Sakshi News home page

పాఠశాలలకు భద్రత కరవు

Published Thu, Feb 27 2014 2:09 AM

public schools Security drought

గుంటూరు ఎడ్యుకేషన్, న్యూస్‌లైన్ :ప్రభుత్వ పాఠశాలల్లో విలువైన సామగ్రి, రికార్డులకు భద్రత కొరవడింది. తరచూ కంప్యూటర్లు, ఫర్నిచర్ అపహరణకు గురవుతున్నాయి. రాత్రి వేళ కాపలాదారులు లేక అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారుతున్నాయి. ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యం కారణంగా పాఠశాలలు నిర్లక్ష్యపు నీడన కొనసాగుతున్నాయి. ప్రభుత్వ ఉన్నత పాఠశాలల అభివృద్ధికి రాజీవ్ విద్యామిషన్, రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ ద్వారా ఏటా లక్షలాది రూపాయలు విడుదల చేస్తున్నారు. విద్యార్థులకు కంప్యూటర్ శిక్షణ కల్పించేందుకు ఇన్ఫర్మేషన్ అండ్  కంప్యూటర్ టెక్నాలజీ (ఐసీటీ) పథకం కింద ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో 11 కంప్యూటర్ల చొప్పున ఏర్పాటు చేశారు. వీటితో పాటు ప్రింటర్, జనరేటర్, ఫర్నిచర్, ల్యాబ్‌లో పరికరాలు, రికార్డులు భద్ర పరిచే బీరువాలు ఉన్నాయి. రాత్రి వేళలు, సెలవు దినాల్లో పాఠశాల వైపు కన్నెత్తి చూసే వారు లేకపోవడంతో వాటి భద్రత గాల్లో దీపంలా మారింది. 
 
 కంప్యూటర్ల అపహరణ
 కాపలాదారులు లేని కారణంగా ఇటీవల జిల్లాలోని పలు పాఠశాలల్లో కంప్యూటర్లు చోరీకి గురయ్యాయి. యడ్లపాడు మండలంలోని జగ్గాపురం, నాదెండ్ల మండలం సంక్రాంతిపాడు జెడ్పీ ఉన్నత పాఠశాలల్లో రాత్రివేళ తలుపులు పగులగొట్టి కంప్యూటర్లు అపహరించారు. మాచర్లలోని పలు పాఠశాలల్లో ఇదే రీతిలో చోరీలు జరిగాయి. మరికొన్ని పాఠశాలలు సెలవుదినాల్లో ప్లేగ్రౌండ్స్‌గా మారిపోతున్నాయి. గుంటూరు నగరంలో చౌత్రాలో ఉన్న ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలను పరిశీలిస్తే ఇక్కడ కాపలాదారుడు లేకపోవడంతో సెలవురోజుల్లో చుట్టపక్కల ప్రాంతాల్లోని యువకులు మెయిన్‌గేట్ తాళం పగులగొట్టి పాఠశాల ప్రాంగణంలోకి ప్రవేశిస్తున్నారు. ఇదేమని ప్రశ్నించిన ఉపాధ్యాయులతో ఘర్షణకు దిగి, తరగతి గదులపై రాళ్లు రువ్వడం, కిటికీల అద్దాలు పగుల గొట్డడం వంట చర్యలకు పాల్పడుతున్నారు. తమకు అడ్డుగా ఉందనే కారణంతో ఏకంగా పాఠశాల గోడకే కన్నం పెట్టగా, అనంతరం కాలంలో ఉపాధ్యాయులు ఆ కన్నం మూసివేశారు. దీనిపై ఉపాధ్యాయులు పోలీసులకు ఫిర్యాదు చేస్తే రోజూ తాము పాఠశాలలో మకాం వేసి ఉండలేమని, సొంతంగా కాపలాదారుడిని నియమించుకోవాలంటూ ఉచిత సలహా ఇచ్చారు. జిల్లా కేంద్రం లోనే ఇలా ఉంటే ఇక మారుమూల ప్రాంతాల్లో పరిస్థితి ఏ విధంగా ఉం టుందో అర్ధం చేసుకోవచ్చు. పల్నాడు ప్రాంతంలోని పలు పాఠశాలలు రాత్రి వేళల్లో మద్య వ్యసనపరుల, పేకాట రాయుళ్ళకు ఆశ్రయం కల్పిస్తున్నాయి.
 
 ప్రతిపాదనలు బుట్టదాఖలు..
 జిల్లా పరిషత్ యాజమాన్యంలో 314, ప్రభుత్వ యాజమాన్యంలో మరో 13 ఉన్నత పాఠశాలలు కొనసాగుతుండగా వీటిలో 28 మినహా మిగిలిన స్కూళ్ళలో కాపలాదారులు లేరు. నాలుగేళ్ల క్రితం అప్పటి జెడ్పీ చైర్‌పర్సన్ కూచిపూడి అధ్యక్షతన జెడ్పీ ఉన్నత పాఠశాలలకు కాపలాదారులను నియమించాలని తీర్మానం చేసి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖకు పంపిన ప్రతిపాదనలు బుట్టదాఖలయ్యాయి. కనీసం ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో అయినా కాపలాదారులను నియమించాలని ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మొరపెట్టుకుంటున్నా ప్రయోజనం శూన్యం. 
 

Advertisement

What’s your opinion

Advertisement