ప్రసవ వేదన | Sakshi
Sakshi News home page

ప్రసవ వేదన

Published Fri, Jan 24 2014 12:45 AM

ప్రసవ వేదన

  •      ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసూతి సౌకర్యాలు అధ్వానం
  •      సిబ్బంది, వైద్యుల నిర్లక్ష్యం
  •      మహిళలకు ప్రత్యక్ష నరకం
  •      అత్యవసర పరిస్థితుల్లో నిపుణులు కానరాని వైనం
  •      {పైవేటు ఆస్పత్రులే దిక్కనుకుంటున్న జనం
  •  
     ప్రసవమంటే మహిళకు పునర్జన్మే అంటారు. మరో ప్రాణికి జన్మనిచ్చే ఆ క్లిష్ట తరుణం అమ్మతనానికి అగ్ని పరీక్ష అంటారు. ఇటువంటి పరిస్థితుల్లో కాన్పు సజావుగా సాగడానికి ఎంత మంచి సౌకర్యాలుండాలి! వైద్యులు, సిబ్బంది ఎంత శ్రద్ధగా సేవలందించాలి! కానీ మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మాత్రం అటువంటి సేవలు, వసతుల ఊసే లేదు. అందుకే ప్రభుత్వ ఆస్పత్రుల వైపు గర్భిణులు కనీసం తొంగి చూడడం లేదు. సిబ్బంది బాధ్యతారాహిత్యం, కనీస సౌకర్యాలకూ నోచుకోని దైన్యం ప్రభుత్వ ఆస్పత్రంటేనే గర్భిణులు బెంబేలెత్తిపోయేలా చేస్తున్నాయి. దాంతో పీహెచ్‌సీలలో కాన్పులు నానాటికీ తగ్గిపోతున్నాయి. మరోదారి లేక అక్కడ ప్రసవాలకు సిద్ధపడుతున్న అతివలకు ఈ సమస్యలు భయానక అనుభవాలను మిగులుస్తున్నాయి.
     
    చోడవరం,న్యూస్‌లైన్: ప్రసవాలకు ప్రభుత్వ ఆస్పత్రులకు రావాలని ఎలుగెత్తి చాటుతున్నారు.. అక్కడి పరిస్థితులను మాత్రం పెద్దలు వాటంగా విస్మరిస్తున్నారు. అధ్వానంగా ఉండే వాతావరణంలో, కనీస వసతులకు నోచుకోని వైద్యశాలల్లో.. డాక్టర్లు లేక, సిబ్బంది సాయపడక.. గర్భిణులు నరకయాతన పడుతున్నారు. ఈ బాధలెందుకు లెమ్మని అప్పోసప్పో చేసి ప్రైవేటు ఆస్పత్రులనే ఆశ్రయిస్తున్నారు.
     
    ప్రసూతి సేవలకు సంబంధించి ప్రభుత్వ ఆస్పత్రుల తీరు దయనీయంగా ఉంది.  వైద్య ఆరోగ్యశాఖ, వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలోని ఆస్పత్రుల్లో ప్రసవాలంటేనే మహిళలు అస్యహించుకునే పరిస్థితి ఉంది. ఆరోగ్యకేంద్రాల్లో కనీస సౌకర్యాలు కానరావడం లేదు.. వైద్యులు, సిబ్బంది  సక్రమంగా విధులు నిర్వహించడం లేదు. దాంతో ఒకప్పుడు నెలలో 30 నుంచి 40 వరకు ప్రసవాలు జరిగే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఇప్పుడా సంఖ్య పదికి మించడం లేదు. కశింకోట పీహెచ్‌సీ వంటి వాటిలో అయితే నెలకు ఐదు ప్రసవాలు చేయడం గగనంగా మారింది.
     
    కొందరు ఎఎన్‌ఎంలు విధులను నిర్లక్ష్యం చేస్తున్నారు. నైపుణ్యం లేని ఆశ కార్యకర్తలే కాన్పు చేయిస్తున్నారు. ప్రసవం క ష్టమైతే చేతులెత్తేస్తున్నారు. అటువంటి స్థితిలో ఆపరేషన్‌కు అనుకూలమైన థియేటర్లు, సర్జన్లు అందుబాటులో ఉండడం లేదు. క్లిష్ట దశలో కేజీహెచ్‌కు తరలించే లోగా కొందరు గర్భిణులు ప్రాణాలు కోల్పోతున్న సందర్భాలు ఉన్నాయి.
     
    ఏఎన్‌ఎంలు.. ఎక్కడ ?

     
    మైదాన ప్రాంతాల్లో, ఏజెన్సీలో మారుమూలు ప్రాంతాల్లో ఉన్న సబ్ సెంటర్లలో ఏఎన్‌ఎంలు సక్రమంగా ఉండడం లేదు. దేవరాపల్లి మండలంలో ఇటీవల ఓ గర్భిణిని నదిలో కాజ్‌వే దాటిస్తూ ఉండగా, మధ్యలోనే ప్రసవించిన సంఘటనే దీనికి తార్కాణం. ఇటీవల కె.కోటపాడు 30పడకల ఆస్పత్రిలో రికార్డులు తనిఖీ చేసిన కలెక్టర్ బాగా త గ్గిపోయిన ప్రసవాల సంఖ్యను చూసి అవాక్కయ్యారు. ఈ పరిస్థితికి ఆస్పత్రుల్లో పరిస్థితులే కారణమన్నది విస్పష్టం. గ్రామీణులకు ఇక్కడి సేవలపై నమ్మకం కొరవడుతోంది.

    కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సల నిర్వహణ మరీ అధ్వానంగా ఉంది. ప్రస్తుతం వీటిని మొక్కుబడిగా నిర్వహిస్తున్నా రు. అప్పుడప్పుడు లక్ష్యాల కోసం మెగా కుటుంబ సంక్షేమ శిబిరాలు నిర్వహిస్తున్నారు. మెగా శిబిరాలప్పుడు  పెద్ద సంఖ్యలో మహిళలను తీసుకొస్తున్న సిబ్బంది ఆపరేషన్ల అనంతరం వారి గోడు పట్టించుకోవడం లేదు. ఆపరేషన్ల తర్వాత నేలపైనే వదిలేస్తున్నారు. తిరిగి ఇళ్లకు తరలించే విషయాన్ని కూడా గాలికొదిలేస్తున్నారు.
     

Advertisement

తప్పక చదవండి

Advertisement