ప్రజారోగ్యం ప్రక్షాళన | Sakshi
Sakshi News home page

ప్రజారోగ్యం ప్రక్షాళన

Published Mon, Aug 3 2015 12:39 AM

ప్రజారోగ్యం ప్రక్షాళన - Sakshi

ఇద్దరు ఏఎంఓహెచ్‌ల కుర్చీలు ఖాళీ
ట్రేడ్‌లకు డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికెట్లు తప్పనిసరి
పూర్తిస్థాయిలో ఆధార్ అటెండెన్స్‌కు కసరత్తు

 
విజయవాడ సెంట్రల్ :  ప్రజారోగ్య శాఖలో పేరుకుపోయిన అవినీతి మకిలిని వదిలించేందుకు కమిషనర్ జి.వీరపాండియన్ కసరత్తు చేస్తున్నారు. టార్గెట్లు, డెడ్‌లైన్లతో ఠారెత్తిస్తున్నారు. మాట వినకుంటే సస్పెన్షన్ తప్పదన్న హెచ్చరికలు జారీచేస్తున్నారు. దీర్ఘకాలికంగా పాతుకుపోయిన అధికారుల పీఠాలు కదిలిస్తున్నారు. తొలి విడతగా ఏఎంఓహెచ్ (అసిస్టెంట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్లు) 1, 3 ఎం.గోపీనాయక్, పి.రత్నావళిని సాగనంపాలని నిర్ణయించారు. దీంతో వారిద్దరూ హైదరాబాద్‌లో పైరవీలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
 
ప్ర‘దక్షిణ’లు
 డెరైక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్‌కు చెందిన గోపీనాయక్, రత్నావళి 2012 ఆగస్టులో డిప్యుటేషన్‌పై నగరపాలక సంస్థకు  వచ్చారు. గత ఏడాదితోనే వీరి డిప్యుటేషన్ గడువు పూర్తికాగా వ్యక్తిగత, ఆరోగ్య కారణాల దృష్ట్యా మరో ఏడాది పొడిగించాల్సిందిగా పేరెంట్ డిపార్ట్‌మెంట్‌ను కోరారు. ఈ ఏడాది ఆగస్ట్ వరకు పొడిగించారు. వీరి పనితీరు బాగోలేదంటూ మేయర్ కోనేరు శ్రీధర్ పలుమార్లు కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. కమిషనర్ స్వీయ పర్యవేక్షణలోనూ అదే తేలింది. ఈ క్రమంలో మరో ఏడాది తమను నగరపాలక సంస్థలోనే కొనసాగించాలని కోరుతూ అధికారులిద్దరూ పేరెంట్ డిపార్ట్‌మెంట్ చుట్టూ ప్ర‘దక్షిణ’లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈనెల రెండున రత్నావళిని రిలీవ్ చేయాలంటూ వారం రోజుల క్రితమే  పబ్లిక్‌హెల్త్ అండ్ ఫ్యామిటీ వెల్ఫేర్ డెరైక్టర్ ఉత్తర్వులిచ్చారు. ప్రజారోగ్యశాఖకు చెందిన ఈ ఉత్తర్వుల్ని అదనపు కమిషనర్ జి.నాగరాజుకు చేరాల్సి ఉండగా, రత్నావళి మధ్యలో హైజాక్ చేశారని సమాచారం. ఇది కమిషనర్ చెవినపడటంతో  సీరియస్ అయ్యారు. వెంటనే ఆమెను రిలీవ్ చేయాల్సిందిగా ఆదేశాలిచ్చారు. ఆ స్థానంలో ఆయుర్వేద ఆస్పత్రి ఇన్‌చార్జిగా పనిచేస్తున్న రామకోటేశ్వరరావుకు బాధ్యతలు అప్పగించారు. గోపీనాయక్ డిప్యుటేషన్ గడువు ఈ నెల 6 తేదీతో ముగియనుంది.

 అక్రమాలకు చెక్
 డేంజరస్ అండ్ అఫెన్సివ్ (డీఅండ్‌ఓ) ట్రేడ్ లెసైన్సుల్లో అక్రమాలకు చెక్ పెట్టాలని కమిషనర్ నిర్ణయించారు. డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికెట్లు ఆరు రోజుల్లోపు జారీ చేయాలని డెడ్‌లైన్ విధించారు. గడువులోపు సర్టిఫికెట్లు జారీ చేయకుంటే శానిటరీ ఇన్‌స్పెక్టర్లను సస్పెండ్ చేస్తానని వార్నింగ్ ఇచ్చారు. నగరంలో 36 వేల డీఅండ్‌ఓ ట్రేడ్ లెసైన్స్‌లు ఉన్నాయి. ఇందులో భారీగా అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలున్నాయి. గతంలో గవర్నర్‌పేట ప్రాంతంలో వసూలుచేసిన సొమ్మును ఎస్‌ఐ సొంత ఖర్చులకు వాడేసిన సంగతి తెలిసిందే. సుమారు 8 వేల డీఅండ్‌ఓ ట్రేడ్ లెసైన్స్‌ల నుంచి రూ.1.50 కోట్లు వసూలు కావాల్సిఉంది. నగరంలో వ్యాపారాలు విస్తరిస్తున్నప్పటికీ ఆస్థాయిలో డీఅండ్‌ఓ ట్రేడ్‌ల వసూళ్లు పెరగడం లేదు. ఎస్‌ఐల చేతివాటంపై విమర్శలున్నాయి.  ఈక్రమం డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికెట్లను తెరపైకి తేవడం ద్వారా పారదర్శకంగా వ్యవహరించవచ్చన్నది కమిషనర్ ఆలోచనగా తెలుస్తోంది.

 ఆధార్ తప్పనిసరి
 పర్యవేక్షణ సక్రమంగా లేకపోవడం వల్లే ప్రజారోగ్యశాఖ గాడితప్పిందన్న అభిప్రాయానికి కమిషనర్ వచ్చారు. మస్తర్ల మాయ పేరుతో ప్రతి నెలా లక్షలాది రూపాయల్ని నొక్కేస్తున్నారు. ఆధార్ అటెండెన్స్‌తో అక్రమాలను సరిదిద్దాలన్నది కమిషనర్ ఆలోచన. ఏడెనిమిది డివిజన్లలో మాత్రమే ప్రస్తుతం ఆధార్ అటెండెన్స్ విధానం అమల్లో ఉంది. దీన్ని అన్ని డివిజన్లలో అమలుచేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
 అర్బన్ క మ్యూనిటీ డెవలప్‌మెంట్ (యూసీడీ) ద్వారా ట్యాబ్‌లు సిద్ధం చేశారు. సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేసి త్వరలోనే ఆధార్ అటెండెన్స్‌ను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు. మూడు సర్కిళ్ల పరిధిలో 12 మంది శానిటరీ ఇన్‌స్పెక్టర్ల పనితీరుపై    కమిషనర్ అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే వారిపై వేటు వేయనున్నట్లు సమాచారం.  
 

Advertisement
Advertisement