ఉద్యమ పథానికి దిశానిర్దేశం | Sakshi
Sakshi News home page

ఉద్యమ పథానికి దిశానిర్దేశం

Published Sat, Jun 7 2014 1:10 AM

ఉద్యమ పథానికి దిశానిర్దేశం - Sakshi

ఓటమి పాలయ్యామని కుంగిపోకుండా.. దానిని మెట్టుగా చేసుకొని.. ప్రజల పక్షాన ఉద్యమ పథాన పయనించి.. విజయ శిఖరాలను అధిరోహించడమే సడలని దీక్షకు నిదర్శనంగా నిలుస్తుంది. ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో స్వల్ప తేడాతో విజయాన్ని అందుకోలేకపోయిన వైఎస్సార్‌సీపీ.. ఇదే సూత్రాన్ని ఎంచుకుంది.

ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లో.. ఎన్నికల్లో పార్టీ గెలుపోటములపై.. మూడు రోజుల పాటు రాజమండ్రిలో చేసిన సమీక్షల్లో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కార్యకర్తలకు, నాయకులకు ధైర్యాన్ని అందించారు. ఓటమికి గల కారణాలను గుర్తించి.. వాటిని సరిదిద్దుకొని.. మరింత పట్టుదలతో పని చేస్తే విజయ తీరాలు చేరవచ్చంటూ మార్గ నిర్దేశం చేశారు. పొందారు.
 
బుధవారం  ఉదయం 11.30 గంటలకు ప్రారంభమైన ఈ సమీక్షలు ప్రతి రోజూ తెల్లవారుజాము వరకూ కొనసాగాయి. ముఖ్యంగా జిల్లాలోని మూడు పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని 17 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ గెలుపోటములపై జగన్‌మోహన్‌రెడ్డి లోతైన పరిశీలన చేశారు. చివరి రోజైన శుక్రవారం ఉభయ గోదావరి జిల్లాల్లోని అమలాపురం, రాజమండ్రి, నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో అసెంబ్లీ సెగ్మెంట్లపై సమీక్ష సాగింది. పి.గన్నవరం, రాజోలు, ముమ్మిడివరం, రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, రాజానగరం, అనపర్తి, గోపాలపురం, నిడదవోలు, కొవ్వూరు, నరసాపురం,  తణుకు, తాడేపల్లిగూడెం, భీమవరం, ఆచంట, పాలకొల్లు, ఉండి అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ గెలుపోటములపై నేతలు, కార్యకర్తలతో జననేత సమీక్షించారు.
 
ప్రతి కార్యకర్తను పేరుపేరునా పలకరిస్తూ వారి మనోగతం తెలుసుకున్నారు. పార్టీని గ్రామ, బూత్ స్థాయి వరకూ బలోపేతం చేయాలని.. కార్యకర్తలకు పార్టీ అండగా ఉందన్న భరోసాను కల్పించాలని మాట్లాడిన కార్యకర్తలంతా సూచించారు. ప్రతి నెలా గ్రామ కమిటీలు సమావేశమవ్వాలని, ప్రతి ఆరు నెలలకోసారి అధినేత జిల్లా సమీక్షలు నిర్వహించాలని, పార్టీ స్థితిగతులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు.
 
‘రానున్నది మనకు పరీక్షా కాలం. ప్రతి కార్యకర్తా రోడ్డెక్కి ఉద్యమించాల్సిన సమయం వేధింపులు, కేసులతో మన కార్యకర్తలను అధికార పార్టీ ఇబ్బందుల పాల్జేస్తుంది. వారికి అండగా నిలవాల్సిన బాధ్యత అధిష్టానంపై ఉంది’ అని సూచించారు. ఇంతటి ప్రతికూల పరిస్థితుల్లో సైతం జిల్లాలోని జగ్గంపేట, ప్రత్తిపాడు, తుని, కొత్తపేట, రంపచోడవరంలలో విజయం సాధించిన ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, వరుపుల సుబ్బారావు, దాడిశెట్టి రాజా, చిర్ల జగ్గిరెడ్డి, వంతల రాజేశ్వరిలను జగన్‌మోహన్ రెడ్డి అభినందించారు.
 
 ఓటమి చెందిన అభ్యర్థులతో పాటు ఆయా నియోజకవర్గాల కార్యకర్తల మనోగతాన్ని తెలుసుకుంటూ వారిలో ధైర్యం నూరి పోశారు. రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షంగా రానున్న రోజుల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ‘చంద్రబాబులా నేను అబద్ధాలు ఆడలేకనే ప్రతిపక్షంలో ఉన్నాను. ఆచరణ సాధ్యం కాని రైతు రుణమాఫీ చేస్తానని ఒక్క మాట చెప్పి ఉంటే చాలు. మనం అధికారంలోకి వచ్చి ఉండేవాళ్లం. కానీ మూడు నెలలు తిరక్కుండానే రైతులు, ప్రజల ఛీత్కారానికి గురయ్యేవాళ్లం’ అని జగన్‌మోహన్‌రెడ్డి అన్నప్పుడు నిబద్ధత గల నాయకుడి సారథ్యంలో పని చేయడం అదృష్టంగా భావిస్తున్నామని పలువురు కార్యకర్తలు అన్నారు.
 
నీతి, నిజాయితీ, విలువలు, విశ్వసనీయతతో పని చేసే జగన్‌మోహన్‌రెడ్డి వంటి నాయకుడు ఉండడం గర్వంగా ఉందని పేర్కొన్నారు. వచ్చే ఐదేళ్లలో పార్టీని మరింత బలోపేతం చేసి 2019 ఎన్నికల్లో అధికారంలోకి తెచ్చేవిధంగా పని చేస్తామని పార్టీ జిల్లా నాయకుడు మిండగుదిటి మోహన్ అన్నారు.  జగన్‌మోహన్‌రెడ్డి వెంట రానున్న ఐదేళ్లూ సైనికుల్లా పని చేస్తామని ముమ్మిడివరానికి చెందిన పెయ్యిల చిట్టిబాబు అన్నారు. పార్టీ అధినేత చేసిన దిశానిర్దేశం, పార్టీకి వెన్నుదన్నుగా నిలచిన కార్యకర్తలు దృఢ సంకల్పం తమలో మరింత కసిని పెంచాయని ఓటమి చెందిన అభ్యర్థులు అన్నారు. అధినేత ఆదేశాల మేరకు జిల్లాలో పార్టీని గ్రామ, బూత్‌స్థాయి వరకూ బలోపేతం చేసి, కార్యకర్తలకు అండగా నిలుస్తామని ప్రతినబూనారు. చంద్రబాబు మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగడతామని చెప్పారు.
 
ఈ సమీక్షల్లో పార్టీ జిల్లా అధ్యక్షుడు కుడుపూడి చిట్టబ్బాయి; ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, వరుపుల సుబ్బారావు, దాడిశెట్టి రాజా, వంతల రాజేశ్వరి; ఎమ్మెల్సీలు బొడ్డు భాస్కరరామారావు, ఆదిరెడ్డి అప్పారావు; మాజీ మంత్రి పినిపే విశ్వరూప్; మాజీ ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, రౌతు సూర్యప్రకాశరావు, పెండెం దొరబాబు; పార్టీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి; అసెంబ్లీ నియోజకవర్గ కో-ఆర్డినేటర్లు బొమ్మన రాజ్‌కుమార్, ఆకుల వీర్రాజు, గుత్తుల సాయి, డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, బొంతు రాజేశ్వరరావు; రాష్ర్ట యూత్, సేవాదళ్, ప్రచార, రైతు కమిటీ సభ్యులు తాడి విజయభాస్కరరెడ్డి, వాసిరెడ్డి జమీలు, సుంకర చిన్ని, వసుంధర, జక్కంపూడి తాతాజీ; అనుబంధ కమిటీల కన్వీనర్లు కర్రి పాపారాయుడు, అనంత ఉదయభాస్కర్, మంతెన రవిరాజు, గారపాటి ఆనంద్; పార్టీ నాయకులు భూపతిరాజు సుదర్శనబాబు, ఆర్‌వీవీ సత్యనారాయణచౌదరి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement