రైవాడ, కోనాం రైతుల ఆగ్రహం | Sakshi
Sakshi News home page

రైవాడ, కోనాం రైతుల ఆగ్రహం

Published Tue, Jan 7 2014 1:04 AM

Raivada, konam angry farmers

  •  నీరు నిల్వ ఉండే పనులు చేపట్టాలని పట్టు
  •   జీవీఎంసీ బకాయి వసూలుకు డిమాండ్
  •  
    చోడవరం,న్యూస్‌లైన్ : నీరు నిల్వ ఉండేలా చర్యలు చేపట్టక సాగునీటికి ఇబ్బందులు పడుతున్నామని రైవాడ, కోనాం జలాశయాల ఆయకట్టు రైతులు ఇరిగేషన్ అధికారులపై ధ్వజమెత్తారు. రైతుల భాగస్వామ్యంతో ప్రణాళిక సమీక్ష, తయారీ అనే అంశంపై కోనాం గెస్ట్‌హౌస్‌లో ఇరిగేషన్ అధికారులు సోమవారం సమావేశం నిర్వహించారు. నీటి పన్ను విధిగా చెల్లించి, సాగునీటి పనులకు సహకరించాలని వాలంతరి ఇంజనీరింగ్ కన్సల్టెంట్ డీఈ   బెంజిమన్ కోరారు.

    నీటి పన్ను కట్టడానికి అభ్యంతరం లేదని, ముందుగా నీరు నిల్వ ఉండేం దుకు చెరువులు, కాలువలకు, స్లూయీస్, సర్ ప్లస్ పనులు చేపట్టాలని రైతులు డిమాండ్ చేశారు. పెద్ద రిజర్వార్లు పక్కనే ఉన్నా సాగునీటికి వర్షాలపై ఆధారపడాల్సి వస్తోందని వాపోయారు. రైవాడ నుంచి రోజుకి 50 క్యూసెక్కులు తాగునీటి అవసరాలకు తరలించుకుపోతున్న జీవీ ఎంసీ నుంచి కోట్లాది రూపాయల బకాయిలను ఎందుకు వసూలు చే యలేకపోతున్నారని అధికారులను నిలదీశారు. ముం దు ఆ సొమ్ము వసూలు చే శాక నీటి పన్ను చెల్లింపుపై చర్చిద్దామని కొందరు రైతులు అన్నారు.

    రైవాడ కుడి కాలువ లక్కవరం చానల్ పనులు పూర్తికాక ఎనిమిదేళ్లుగా సాగునీటికి అవస్థలు పడుతున్నామని నీటి సంఘం అధ్యక్షుడు మట్టారమణ తదితరులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై అధికారులు స్పందిస్తూ అన్ని అడ్డంకులు తొలగాయని, త్వరలో పనులు ప్రారంభిస్తామని చెప్పారు. కలిగొట్ల చానల్‌కు రూ.5 లక్షలు మంజూరైనా పనులు చేయకుండా నిధులు మురిగిపోయేలా చేశారంటూ అధికారులపై రైతులు ధ్వజమెత్తారు.

    ఈ నిధులతో తక్షణం పనులు చేపట్టాలని వారు కోరారు. బెంజిమన్ మాట్లాడుతూ నీటి వినియోగంపై ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని, ఏటా నీటిపన్ను చెల్లించాలని, రెవిన్యూ అధికారులతో త్వరలో సమావేశం ఏర్పాటు చేస్తామ చెప్పారు. సమావేశంలో కో ఆర్డినేటర్ శేషగిరిరావు, ఇరిగేషన్ డీఈ మాధవి, జెఈలు సత్యంనాయుడు, రామారావు, చిన్నారావు, విజయకుమార్ పాల్గొన్నారు.
     

Advertisement
Advertisement