నకిలీ సర్టిఫికెట్లుతో పదోన్నతులు | Sakshi
Sakshi News home page

నకిలీ సర్టిఫికెట్లుతో పదోన్నతులు

Published Thu, Oct 10 2013 4:28 AM

Promotions with Duplicate Certificates

ఖమ్మం, న్యూస్‌లైన్‌: ‘ఊరందరిది ఒక దారి.. ఉలిపి కట్టెది మరోదారి’ అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు జిల్లా విద్యాశాఖ అధికారులు. నకిలీ సర్టిఫికెట్లు సమర్పించి అడ్డదారిలో పదోన్నతులు పొందిన వారిపై, నకిలీ మెడికల్‌ సర్టిఫికెట్లు పెట్టి డబ్బు డ్రాచేసి ప్రభుత్వానికి పంగనామాలు పెట్టిన వారిపై చర్య తీసుకోవాలని ఆ శాఖ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసినా.. జిల్లా అధికారులు తాత్సారం చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అది పోలీస్‌శాఖ పరిధిలో ఉందని విద్యాశాఖ అధికారులు చెపుతుండగా.. పూర్తి స్థాయిలో రికార్డులు ఇవ్వలేదని, అందుకే కేసు నమోదు చేయలేకపోతున్నామని పోలీస్‌ అధికారులు అంటున్నారు. ఇరుశాఖల ఉద్యోగులు కలిసి కావాలనే కేసులు పెట్టకుండా జాప్యం చేసి అక్రమార్కులకు అండగా ఉంటున్నారని జిల్లాఉపాధ్యాయ వర్గాలు ఆరోపిస్తున్నాయి.
 
 
 
ఆంగ్లవిద్యను బలోపేతం చేయాలనే ఆలోచనతో అన్ని సబ్జెక్టులతోపాటు ఆంగ్లం బోధించేందుకు స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులను మంజూరు చేశారు. ఇందుకోసం ఇంగ్లిష్‌ మీడియంలో డిగ్రీ చదివి, బీఈడీలో ఇంగ్లిష్‌ మెథడాలజీ ఉన్న సెకండరీ గ్రేడ్‌ టీచర్లకు పదోన్నతులు కల్పిం చారు. దీనిని అదనుగా చేసుకొని పలువురు ఉపాధ్యాయులు వివిధ యూనివర్సిటీల్లో చదివినట్లు నకిలీ సర్టిఫికెట్లు సమర్పించి ప్రమోషన్లు పొందారు. స.హ.చట్టం ద్వారా తెలుసుకున్న సమాచారంతో జిల్లాలో పలువురు ఉపాధ్యాయులు నకిలీ సర్టిఫికెట్లు సమర్పించి పదోన్నతులు పొం దారని, అర్హత ఉన్న తమకు ప్రమోషన్లు రాలేదని ఒరిజనల్‌ ఇంగ్లిష్‌ టీచర్‌‌స ఫోరం అధ్వర్యంలో కోర్టును, లోకాయుక్తను ఆశ్రయించారు. దీంతో రాష్ట్ర అధికారులు రం గంలోకి దిగి జిల్లాలో 66 మంది నకిలీ సర్టిఫికెట్లు సమర్పించినట్లు నిర్ధారించారు. ఈ నేపథ్యంలోనే పదోన్నతి పొందిన ఉపాధ్యాయులు కోర్టును ఆశ్రయించగా ఆయా యూనివర్సిటీల దూరవిద్య పట్టాలకు గు ర్తింపు ఉందని ట్రిబ్యునల్‌ తాత్కాలికంగా తీర్పు చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు. 
 
అయితే ఆ తర్వాత ఈ కేసును సీబీసీఐడీకి అప్పగిస్తూ నకిలీ సర్టిఫికెట్లతో ప్రభుత్వాన్ని మోసం చేసిన వారిపై క్రిమినల్‌ కేసులు పెట్టాలని రాష్ట్ర అధికారులు ఆదేశించడతో కథ మళ్లీ మొదటికి వచ్చింది. విద్యాశాఖ వింతపోకడపై అనుమానాలు...
 ఇతర జిల్లాల్లో అక్రమాలకు పాల్పడిన ఉపాధ్యాయుల ఆరెస్టులు కొనసాగుతుంటే మన జిల్లా అధికారులు మాత్రం జాప్యం చేయడం పలు అనుమానాలకు తావి స్తోంది. నకిలీ సర్టిఫికెట్లతో పదోన్నతి పొం దిన పలువురు ఉపాధ్యాయులు.. తమ బండారం బయటపడి కటకటాలపాలయి తే పరువుతోపాటు, ఉద్యోగం, డబ్బులు కోల్పోవాల్సి వస్తుందని భావించి, జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ఓ ఉద్యోగికి రూ. 50 వేల నుంచి రూ. లక్ష వరకు ముట్టజెప్పినట్లు ప్రచారం. అందుకే అక్రమార్కులపై కేసులు పెట్టకుండా వెనకడుగు వేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
 
కరీంనగర్‌, నల్గొండ జిల్లాల్లో ఇప్పటికే కేసులు నమోదు చేసి చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేయగా మన జిల్లాలో మాత్రం విద్యాశాఖ అధికారులు సీబీసీఐడీ అధికారులపైన, వారు విద్యాశాఖ అధికారులపైనా నెట్టి కాలయాప చేస్తున్నారని ఒరిజనల్‌ టీచర్‌‌స ఫోరం నాయకులు ఆరోపిస్తున్నారు. అదేవిధంగా నకిలీ సర్టిఫికెట్లతో మెడికల్‌ బిల్లులు స్వాహా చేసిన 23 మందిపై కేసులు పెట్టాలని డీఈవో ఆయా ఎంఈవోలను ఆదేశించినా ఇప్పటి వరకు గుండాల, సత్తుపల్లి, ఖమ్మం, చర్ల, ఎర్రుపాలెం మండలాలకు చెందిన ఎనిమిది మందిపైనే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. మిగిలిన వారి రికార్డులు పోలీసులకు సక్రమంగా అందజేయకపోవడతో కేసులు పెట్టడంలో జా ప్యం జరుగుతోందనే ఆరోపణలు ఉన్నా యి. ఇలా విద్యాశాఖలో పనిచేస్తున్న పలువురు అధికారుల చేతివాటం మూలంగానే అక్రమార్కులపై కేసులు పెట్టకుండా జా ప్యం చేస్తున్నారని ప్రచారం. ఇప్పటికైనా ఉన్నతాధికారులు కలుగజేసుకొని అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని పలువురు ఉపాధ్యాయులు కోరుతున్నారు.
 
వీలైనంత త్వరగా చర్యలు తీసుకుంటాం : డీఈఓ
అక్రమార్కులపై చర్య తీసుకోవడంలో జరుగుతున్న జాప్యంపై డీఈఓ రవీంద్రనాథ్‌రెడ్డిని ‘న్యూస్‌లైన్‌’ వివరణ కోరగా.. నకిలీ సర్టిఫికెట్లతో పదోన్నతులు పొందిన వారి గురించి ఉన్నతాధికారులతో చర్చించి వీలైనంత త్వరగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అలాగే అక్రమంగా మెడికల్‌ బిల్లులు డ్రా చేసిన వారిపై చర్య తీసుకోవాలని కోరుతూ ఎస్‌పీని కలిశామని, విచారణ చేపట్టి కేసులు నమోదు చేస్తామని ఆయనƒ చెప్పారని వివరించారు. 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement