‘దర్జా’గా దోపిడీ..! | Sakshi
Sakshi News home page

‘దర్జా’గా దోపిడీ..!

Published Mon, Dec 30 2013 6:44 AM

rajiv vidya mission in khammam

 ఖమ్మం, న్యూస్‌లైన్: అక్రమాల పుట్టగా పేరున్న జిల్లా రాజీవ్ విద్యా మిషన్‌లో పనిచేస్తున్న అధికారులు చివరకు విద్యార్థులకు సరఫరా చేసే ఏకరూప దుస్తుల కుట్టుకూలిలోనూ కక్కుర్తి పడుతున్నారు. పొరుగు జిల్లాలోని పలు స్టిచ్చింగ్ ఏజెన్సీలతో కమీషన్ మాట్లాడుకొని జిల్లాలోని దర్జీల పొట్ట కొట్టేం దుకు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ‘మీతో కుట్టిస్తే మాకు ఏం ఇస్తారు?’ అని బహిరంగంగానే బేరసారాలు చేసుకుంటున్నట్లు ప్రచారం. ఈ విషయం తెలుసుకున్న జిల్లాలోని పలువురు దర్జీలు, మహిళా గ్రూపుల నాయకులు అధికారులను నిలదీయగా, వారు దాటవేత ధోరణితో వ్యవహరిస్తున్నారు.
 
 ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల మధ్య ఆర్థిక అంతరాలు బహిర్గతమైతే అది చిన్నారుల మనసుపై ప్రభావం పడుతుందని, విద్యార్థులకు కనీస వసతులు కల్పిస్తేనే పాఠశాలకు సక్రమంగా వస్తారని ప్రభుత్వం బావించింది. ఇందుకోసం మధ్యాహ్న భోజనం సదుపాయం, ఉచిత పుస్తకాల పంపిణీతో పాటు సంవత్సరానికి రెండు జతల ఏకరూప దుస్తులు సరఫరా చేస్తోంది. ఒకటి నుంచి 8వ తరగతి చదివే విద్యార్థులకు ఏకరూప దుస్తులు సరఫరా చేస్తున్నారు. ఈ దుస్తుల పంపిణీలో ప్రతి ఏటా ఆలస్యం అవుతుందని భావించిన రాష్ట్ర రాజీవ్ విద్యామిషన్ అధికారులు.. వచ్చే విద్యా సంవత్సరానికి ముందుగానే మేల్కొన్నారు. పాఠశాలల ప్రారంభానికి ముందుగా నిర్వహించే బడిబాట కార్యక్రమంలోనే కొత్త దుస్తులు సరఫరా చేయాలని భావించిరు. ఇందుకోసం జిల్లాలో 1, 99, 915 మంది విద్యార్థులను గుర్తించి వారికి జతకు రూ.160 చొప్పున రెండు జతలకు రూ. 6.38 కోట్లు విడుదల చేయాలని నిర్ణయించారు. ఇందులో తొలి విడతగా రూ. 3.19 కోట్లు ఎస్‌ఎంసీల ద్వారా ఆప్కోకు పంపిం చారు. దీంతో గత నెలలో జిల్లా విద్యార్థులకు రెండు జతలకు కావాల్సిన వస్త్రాన్ని సరఫరా చేశారు. దాన్ని జిల్లా కేంద్రం నుండి ఎంఆర్‌సీలకు పంపిణీ చేశారు. ఈ వస్త్రాన్ని ఎస్‌ఎంసీల ద్వారా గ్రామాల్లోని దర్జీలకు అప్పగించి సకాలంలో కుట్టించి విద్యార్థులకు అందజేయాలి.
 
 కమీషన్లకు పలువురు అధికారుల కక్కుర్తి...
 యూనిఫాం క్లాత్ వచ్చిందని తెలుసుకున్న జిల్లాలోని పలు స్టిచ్చింగ్ సెంటర్లతో పాటు, ఇతర జిల్లాల్లోని పలువురు దర్జీలు జిల్లా అధికారులను సంప్రదించారు. దుస్తులు కుట్టేందుకు తమకు అవకాశం కల్పించాలని ఆర్జీలు పెట్టుకున్నారు. తమకు కుట్టే అవకాశం ఇస్తే కమీషన్ కూడా ఇస్తామని కొందరు అధికారులకు ఆశపెట్టినట్లు తెలిసింది. దీంతో కమీషన్లకు కక్కుర్తి పడిన పలువురు అధికారులు తాము పంపించిన ఏజెన్సీలకే అవకాశం ఇవ్వాలని ప్రధానోపాధ్యాయులను, ఎంఈవోలను ఆదేశించినట్లు తెలిసింది. ఇందుకు పలువురు అధికారులు ససేమిరా అనడంతో ‘ఇది జిల్లాలోని ఓ ఉన్నతాధికారి ఆదేశమని.. పాటించకపోతే మీ ఇష్టం’ అని బెదిరించినట్లు తెలిసింది. దీంతో తప్పని పరిస్థితిలో జిల్లా అధికారులు ఇవ్వమన్న ఏజెన్సీలకు ఇచ్చేందుకు హెచ్‌ఎంలు సిద్ధమయ్యారు. విషయం తెలుసుకున్న జిల్లాలోని పలువురు దర్జీలు ఎంఈవోల వద్దకు వెళ్లి తమకే ఇవ్వాలని మొరపెట్టుకున్నా.. తమ పరిధిలో ఏమీలేదని, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే కెటాయిస్తామని తేల్చి చెప్పారు. ఈ విషయంపై గిరిజన ప్రాంతాల్లో ఉన్న తమకే యూనిఫాం  కుట్టే అవకాశం ఇవ్వాలని ఇటీవల భద్రాచలంలో జరిగిన అధికారుల సమావేశంలో పలువురు మహిళలు ఐటీడీఏ పీవోకు ఫిర్యాదు చేశారు. తమకు ఇవ్వకుండా ఇతర జిల్లాలకు చెందిన ఏజెన్సీలకు ఏలా ఇస్తారని వారు ప్రశ్నించారు. దీనిపై స్పందించిన పీవో జిల్లా ఆర్వీఎం అధికారులను మందలించినట్లు తెలిసింది.
 
 జిల్లా దర్జీలకే అవకాశం కల్పించాలి...
 రెడీమెడ్ దుస్తుల రాకతో జిల్లాలోని దర్జీలు పనులు లేక దుర్భర జీవితాలను గడుపుతున్నారు. ప్రభుత్వం ఆర్థిక తోడ్పాటు అందించి ఆదుకోవాలని, ప్రభుత్వ పరంగా వచ్చే దుస్తులను జిల్లాలోని దర్జీలకే అవకాశం కల్పించాలని  టైలర్స్ యూనియర్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పులి కృష్ణ, జిల్లా అధ్యక్షుడు జానీ అధికారులను కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో సరఫరా చేసే దుస్తులు ఇతర జిల్లాలకు చెందిన టైలర్లకు ఇవ్వాలనే ఆలోన విరమించుకోవాలని తెలంగాణ లేడీస్ టైలర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలు నహీమున్నీసా భేగం, కార్యదర్శి ఎండీ గౌస్‌ద్దీన్ డిమాండ్ చేశారు. ఇతర జిల్లాల దర్జీలకు అవకాశం కల్పిస్తే ఆందోళన చేస్తామని, ఆర్వీఎం కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement