Sakshi News home page

‘చిత్తూరు’ అతలాకుతలం

Published Thu, Oct 5 2017 9:24 AM

public suffering in chittore with heavy rains - Sakshi

సాక్షి, తిరుపతి/సోమల/సంజామల/రామకుప్పం:  చిత్తూరు జిల్లాను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు జనజీవనం స్తంభించింది. బుధవారం కురిసిన వర్షానికి పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. రెండు వేర్వేరు చోట్ల వాగుల్లో పడి ఇద్దరు మృతిచెందారు. చిత్తూరు జిల్లాతో పాటు విశాఖ, కర్నూలు, పశ్చిమగోదావరి జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురిశాయి. చిత్తూరు జిల్లాలోని కుప్పం, పలమనేరు, చిత్తూరు నియోజకవర్గాల పరిధిలోని మండలాల్లో మంగళవారం రాత్రి కుండపోత వర్షం కరిసింది. అత్యధికంగా పలమనేరులో 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇదిలా ఉండగా తవణంపల్లె మండలం గురుకువారిపల్లె వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న నీటిని చూసేందుకు వెళ్లి గణేష్‌ గౌండర్‌ అనే యువకుడు నీటిలో కొట్టుకుపోయి మృతిచెందాడు. కుప్పం రూరల్‌ మండలం నూలుకుంట సమీపంలో గంగాలప్పరేపు చెక్‌ డ్యాంలో పడి అబ్దుల్‌ రెహమాన్‌ దుర్మరణం పాలయ్యాడు.

జల దిగ్బంధంలో పెద్ద ఉప్పరపల్లె
పుంగనూరు నియోజకవర్గం సోమల మండలంలోని పెద్ద ఉప్పరపల్లె, ఆవులపల్లె, అన్నెమ్మగారిపల్లె, నంజంపేట పంచాయతీల్లో బుధవారం రాత్రి కురిసిన వర్షానికి 30 గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. దుర్గంకొండలు, చౌడేపల్లె అడవుల్లో సుమారు మూడు గంటలపాటు ఎడ తెరిపి లేని వర్షం పడింది. వర్షం ధాటికి సీతమ్మ చెరువు, గార్గేయ నదికి నీటి ఉధృతి పెరిగింది. విద్యుత్‌ సరఫరా లేకపోవడం, గ్రామాలపై వంకల నుంచి నీళ్లు రావడంతో గ్రామస్తులు మిట్ట ప్రదేశాలకు వెళ్లి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని తలదాచుకుంటున్నారు. గడ్డమాను ఒడ్డు, దోనిమాకుల చెరువులకు గండ్లు పడ్డాయి.

పది మంది కూలీలను కాపాడిన గ్రామస్తులు
కర్నూలు జిల్లా సంజామల మండలం పేరుసోముల గ్రామస్తులు వాగులో చిక్కుకుపోయిన ట్రాక్టర్‌లోని పదిమంది కూలీలను రక్షించారు. ట్రాక్టర్‌ ఇంజిన్‌లోకి నీరు చేరడంతో వాగు మధ్యలోట్రాక్టర్‌ ఆగిపోయింది. దీంతో స్థానికులు తాళ్ల సాయంతో కూలీలను ఒడ్డుకు చేర్చారు.

షెడ్డు కూలి ముగ్గురి దుర్మరణం
కర్ణాటక సరిహద్దు ప్రాంతం రాజుపేటరోడ్డులో బుధవారం తెల్లవారుజామున ఇటుకల బట్టీలోని షెడ్డు వర్షాలకు నానడంతో కూలిపోయి షెడ్డులో నిద్రిస్తున్న సుక్కుర్‌సాబ్‌ (60), ఫాతిమా (50) దంపతులతో పాటు చిన్నారి నయాజ్‌ (5) దుర్మరణం పాలయ్యారు.

తాళ్లసాయంతో కూలీలను రక్షిస్తున్న  పేరుసోముల గ్రామస్తులు

Advertisement
Advertisement