నాడే అంతం చేశారు... | Sakshi
Sakshi News home page

నాడే అంతం చేశారు...

Published Fri, Dec 27 2013 5:35 AM

radha potu raju not a missing case it's murdered

వెంకటాపురం,న్యూస్‌లైన్ : వెంకటాపురం మండలం వీఆర్‌కె పురం గ్రామానికి చెందిన డర్రా రాధ, డర్రా పోతురాజుల అదృశ్యం కేసులో మిస్టరీ వీడింది. ఎప్పటికైనా తిరిగి వస్తారని ఎదురుచూస్తున్న వారి కుటుంబ సభ్యులను పోలీసులు ఇచ్చిన సమాచారం హతాశులను చేసింది.  రాధ, పోతురాజులను సమీప బంధువులే అత్యంత కిరాతకంగా అంతమొందించారు. వివాహేతర సంబంధమే ఈ ఘటనకు కారణమని పోలీసుల విచారణలో తేలింది. ఇందుకు సంబంధించి వెంకటాపురం సీఐ కే ఆర్‌కే ప్రసాద్ గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు.

  వీఆర్‌కేపురానికి చెందిన డర్రా దామోదర్‌కు ఇదే గ్రామానికి  చెందిన రాధతో పదేళ్ల క్రితం వివాహమైంది. వివాహమై సంవత్సరాలు గడుస్తున్నప్పటకీ వీరికి పిల్లలు పుట్టలేదు. దీంతో దామోదర్ అదే గ్రామంలోని వేరే మహిళతో  వివాహేతర సం బంధం పెట్టుకున్నాడు. అంతటితో ఆగకుండా భార్యను చిత్రహింసలకు గురిచేసేవాడు. ఇదిలా ఉండగా దామోదర్ చిన్నాన్న కుమారుడైన పోతురాజు అనే వ్యక్తి రాధతో సన్నిహితంగా మెలగటమే కాకుండా ఆమెతో  వివాహేతర సం బంధం పెట్టుకున్నాడు.  రాధ,పోతురాజు 2012 జూలై నెలలో ఊరు నుంచి పారిపోయారు.  నెల్లూరు జిల్లా  బోగాల మండలం సీఆర్ పురం గ్రామంలోని బ్రహ్మయ్య ఇంటికి వారు వెళ్లారు. గతంలో వెంకటాపురం ఏరియాలో తాపీ మేస్త్రీగా  బ్రహ్మయ్య పనిచేయటంతో అతనితో ఉన్న పరిచయం మేరకు రాధ, పోతురాజు ఇరువురు బ్రహ్మయ్యను ఆశ్రయించారు. అక్కడ నుంచి వారు చెన్నై వెళ్లి కూలిపనులు చేసుకుంటూ సహజీవనం సాగించారు. రాధ, పోతురాజులు కలిసి పారిపోయినట్లుగా తెలుసుకున్న రాధ భర్త దామోదర్ వీరి గురించి ఆరా తీశాడు. వారు బ్రహ్మయ్య దగ్గర ఉన్నట్లు 15రోజుల తర్వాత తెలుసుకున్నాడు.

 దామోదర్, అతని కుటుంబ సభ్యులు సర్వేశ్వరరావు, వెంకటే శ్, నాగరాజు,వేణు,గోపి  నెల్లూరు జిల్లా సీఆర్‌పురంలోని బ్రహ్మయ్య ఇంటికి వెళ్లి వివరాలు తెలుసుకున్నారు. రాధ, పోతురాజులను  చె న్నై పంపించింది బ్రహ్మయ్య అని నిర్ధారించుకొని వారిని వెంటనే తమకు అప్పగించాలని నిలదీ శారు. వారిని  తమకు అప్పగించకపోతే పోలీ సులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. దీంతో బ్రహ్మయ్య చెన్నై వెళ్లి వారిద్దరినీ నెల్లూరుకు తీసుకొస్తుండగా, అప్పటికే వారి కోసం బస్టాండ్‌లో వేచిఉన్న  సర్వేశ్వరరావు, వెంకటేష్‌లను చూసిన రాధ, పోతురాజులు వారి కంట పడకుండా అక్కడనుంచి తప్పించుకుని కావలి వెళ్లిపోయారు. రాధ, పోతురాజులు పారిపోగా... బ్రహ్మయ్యను దామోదర్ పట్టుకున్నాడు. తమఊరు నుంచి వచ్చిన వారి గురించి తెలుసుకునేందుకు సాయంత్రం రాధ, పోతురాజులు బ్రహ్మయ్యకు ఫోన్ చేశారు. దీంతో తప్పించుకుపోయిన వారు  కావలిలో ఉన్నట్లుగా నిర్ధారించుకొని బ్రహ్మయ్యను అక్కడికి పంపించారు. వారిని జమ్మల పాలెం మీదుగా గుంటూరుకు తీసుకురమ్మని చెప్పి బ్రహ్మయ్యను పంపించినప్పటికీ, అతని వెనుకే ఆటో ద్వారా దామోదర్ తదితరులు వెంబడించారు.

 ఆటోలో ఎదురుగా తీసుకొస్తున్న రాధ, పోతురాజులను పట్టుకొని తమ ఆటోలో ఎక్కించుకున్నారు. అక్కడ నుంచి నేరు గా భద్రాచలం తీసుకొచ్చారు. అయితే రాధ, పోతురాజు దొరికారనే విషయం గ్రామంలో తెలిసింది. కాగా, భార్య  వివాహేతర సం బంధం పెట్టుకోవడాన్ని జీర్ణించుకోలేని దామోదర్ ఎలాగైనా వారిని అంతమొందించాలని నిర్ణయానికి వచ్చాడు. సహజీవనం చేసిన ఇరువురిని ఒక్కటి చేసేందుకు గ్రామంలోని పెద్దలను ఒప్పిస్తానని నమ్మబలికాడు. రాధతో తమ గ్రామంలో ఉన్న అత్తమామలకు ఫోన్ చేయిం చి, తాము బెంగుళూరులో ఉన్నట్లుగా చెప్పిం చాడు. వారం రోజుల తరువాత రాధ, పోతురాజు భద్రాచలం రావాలని చెప్పి  వారిని అక్క డ నుంచి  కరీంనగర్‌లోని బంధువులు ఇంటికి పంపించాడు. దామోదర్ మాటలు నమ్మిన వారిద్దరూ వారం రోజుల తరువాత కరీంనగర్ నుంచి రైలులో   కొత్తగూడెం వరకూ వచ్చారు.

 అప్పటికే కొత్తగూడెం రైల్వే స్టేషన్‌లో వేచి ఉన్న దామోదర్, వెంకటేష్, సర్వేశ్వరరావు, నాగరాజు, వేణు వారిని ఆటో ద్వారా భద్రాచలం తీసుకొచ్చారు. ఆటో భద్రాచలం గోదావరి బ్రిడ్జి మధ్యలోకి రాగా వారిని అంత మొందించాలని నిర్ణయించుకున్న దామోదర్, మిగతా వారు  పోతురాజు మెడకు కండువా చుట్టి బిగించారు. చనిపోయినట్లుగా నిర్ధారించుకొని బ్రిడ్జి పై నుంచి గోదావరిలో శవాన్ని వేశారు.  ఆ తరువాత రాధను గొంతు నులిమి ప్రాణాలు పోకముందే గోదావరి నదిలో తోసేశారు.  తరువాత వీరంతా గ్రామానికి వచ్చేశారు.  
 వెలుగులోకి ఎలా వచ్చిందంటే....
 రాధ తమ్ముడు సతీష్ మొక్కు తీర్చుకునే క్రమంలో  మూడు నెలల క్రితం  తిరుపతి వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో అక్కను చూసేందుకని నెల్లూరు జిల్లాలోని  సీఆర్‌పాలెంలో గల బ్రహ్మయ్య ఇంటికి వెళ్లాడు. అయితే రాధ, అతనితో పాటు ఉన్న పోతురాజును చాలా కాలం క్రితమే దామోదర్, మరికొంతమంది వచ్చి గ్రామానికి తీసుకెళ్లినట్లుగా బ్రహ్మయ్య చెప్పాడు. తిరిగి గ్రామానికి వచ్చిన సతీష్ ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలిపాడు. దీంతో రాధ విషయమై వారు దామోదర్‌ను నిలదీశారు. తనకేమీ తెలియదని దామోదర్ తప్పించుకోగా, దీనిపై అనుమానం వచ్చిన రాధ తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. రాధ తల్లిదండ్రుల ఫిర్యాదుతో అదృశ్యమైనట్లు కేసు నమోదు చేసిన పోలీసులు  ఆరా తీశారు.

 దీంతో మొత్తం వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కట్టుకున్న భర్తే కాలయముడుగా మారి అత్యంత కిరాతకంగా అంతమొందించటం సర్వత్రా చర్చనీయాంశమైంది.  హత్యకు పాల్పడినవారిలో నలుగురిని  పోలీసు లు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వేణు, గోపిలు పరారీలో ఉన్నారు. వీరిని కూడా త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని సీఐ కేఆర్‌కే ప్రసాద్ తెలిపారు. విలేకరుల సమావేశంలో ఎస్సై శివప్రసాద్, ట్రైనీ ఎస్సై వెంకటేశ్వర్లు ఉన్నారు.

Advertisement
Advertisement