రూ.3.21 కోట్లు రమేషార్పణం! | Sakshi
Sakshi News home page

రూ.3.21 కోట్లు రమేషార్పణం!

Published Sun, Jan 19 2014 2:45 AM

Ramesarpanam Rs .3.21 crore!

సాక్షి ప్రతినిధి, అనంతపురం : హంద్రీ-నీవా సుజల స్రవంతి పథకం 33వ ప్యాకేజీ (ప్రధాన కాలువ 176 నుంచి 192 కిలోమీటర్ల వరకు తవ్వకం, 20,900 ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించేందుకు వీలుగా నీటిసరఫరా వ్యవస్థను అభివృద్ధి చేయడం) పనుల్లో ప్రభుత్వ పెద్దలు అక్రమార్కులకు బహిరంగంగా మద్దతు పలుకుతున్నారు.
 
 అక్రమాలు నిర్ధారణ అయ్యాక సదరు కాంట్రాక్టరు నుంచి సొమ్ము రికవరీ చేయకుండానే నలుగురు ఇంజినీర్లపై సస్పెన్షన్ ఎత్తివేస్తూ శనివారం ఆదేశాలు జారీ చేశారు. వివరాల్లోకి వెళితే.. నీటిపారుదల శాఖ అధికారులు, కాంట్రాక్టర్ కుమ్మక్కయ్యి 33వ ప్యాకేజీలో చేయని పనిని చేసినట్లు చూపి రూ.3.21 కోట్లు దోచుకున్న వ్యవహారాన్ని 2011 మార్చి 3న ‘సాక్షి’ బట్టబయలు చేసింది.
 
 ఈ కథనంపై స్పందించిన ప్రభుత్వం అప్పట్లో సీఈ(క్వాలిటీ కంట్రోల్) ప్రభాకర్‌ను విచారణకు ఆదేశించింది. పనులను తనిఖీ చేసిన ఆయన ‘సాక్షి’ కథనం నిజమేనంటూ ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ఆ పనులను పర్యవేక్షించిన ఈఈలు పి.క్రిష్ణయ్య, వి.రాఘవరాం(వీరిద్దరూ రిటైర్ అయ్యారు), డీఈలు ఎ.నారాయణశెట్టి, జి.విజయభాస్కరరావు, ఏఈఈ లక్ష్మీనరసింహులు, ఏఈఈ ఎమ్వీ మహేశ్వరరెడ్డి, ఏఈఈ గణేనాయక్‌ను బాధ్యులుగా పేర్కొన్నారు. ఆ నివేదికపై అప్పటి నీటి పారుదల శాఖ కార్యదర్శి శైలేంద్రకుమార్ జోషి తీవ్రంగా స్పందిస్తూ.. ఆ ఏడుగురిపై సస్పెన్షన్ వేటు వేస్తూ 2011 అక్టోబరు 17న ఉత్తర్వులు(జీవో ఎంఎస్ నెం: 1060)ను జారీ చేశారు. నిధుల రికవరీ ఊసెత్తకుండానే 27 నెలల తర్వాత డీఈలు ఏవీ నారాయణశెట్టి, జి.విజయభాస్కర్‌రావు, ఏఈలు ఎస్.గణేనాయక్, ఇ.లక్ష్మి నరసింహులుపై సస్పెన్షన్ ఎత్తివేస్తూ శనివారం నీటిపారుదల శాఖ కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్ ఉత్తర్వులు (జీవో ఎంఎస్ నెం: 40) జారీ చేశారు.
 
 అప్పట్లో ఏం జరిగిందంటే..
 ఈ పనులను రూ.58.32 కోట్లకు చేజిక్కించుకున్న ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్(ఐ) అనే సంస్థ.. పది శాతం కమిషన్‌పై టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌కు సబ్ కాంట్రాక్టు ఇచ్చింది. ఆయన ఇదే పనిని ఎనిమిది శాతం కమిషన్ దండుకుని వైఎస్సార్ జిల్లాకు చెందిన శేషయ్యనాయుడుకు సబ్ కాంట్రాక్టు ఇచ్చారు. ఆయన 44.56 కోట్ల విలువైన పనులు పూర్తి చేశామని చెబితే.. వాస్తవానికి 41.35 కోట్ల పనులు మాత్రమే పూర్తయ్యాయి. విచారణలో ఈ విషయం నిగ్గు తేలింది. దిగమింగిన రూ.3.21 కోట్లను తక్షణమే చెల్లించాలని  సబ్ కాంట్రాక్టర్ శేషయ్యనాయుడుకు అప్పట్లో ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. ఈ పనుల్లో బిల్లు మొత్తం సీఎం రమేష్ తీసుకున్నారని, తనకు రావాల్సిన మొత్తం కూడా రాలేదని ఆయన మీడియాతో వాపోయారు. ప్రభుత్వానికీ ఇదే విషయం చెప్పారు.
 
 ప్రభుత్వం ఎందుకు వెనకడుగు వేసిందంటే..
 విపక్షానికి చెందిన ఓ ఎమ్మెల్యే చక్రం తిప్పడం వల్ల సబ్ కాంట్రాక్టర్ సీఎం రమేష్‌పై గానీ.. ప్రధాన కాంట్రాక్టర్ అయిన ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్(ఐ)పైగానీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. = ఈ ఎమ్మెల్యేకు 2009 ఎన్నికల్లో సీఎం రమేష్ భారీ ఎత్తున ధన సహాయం చేసినట్లు సమాచారం.
 
 దీంతో ఆ ఎమ్మెల్యే ఈ కాంట్రాక్టర్‌కు దన్నుగా నిలిచారు. = జిల్లాకు చెందిన ఓ కీలక మంత్రితో ఈ ఎమ్మెల్యే తెరవెనుక మంతనాలు నడిపి రూ.3.21 కోట్లను రికవరీ చేయడంపై ఉత్తర్వులు జారీ కాకుండా చేయగలిగారు. ఆ మంత్రి ఏకంగా సీఎంపై ఒత్తిడి తేవడంతో ప్రభుత్వం ప్రధాన కాంట్రాక్టర్‌కు నోటీసులు కూడా జారీ చేయలేదని హంద్రీ-నీవా అధికార వర్గాలు గుసగుసలుపోతున్నాయి.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement