తిరుమల జలాశయాల్లో భక్తులకు సరిపడా నీరు | Sakshi
Sakshi News home page

తిరుమల జలాశయాల్లో భక్తులకు సరిపడా నీరు

Published Sat, Dec 7 2019 4:54 AM

Proper water for pilgrims in Tirumala reservoirs - Sakshi

తిరుమల :  తిరుమల జలాశయాల్లో భక్తులకు 544 రోజులకు సరిపడా నీరు అందుబాటులో ఉందని టీటీడీ ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ వెల్లడించారు. కుమారధార, పసుపుధార జలాశయాల్లో శుక్రవారం టీటీడీ అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి, సీవీఎస్‌వో (చీఫ్‌ విజిలెన్స్‌ అండ్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌) గోపినాథ్‌ జెట్టితో కలిసి ఈవో గంగపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి ఆశీస్సులతో ఈ సంవత్సరం విస్తారంగా వర్షాలు కురవడంతో జలాశయాల్లో పూర్తిస్థాయిలో నీటి నిల్వలున్నట్టు తెలిపారు. పాపనాశనం జలాశయ సామర్థ్యం 5,240 లక్షల గ్యాలన్లు కాగా.. ప్రస్తుతం 3,730 లక్షల గ్యాలన్లు, గోగర్భం జలాశయ సామర్థ్యం 2,833 లక్షల గ్యాలన్లు కాగా.. ప్రస్తుతం 1,848 లక్షల గ్యాలన్లు, తిరుపతిలోని కల్యాణి డ్యామ్‌లో 31.12 శాతం నీరు నిల్వ ఉందని వివరించారు. వీటితోపాటు బాలాజీ రిజర్వాయర్‌ నీటిని వినియోగించుకోవాలని టీటీడీ బోర్డు తీర్మానించిందన్నారు.  

టీటీడీలో ఉద్యోగాలకు డిసెంబర్‌లో నోటిఫికేషన్‌  
శ్రీవారి ఆర్జిత సేవలకు సంబంధించిన 2020, మార్చి నెల కోటాలో మొత్తం 52,748 టికెట్లను శుక్రవారం ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేసినట్లు తిరుమలలో నిర్వహించిన డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమంలో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ తెలిపారు. టీటీడీలో జూనియర్‌ అసిస్టెంట్‌ పైస్థాయి ఉద్యోగాలకు డిసెంబర్‌లో నోటిఫికేషన్‌ ఉంటుందని తెలిపారు. దీనికి సంబంధించి 75శాతం రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వానికి నివేదిక పంపామన్నారు. గరుడ వారధికి సంబంధించి రీటెండరింగ్‌కు వెళ్లాలని స్మార్ట్‌ సిటీ కార్పొరేషన్‌ను కోరినట్టు ఈవో వివరించారు.

Advertisement
Advertisement