రైతన్నను కబళించిన కరువు | Sakshi
Sakshi News home page

రైతన్నను కబళించిన కరువు

Published Thu, Jan 15 2015 3:01 AM

రైతన్నను కబళించిన కరువు - Sakshi

సైదాపురం:  జిల్లాలో మూడేళ్లుగా నెలకొన్న కరువు రక్కసి రైతన్నలను కబళిస్తోంది. తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా వర్షాలు లేక పొలాలన్నీ బీడుగా మారాయి. సేద్యం తప్ప మరో పని తెలియని అన్నదాతలు ఏరోజుకారోజు వర్షం కురుస్తుందని ఆశగా ఎదురుచూస్తూ ఉన్నారు. భూగర్భ జలాలు సైతం అడుగంటిపోయాయి. చెరువులన్నీ చుక్కనీరు లేక ఒట్టిపోయాయి. బోర్ల కిందైనా పంటలు సాగు చేద్దామని సాహసం చేసిన రైతులు చివరికి తీవ్రంగా నష్టపోయారు.

ఆత్మహత్య చేస్తున్న చాగణం గ్రామానికి చెందిన  రైతు మోడిబోయిన కృష్ణయ్య అప్పులుజేసి రెండేళ్లలో తన మూడెకరాల పొలంలో 20 బోర్లు వేసినా గంగ జాడ కన్పించలేదు. ట్యాంక్‌లతో కూడా తాను సాగు చేసిన మిరప పొలానికి నీరు పెట్టారు.  రెండు రోజుల కిందట కూడా చివరి ప్రయత్నంగా మరో బోరు వేసినా ఫలితం లేకుండా పోయింది. విసిగిపోయిన కృష్ణయ్య చేసేది లేక మిన్నకుండిపోలేదు. బోర్లు వేసేందుకు చేసిన లక్షలాది రూపాయలు అప్పులు తీర్చే దారి లేక పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు.

భోగి పండగ రోజు కుటుంబసభ్యులందరినీ ఇంటికి పిలిచి అందరితో ఆనందంగా మాట్లాడారు. మిరపతోటకు వెళ్లి వస్తానని చెప్పి అక్కడే తనువు చాలించారు.  కృష్ణయ్యకు భార్య రాజమ్మ, ఇద్దరు కుమారులు, కుమారుడు ఉన్నారు. కుమార్తెలిద్దరికీ వివాహం చేశారు. అద్దె ఇంట్లోనే ఆయన కుటుంబం జీవిస్తుంది. పండగకు ఇద్దరు కుమార్తెలతో పాటు అల్లుళ్లను కూడా పిలుచుకున్నారు. కుమారుడు బెంగళూరులో చిన్న పనులు చేసుకుంటూ బతుకుతున్నారు.ఆయన కూడా పండగకి ఇంటికి చేరుకున్నారు.

కుటుంసభ్యులు, గ్రామస్తులంతా కృష్ణయ్య మృతదేహం వద్ద బోరున విలపించారు. తమకు దిక్కెవరయ్యా అంటూ భార్య రాజమ్మ విలపిస్తున్న తీరు చూపరులను కంటతడిపెట్టించింది.  బాడుగ ఇంట్లో కాపురం ఉండటంతో మృతదేహంను అక్కడ కాకుండా సొంత తమ్ముడి ఇంట్లో ఉంచాల్సి వచ్చింది. పండగ పూట ఆ కుటుంబంతోపాటు గ్రామంలో  తీవ్రమైన  విషాదఛాయలు అలముకున్నాయి.

Advertisement
Advertisement