గ్యాస్ ధర పెంపుపై భగ్గు | Sakshi
Sakshi News home page

గ్యాస్ ధర పెంపుపై భగ్గు

Published Thu, Jan 2 2014 11:11 PM

Protest over gas price hike

 సంగారెడ్డి డివిజన్, న్యూస్‌లైన్: వంట గ్యాస్ సిలిండర్ల ధర పెంపును నిరసిస్తూ సీపీఎం, సీఐటీయూ ఆధ్వర్యంలో గురువారం జిల్లావ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించారు. నియోజకవర్గ కేంద్రాల్లో యూపీఏ ప్రభుత్వం దిష్టిబొమ్మలను దహనం చేశారు. సంగారెడ్డిలో సీపీఎం కార్యాలయం నుంచి కొత్త బస్టాండు వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. పెంచిన గ్యాస్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు బి.మల్లేశ్ డిమాండు చేశారు. సిద్దిపేటలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద సీఐటీ యూ నాయకులు కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను దహనం చేశారు. నిరసన కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు రేవంత్‌కుమార్, సతీష్, పురుషోత్తం పాల్గొన్నారు. చిన్నకోడూరు మండల కేంద్రంలో సీఐటీయూ నాయకులు తహశీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఆ తర్వాత తహశీల్దార్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. పటాన్‌చెరులో బస్టాండు ఎదుట సీఐటీయూ నాయకులు నాగేశ్వర్ రావు ఆధ్వర్యంలో నాయకులు కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు.
 
 జహీరాబాద్‌లో సీపీఎం నాయకులు గ్యాస్‌ధరను తగ్గించాలని కోరుతూ తహశీల్దార్ కార్యాలయం ఎదుట కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో నాయకులు రాంచందర్, మహిపాల్ తదితరులు పాల్గొన్నారు. నారాయణఖేడ్‌లో సీఐటీయూ నాయకులు తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఈ ధర్నాలో డివిజన్ నాయకులు కె.నర్సమ్మ, చిరంజీవి, సంగమేశ్వర్, మోహినుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. దుబ్బాకలో బస్టాండు ఎదురుగా సీఐటీయూ నాయకులు కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను తగులబెట్టారు. జోగిపేటలో డివిజన్ కార్యదర్శి మొగులయ్య ఆధ్వర్యంలో తహశీల్దార్ కార్యాలయం ఎదుట కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. గజ్వేల్‌లో సీపీఎం నాయకులు స్థానిక తెలంగాణ తల్లి విగ్రహం వద్ద కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. నర్సాపూర్‌లో సీపీఎం ఆధ్వర్యంలో బస్టాండు సమీపంలో కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ దహనం చేశారు. వెల్దుర్తిలో సీఐటీయూ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు.
 

Advertisement
Advertisement