌రావు,
 ప్రభుత్వ వైద్యుల సంఘం అధ్యక్షుడు
 

Advertisement

తప్పక చదవండి

Advertisement