గందరగోళం! | Sakshi
Sakshi News home page

గందరగోళం!

Published Wed, Dec 4 2013 1:06 AM

Rachabanda to check field level problems

 సాక్షి, రంగారెడ్డి జిల్లా: మూడో విడత రచ్చబండ జిల్లాలో గందరగోళంగా మారింది. కార్యక్రమం ముగిసి ఐదురోజులు కావస్తున్నా.. ఇప్పటివరకు ఎంతమందికి రచ్చబండ ఫలాలను అందించారో లెక్క తేలడం లేదు. దీంతో యంత్రాంగం అయోమయంలో పడింది.  క్షేత్రస్థాయిలో అధికారుల మధ్య సమన్వయలోపం కారణంగానే ఈ పరిస్థితి తలెత్తినట్లు తెలుస్తోంది. లెక్కలు తేల్చే మార్గం కన్పించక జిల్లా ప్రణాళిక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. జిల్లాలో గత నెల 11వ తేదీ నుంచి మూడో విడత రచ్చబండ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 1,10,662 రేషన్ కూపన్లు, 27,890 పింఛన్లు, 40,353 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా, వీటిని ఎంపిక చేసిన లబ్ధిదారులకు ఈ కార్యక్రమాల్లో మంజూరు పత్రాలు అందించాలి. అయితే అనివార్య కారణాల వల్ల రెండ్రోజులు ఆలస్యంగా రచ్చబండ మొదలుపెట్టినప్పటికీ.. నవంబర్ 26లోపు జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. కానీ ఈ కార్యక్రమం ద్వారా ఎంతమందికి మంజూరుపత్రాలు ఇచ్చారో లెక్క మాత్రం తేలలేదు.
 
 ఆన్‌‘లైన్’ తప్పింది..
 వాస్తవానికి రచ్చబండ కార్యక్రమంలో మంజూరు పత్రాలను అందించిన వెంటనే ఆయా వివరాలు ఆన్‌లైన్లో అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది. ఇందుకుగాను మండల పరిషత్ అభివృద్ధి అధికారులకు ప్రత్యేకంగా యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌లను ఏర్పాటు చేశారు. అయితే జిల్లాలోని పలు మండలాల్లో వివరాల నమోదు ప్రక్రియ తప్పుల తడకగా సాగింది. ఆన్‌లైన్‌లో ఉన్న వివరాలకు,  క్షేత్రస్థాయిలో పంపిణీ చేసిన లబ్ధిదారుల వివరాలకు ఏమాత్రం పొంతన కుదరడం లేదు. గత వారం రచ్చబండ వివరాలను కలెక్టర్ బి.శ్రీధర్ సమీక్షిస్తూ పొంతన లేని వివరాలను గుర్తించి సంబంధిత అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే సరైన వివరాలు వెబ్‌సైట్లో పొందుపర్చాలని సూచించారు. ఇందుకు వెబ్‌సైట్‌లో ఎడిట్ ఆప్షన్ ఇచ్చారు. కానీ మెజారిటీ మండలాల్లో వివరాలను మార్చలేదు. ముఖ్యంగా రేషన్ కూపన్లకు సంబంధించిన వివరాల్లో తీవ్ర వ్యత్యాసం కనిపిస్తోంది. స్థానికంగా ఎంపీడీఓ, తహసీల్దార్ మధ్య సమన్వయ లోపంతో ఈ పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉండగా.. రచ్చబండ కార్యక్రమం నిర్వహించిన తీరు, ఇతర అంశాలపై బుధవారం కలెక్టర్ బి.శ్రీధర్ మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, రెవెన్యూ అధికారులతో కలెక్టరేట్‌లో సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయోనని అధికారులు ఉత్కంఠగా ఉన్నారు.
 

Advertisement
Advertisement