మోసంపై నిరసన | Sakshi
Sakshi News home page

మోసంపై నిరసన

Published Fri, Aug 28 2015 3:36 AM

protest against fraud

సాక్షిప్రతినిధి, అనంతపురం : ‘నోరు ఒకటి చెబుతుంది..చెయ్యి మరొకటి చేస్తుంది..దేనిదోవ దానిదే!’ అన్నట్లుంది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి. ప్రత్యేకహోదా, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ, అన్ని ప్రాంతాల్లో సమ అభివృద్ధి అని ఎన్నికలకు ముందు బీజేపీ, టీడీపీ నేతలు ప్రకటించారు. అధికారంలోకి రాగానే అన్నింటినీ మరచిపోయారు. ‘యూపీఏ బిల్లులో చేర్చలేదు.కొన్ని రాష్ట్రాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి’ అం టూ ప్రజలను అన్యాయం చేస్తున్నాయి.

 రాష్ట్ర విభజన జరిగితే ప్రాంతీయ సమస్యలు ఉత్పన్నమవుతాయని విపక్షాలు గగ్గోలు పెట్టాయి. ప్రత్యేకించి ఒక ప్రాంతంగా వెనుకబడిన రాయలసీమకు మరింత అన్యాయం జరగుతుందని  ‘శ్రీకృష్ణకమిటీ’ కూడా నివేదించింది. అసమాన అభివృద్ధిపై లోతుగా అధ్యయనం చేయాలని స్పష్టం చేసింది. పరిశ్రమలు, వ్యవసాయంతో పాటు మౌలిక వసతుల కల్పనలో ‘సీమ’ చాలా వెనుకబడి ఉందని పేర్కొంది. అందులోనూ ‘అనంత’లాంటి ప్రాంతాల అభివృద్ధికి విఘాతం కలుగుతుందని స్పష్టం చేసింది. అయినప్పటికీ రాష్ట్రవిభజన జరిగిపోయింది. ఏపీకి ప్రత్యేక హోదా, వెనుకబడిన ప్రాంతాలకు బుందేల్‌ఖండ్ తరహాలో ప్రత్యేక ప్యాకేజీ ప్రకటిస్తామని యూపీఏ ప్రభుత్వం చట్టసభల్లో ప్రకటించింది.

 ప్రత్యేకహోదా వస్తే...
 రాష్ట్రానికి ప్రత్యేకహోదా వస్తే పారిశ్రామి కరంగానికి వెసులుబాటు ఉంటుంది. పన్నురాయితీలు లభిస్తాయి. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ప్రత్యేకహోదా కల్గిన రాష్ట్రాల్లో పరిశ్రమలు స్థాపిస్తే లాభాల శాతం ఎక్కువ. దీంతో పారిశ్రామిక ప్రగతి వేగవంతవుతుంది. తద్వారా ఉద్యోగాల కల్పనకు అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి వ్యవసాయం సంక్షోభంలో ఉన్న ‘అనంత’లాంటి ప్రాంతాల్లో పరిశ్రమల స్థాపన  ఎంతైనా అవసరం.  అయితే.. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకహోదాపై మాట తప్పింది. ఇటీవల పార్లమెంటులో ప్రత్యేక హోదా ఇవ్వలేమని తేల్చి చెప్పింది. ఇతర రాష్ట్రాల నుంచి అభ్యంతరాలున్నాయని స్పష్టం చేసింది. దీంతో ‘అనంత’ ఆశలు ఆవిరయ్యాయి.

బుందేల్‌ఖండ్ తరహాలో ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ విషయంలో అన్యాయమే జరిగింది. ఈ ఏడాది ఫిబ్రవరి 4న ‘ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ’ పేరుతో ‘అనంత’కు కేవలం రూ.50 కోట్లు విదిల్చింది. ఈ డబ్బు ఏ మూలకూ సరిపోని పరిస్థితి. జిల్లాలో రైతులకు ఇన్‌పుట్‌సబ్సిడీ, ఇన్సూరెన్స్ పరిహారమే రూ.800- రూ.వెయ్యికోట్ల వరకూ అందుతుంది. అలాంటిది ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ పేరుతో రూ. 50కోట్లు ఇవ్వడం చూస్తే ఈ ప్రాంత అభివృద్ధిపై కేంద్రానికి ఉన్న చిత్తశుద్ధి ఏంటో ఇట్టే తెలుస్తుంది. జిల్లాలో సాగు, తాగునీటి సమస్యల పరిష్కారంతో పాటు పట్టణాలు, పల్లెల్లో మౌలిక వసతుల కల్పనకు భారీగా నిధులు అవసరం.  
 
 ఒత్తిడి తేవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం
 కేంద్రప్రభుత్వంలో టీడీపీ కూడా భాగస్వామిగా ఉంది. జిల్లా నుంచి ఎంపీలు నిమ్మల కిష్టప్ప, జేసీ దివాకర్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. వీరితో పాటు 12మంది టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు.  జిల్లాకు తీవ్ర అన్యాయం జరుగుతోందని తెలిసినా వీరంతా ప్రభుత్వాలను గట్టిగా నిలదీయలేకపోతున్నారు. వీరు కూడా ప్రాంత అభివృద్ధి కంటే రాజకీయ మనుగడే ముఖ్యమనేలా వ్యవహరిస్తున్నారు.
 
 రేపు ధర్నా
 ప్రత్యేక హోదాను కేంద్రం ప్రకటించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్‌కాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యంలో రేపు (శనివారం) ధర్నాకు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. దీనికి సీపీఐ, సీపీఎం మద్దతు తెలిపాయి. వాటితో పాటు పలు రాజకీయపార్టీలు, ప్రజా, కుల, విద్యార్థి సంఘాలు కూడా బంద్‌లో పాల్గొనబోతున్నాయి.
 
 రాష్ట్రాభివృద్ధికి నిధులు కోరతాం
 రాష్ట్రాభివృద్ధి జరగాలంటే  ప్రత్యేక హోదానే కావాలనేం లేదు. కావాల్సినన్ని నిధులు అందించినా ప్రతి రంగం అభివృద్ధి బాటలో నడుస్తుంది. బీజేపీ జిల్లా శాఖ కూడా ఆ దిశగానే ప్రయత్నిస్తోంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్ పట్ల ప్రత్యేక శ్రద్ధతో ఉంది. మోదీ ప్రభుత్వం మనకు రావాల్సిన నిధులను ఇప్పటికే కొంత మేరకు విడుదల చేసింది. భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టు మరిన్ని నిధులొస్తాయన్న విశ్వాసం మాకుంది.    
-అంకాళ్‌రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు
 
 ప్రత్యేక హోదా అందరి బాధ్యత
  రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే కష్టాల్లో ఉన్న ప్రజలకు మేలు జరుగుతుంది. ప్రత్యేక హోదా రావడం వల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి అధిక శాతం నిధులు వస్తాయి. పరిశ్రమల ఏర్పాటు, ఉపాధి కల్పన, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వీటిని దృష్టిలో పెట్టుకొని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బంద్‌కు పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదా సాధన అందరి బాధ్యతగా భావించి 29వ తేదీన బంద్‌లో  పాల్గొనాలి.
 -ఎం.శంకర్‌నారాయణ, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు

Advertisement

తప్పక చదవండి

Advertisement