కిరణ్ సర్కారు నిర్వాకమే | Sakshi
Sakshi News home page

కిరణ్ సర్కారు నిర్వాకమే

Published Tue, Mar 11 2014 1:11 AM

కిరణ్ సర్కారు నిర్వాకమే - Sakshi

  • స్థానిక ఎన్నికల గందరగోళంపై రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్
  •   మునిసిపల్, పంచాయతీరాజ్ రిజర్వేషన్ల ఖరారుపై ఎన్నిసార్లు కోరినా స్పందించలేదు
  •   స్థానిక ఎన్నికలు నిర్వహించకపోవటం రాజ్యాంగ విరుద్ధమని చెప్పినా పట్టించుకోలేదు
  •   రిజర్వేషన్ల ఖరారు బాధ్యతను రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు అప్పగించాలన్నా వినలేదు
  •   లోక్‌సభ, శాసనసభల ఎన్నికలు ఉన్నా కోర్టు ఆదేశాలతో స్థానిక ఎన్నికలు నిర్వహిస్తున్నాం
  •   ఈ ఎన్నికలను కానీ, ఎన్నికల ఫలితాలను కానీ.. కోర్టులు ఆదేశిస్తే తప్ప వాయిదా వేయం
  •  సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం శాసనసభ, లోక్‌సభ ఎన్నికల సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సి రావటం.. తద్వారా రాజకీయ పార్టీలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొనే పరిస్థితులు నెలకొనటానికి కారణం గత ప్రభుత్వ తప్పిదమేనని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రమాకాంత్‌రెడ్డి తీవ్రంగా తప్పుపట్టారు. 
     
    ఈ గందరగోళ ఎన్నికలకు పూర్తి బాధ్యత గత (మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలోని) ప్రభుత్వానిదేనని ధ్వజమెత్తారు. రమాకాంత్‌రెడ్డి సోమవారం రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో కార్యదర్శి నవీన్‌మిట్టల్‌తో కలసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత ప్రభుత్వం బాధ్యతాయుతంగా నిర్ణయం తీసుకుని ఉంటే ప్రస్తుతం ఈ గందరగోళంలో ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి వచ్చేది కాదన్నారు. స్థానిక సంస్థలైన మునిసిపల్, పంచాయతీరాజ్ స్థానాల రిజర్వేషన్లు ఖరారు చేయాలని ఎన్నిమార్లు చెప్పినా ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని ఆయన  దుయ్యబట్టారు. కనీసం సమాధానం కూడా ఇవ్వలేదని ఆక్షేపించారు.
     
    స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించకపోవడం రాజ్యాంగ విరుద్ధమని, కోర్టుల నుంచి ఇబ్బందులు ఎదురవుతాయని పంచాయతీరాజ్, పురపాలక శాఖ కార్యదర్శులకు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు వివరించినా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వంలో ఉన్నతస్థానాల్లో ఉన్నవారితో కూడా ఈ అంశంపై చర్చించినా లాభం లేకపోయిందన్నారు. హైకోర్టు, సుప్రీంకోర్టుల ఆదేశాల నేపథ్యంలో.. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఉన్నా.. ఈ ఎన్నికల కోసం ప్రభుత్వం హడావుడిగా రిజర్వేషన్లను రూపొందించి తన బాధ్యతను దించుకుందని వ్యాఖ్యానించారు. 
     ఆ బాధ్యత మాకు అప్పగించాలన్నా పట్టించుకోలేదు
     రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లు ప్రకటిస్తే తప్ప తాము ఎన్నికలు నిర్వహించడానికి వీల్లేని పరిస్థితుల వల్లే.. నిర్ణీత వ్యవధిలో ఎన్నికలు నిర్వహించలేకపోతున్నామని అన్నారు. కేంద్ర ఎన్నికల సంఘానికి ఆ ఇబ్బంది ఉండదన్నారు. కేంద్రంలో 30 సంవత్సరాలకు ఓసారి ఒక కమిటీ వేసి రిజర్వేషన్లు ఖరారు చేస్తారని, అందువల్ల ఎన్నికల ప్రక్రియను వారు సకాలంలో పూర్తి చేయగలుగుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల సీట్ల రిజర్వేషన్లను ఖరారు చేసే బాధ్యతను రాష్ట్ర ఎన్నికల సంఘానికి అప్పగించాలని రెండేళ్ల కిందట తాము రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసినా పట్టించుకోలేదని రమాకాంత్‌రెడ్డి విమర్శించారు. 
     
     ‘వాయిదా’పై సీఈసీ చెప్పినా వినం...
     
     స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించినా.. ఫలితాలు వాయిదా వేసేలా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కొన్ని రాజకీయ పార్టీలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరినట్లు తమ దృష్టికి వచ్చిం దని కమిషనర్ తెలిపారు. ఈ రెండు సంస్థలు రాజ్యాంగబద్ధంగా ఏర్పడ్డవేనని పేర్కొన్నారు. ఫలితాలు వాయిదా వేయాలని తమను కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించజాలదని, ఒకవేళ ఆదేశించినా తాము పట్టించుకునే సమస్య లేదని స్పష్టంచేశారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఆదేశించినా పట్టించుకోబోమన్నారు. హైకోర్టు, సుప్రీంకోర్టు ఆదేశాలకు లోబడి మాత్రమే తాము పనిచేస్తామని పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాలు ఎట్టిపరిస్థితుల్లోనూ ఆపబోమని తెలిపారు. ఒకసారి ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేశాక కోర్టులు కూడా ఎన్నికలు ఆపాలని ఆదేశాలు ఇవ్వలేవని.. ఒకవేళ అలా ఆదేశాలు ఇస్తే వాటిని పాటిస్తామని చెప్పారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement