ప్రగతి పట్టాలపై డీఆర్‌డీఏ | Sakshi
Sakshi News home page

ప్రగతి పట్టాలపై డీఆర్‌డీఏ

Published Wed, Jan 29 2014 3:40 AM

Rail progress DRDA

మహిళా సంఘాలు ఆర్థికంగా బలోపేతమయ్యేందుకు శాయశక్తులా కృషి చేస్తా. జిల్లాలో ఏడాదిపాటు పనిచేయడంతో ఇక్కడి పరిస్థితులు, ఆయా శాఖల పనితీరుపై కొంత పట్టుంది. డీఆర్‌డీఏ ద్వారా ఇతర శాఖలు, సంస్థల భాగస్వామ్యంతో అమలవుతున్న కార్యక్రమాలను మరింత పటిష్టం చేయడానికి పాటుపడతా. అంతిమంగా పేదరిక నిర్మూలనే ధ్యేయం. తద్వారా సంఘాలు ఆర్థిక పరిపుష్టి సాధిస్తాయని నా ధీమా
 డీఆర్‌డీఏ పీడీగా సుధాకర్ గతేడాది సెప్టెంబర్ 4న బాధ్యతలు
 స్వీకరించినప్పుడు ‘సాక్షి’తో అన్న మాటలు.
 
 సాక్షి, నల్లగొండ: గ్రామీణులు అభివృద్ధి పథంలో నడవడంలో డీఆర్‌డీఏది కీలక పాత్ర. కొందరు కిందిస్థాయి అధికారులు, సిబ్బంది ఇష్టారాజ్యంగా ప్రవర్తించడంతో గతంలో డీఆర్‌డీఏ పనితీరు గతి తప్పింది. తామే ఉన్నత స్థాయి అధికారులమని భావిస్తూ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు. మరోపక్క మహిళా సంఘాల కార్యకలాపాల్లో స్తబ్ధత నెలకొంది. నెలలపాటు గ్రామ సంఘాలు, మండల సమాఖ్యలు సమావేశమై సమస్యలపై చర్చించిన పాపాన పోలేదు. పూర్తిస్థాయిలో అధికారులు, సిబ్బంది ఉన్నా ఆ దిశగా అడుగు పడలేదు. ఇదంతా ఐదు నెలల క్రితం పరిస్థితి.. ప్రస్తుతం అధికారుల్లో జవాబుదారీతనం పెరిగింది.
 
 ఉద్యోగులు వారంలో అధిక రోజులు క్షేత్రస్థాయిలో తిరుగుతూ సంఘాల పని తీరును పర్యవేక్షిస్తున్నారు. వారి సమస్యలను నివృత్తి చేస్తున్నారు. మహిళల ఆర్థికాభివృద్ధికి సహకారం అందిస్తున్నారు. ఆయా అంశాలవారీగా చెప్పుకోదగ్గ ప్రగతి కనిపిస్తోంది. ఇదంతా ఇటీవల పీడీగా బాధ్యతలు చేపట్టిన సుధాకర్ పనితీరు. జిల్లాలో బాధ్యతలు స్వీకరించిన అనతికాలంలోనే శాఖ గాడిలో పడేలా పకడ్బందీ చర్యలు తీసుకున్నారు.
 
 అన్ని అంశాల్లోనూ మెరుగు
 జెండర్, బ్యాంకు లింకేజీ, పేదరిక నిర్మూలన తదితర అంశాల్లో మెరుగైన ఫలితాలు సాధిస్తున్నారు. బ్యాంకు లింకేజీలో 8, స్త్రీనిధి 13, పేదరిక నిర్మూలనలో 3, భూ సమస్యల పరిష్కారంలో 4వ స్థానంలో జిల్లా ఉంది. అన్ని అంశాల్లో తీసుకుంటే రాష్ట్రస్థాయిలో 9వ స్థానం దక్కించుకుంది. గతం లో ఎన్నడూ ఇంతటి మెరుగైన స్థానంలో జిల్లా నిలవలేదు.
 
 ఆకస్మిక తనిఖీలు....
 ఏ అధికారైనా కిందిస్థాయి అధికారులు, ఉద్యోగులకు సమాచారం అందించాకే క్షేత్ర స్థాయి పర్యటనకు వెళ్తున్నారు. కానీ డీఆర్‌డీఏ పీడీ అందుకు భిన్నం. తన పర్యటన గురించి ఎవ్వరికీ ముందస్తుగా తెలియజేయరు. అనుకున్నదే తడవుగా గ్రా మాల్లోకెళ్లి సంఘాల పనితీరు తెలుసుకుంటున్నారు. అధికారులు క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహిస్తున్నారా? లేదా అని తెలుసుకోవడానికి నేరుగా వెళ్తారు. ఈ పద్ధతి ద్వా రా కిందిస్థాయి ఉద్యోగుల్లో జవాబుదారీతనం పెరిగింది.
 
 నిత్య సమావేశాలతో మార్పు
 సమావేశాల ద్వారానే అన్ని కార్యక్రమాల అమలు తీరు, లోటుపాట్లు తెలిసే అవకాశం ఉంది. అంతేగాక అప్పులు, వసూలు, వడ్డీ చెల్లింపులు.. ఇలా అన్ని వ్యవహారాలు ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. సంస్థాగత నిర్మాణం (ఐబీ) దీనితోనే సాధ్యమవుతుంది. దీన్ని గట్టిగా నమ్మిన పీడీ సుధాకర్ క్రమం తప్పకుండా మహిళా సంఘాల నుంచి జిల్లా సమాఖ్య వరకు సమావేశాలు నిర్వహిస్తున్నారు.
 
  నెలలో రెండుసార్లు గ్రామాల్లో మహిళా సంఘాలను సమావేశ పరుస్తున్నారు. సీసీలు, వీబీకేలకు ఆ బాధ్యతలు అప్పగించారు. కచ్చితంగా సమావేశమై చర్చలు జరిపి సమస్యల్ని పరిష్కరించాల్సిన పనిని వారికి అప్పగించారు. మండల, జిల్లాస్థాయిలో 18 అంశాల డీపీఎం (జిల్లా ప్రాజెక్టు మేనేజర్లు), యాంకర్ పర్సన్స్ క్షేత్రస్థాయిలో పర్యటించేలా చేస్తున్నారు. జిల్లా కార్యాలయంలో పని ఉన్న రోజుల్లో తప్ప మిగిలిన వేళల్లో కచ్చితంగా ఫీల్డ్ విజిట్ జరిగేలా ఆదేశించారు. అంతేగాక ప్రతి డీపీఎంకు రెండు మండలాలు, ఒక గ్రామసంఘాన్ని (వీఓ) దత్తతగా ఇచ్చి కార్యక్రమాలను పర్యవే క్షిస్తున్నారు.
 
 వెనుకబడిన చందంపేట మండలంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఒక్కో గ్రామ పంచాయతీని ఒక్కో అధికారికి అప్పజెప్పి పథకాల అమలు తీరు తెలుసుకుంటున్నారు. ప్రభుత్వం వాహనాన్ని సమకూర్చిన అధికారికే ఈ బాధ్యతలు అప్పజెప్పారు. తద్వారా మారుమూల ప్రాంతంలో అవసరం ఉన్న ప్రతిసారీ సులువుగా వెళ్లేందుకు సౌలభ్యం లభించినట్లయింది. మహిళల ఆర్థిక ప్రగతికి గుండెకాయ అయిన ఐబీ మెరుగైన స్థానంలో నిలిచింది. గతంలో ఐబీలో రాష్ట్రవ్యాప్తంగా చివరి వరుసలో ఉండగా.. ప్రస్తుతం 8వ స్థానంలో నిలబడింది.

 

Advertisement
Advertisement