‘పల్స్ పోలియో’కు రంగం సిద్ధం | Sakshi
Sakshi News home page

‘పల్స్ పోలియో’కు రంగం సిద్ధం

Published Thu, Jan 15 2015 2:51 AM

‘పల్స్ పోలియో’కు రంగం సిద్ధం

 కాకినాడ క్రైం :జిల్లాలో 60వ విడత పల్స్ పోలియో నిర్వహణకు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు రంగం సిద్ధం చేశారు. 2008లో చిట్టచివరి పోలియో కేసు కాకినాడ జగన్నాథపురం ఏటిమొగలో నమోదు కావడంతో అక్కడి నుంచే ఈ కార్యక్రమాన్ని ఇన్‌చార్జ్ కలెక్టర్‌తో లాంఛనంగా ప్రారంభింపజేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 18వ తేదీన బూత్‌లలో 19, 20 తేదీల్లో ఇంటిం టా పల్స్‌పోలియో కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రణాళికలు రూపొందించారు. అయితే రాజమండ్రి నగర పరిధిలో అవాసా లు అధికంగా ఉండడంతో అక్కడ 21వ తేదీన కూడా కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. జిల్లాలో 5 ఏళ్లలోపు చిన్నారులు 5, 30,884 మంది ఉన్నట్టు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు.
 
 ఇందుకుగాను 6.65 లక్షల డోసుల వ్యాక్సిన్‌ను ఆయా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ఇప్పటికే తరలించారు. పల్స్‌పోలియో నిర్వహణకు జిల్లాలో 3,250, విలీన మండలాల్లో 332 బూత్‌లను ఏర్పాటు చేశారు. ప్రత్యేకించి విలీన మండలాలకు 22 వేల డోసుల వ్యాక్సిన్‌ను సరఫరా చేశారు. 320 మంది సూపర్‌వైజర్ల ను పది రూట్లలో నియమించారు. రాజమండ్రికి టీబీ కంట్రోల్ ఆఫీసర్ డాక్టర్ ప్రసన్న కుమార్, కాకినాడకు ఎయిడ్స్ కంట్రోల్ ఆఫీసర్ డాక్టర్ ఎం. పవన్ కుమార్, రామచంద్రపురానికి ఎన్‌ఆర్‌హెచ్‌ఎం డీపీఎం డాక్టర్ మల్లిక్‌తో పాటు మండపేట, అమలాపురం, ముమ్మిడివరం, పెద్దాపురం తదితర ప్రాంతాల్లో ఆయా ప్రాంతాల డిప్యూటీ డీఎంహెచ్‌ఓలను ఈ కార్యక్రమానికి పర్యవేక్షకులుగా నియమించారు.
 
 ప్రచార సామగ్రి పంపిణీ
 పల్స్ పోలియో కార్యక్రమంపై ప్రజల్లో పూర్తిస్థాయి అవగాహన కల్పించేందుకు అవసరమైన ప్రచార సామగ్రి బుధవారం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయానికి చేరింది. దీంతో ఆ సామాగ్రిని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆస్పత్రులతో పాటు పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించే బూత్‌లకు తరలించే సన్నాహాల్లో డెమో సెక్షన్ అధికారులు నిమగ్నమయ్యారు. మత్స్యకార పల్లెలు, ఇటుక బట్టీలు, ఇతర సంచార జాతులు నివసించే ప్రాంతాలతో పాటు బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో పూర్తిస్థాయిలో బ్యానర్లు, పోస్టర్లు ఏర్పాటుచేయాలని అధికారులు నిర్ణయించడంతో ఆ మేరకు ఏర్పాట్లు చేస్తున్నట్టు డెమో ప్రసాదరాజు తెలిపారు. నూరు శాతం లక్ష్యాన్ని పూర్తిచేసేందుకు ప్రణాళికలు రచించామన్నారు.
 
 బాధ్యతగా వ్యవహరించాలి
 ఐదేళ్ల లోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయించడాన్ని తల్లిదండ్రులంతా బాధ్యతగా స్వీకరించాలి. అలాగే ఇరుగు పొరుగు పిల్లలకు కూడా చుక్కలు వేయించేలా విద్యార్థులు, విద్యావంతులు, ఉద్యోగులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. సమాజం నుంచి పోలియోను పూర్తి స్థాయిలో తరిమికొట్టడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఎం. సావిత్రమ్మ ఆదేశాల మేరకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశాం. వ్యాక్సిన్, ప్రచార సామగ్రిని పీహెచ్‌సీలు, ఆరోగ్య కేంద్రాలకు చేరవేశాం. అయితే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంలో వైద్య సిబ్బంది కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి.
 -డాక్టర్ అనిత, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి
 

Advertisement
Advertisement