రంగవల్లుల్లో శాస్త్రీయత: విజయ్‌కాంత్ | Sakshi
Sakshi News home page

రంగవల్లుల్లో శాస్త్రీయత: విజయ్‌కాంత్

Published Sun, Jan 12 2014 3:01 AM

rangoli competition : vijaykanth

మహబూబ్‌నగర్ కల్చరల్, న్యూస్‌లైన్: మన పూర్వీకులు చేపట్టిన ప్రతి అంశంలో ఓ అర్థం, పరమార్థం దాగి ఉందని, రంగవల్లులు తీర్చిదిద్దడంలో కూడా శాస్త్రీయ పరిజ్ఞానం ఇమిడి ఉందని నేహషైన్ హాస్పిటల్ అధినేత డాక్టర్ విజయకాంత్ పేర్కొన్నారు. ‘సాక్షి’, నేహషైన్ హాస్పిటల్ ఆధ్వర్యంలో శనివారం స్థానిక జిల్లా కేంద్రంలో నిర్వహించిన ముగ్గుల పోటీలకు విశేష స్పందన లభించింది.

ఈ పోటీల్లో వయోబేధం లేకుండా మహిళలు, విద్యార్థినులతో పాటు ఓ మైనార్టీ మహిళ, పురుషుడు కూడా పాల్గొని, రంగవల్లులను తీర్చిదిద్దారు. వివిధ ఆకృతులు, పలు ఆకర్షణీయ రంగులతో రకరకాల ధాన్యాలు, కలశాలు, గొబ్బెమ్మలను అలంకరించారు. దేశభక్తి, సామాజిక అంశాలను జోడించిన సందేశాలను ముగ్గులతో పాటు ప్రదర్శించి జాతి సమైక్యత, ప్రజాహిత కార్యక్రమాలపై వారికున్న మమకారాన్ని చాటుకున్నారు.

96 మంది పాల్గొన్న ఈ పోటీ జిల్లా పరిషత్ మైదానానికి సంక్రాంతి శోభను చేకూర్చాయి. కార్యక్రమంలో విశిష్ట అతిథిగా పాల్గొన్న  డాక్టర్ విజయ్‌కాంత్ మాట్లాడుతూ ముగ్గుల్లో గణితం, సైన్స్, భౌగోళిక అనుసంధానం, దేశసంస్కృతి, సంప్రదాయాలు ఉన్నాయన్నారు. కుడి, ఎడమల సమాన దూరాన్ని, ప్రాముఖ్యతను పాటించే ముగ్గులు సమానత్వాన్ని సూచిస్తాయని, పసుపు, కుంకుమ ఆధ్యాత్మికతను వెల్లడిస్తాయన్నారు. సు న్నం, క్రిమికీటకాలను ఇళ్లలోకి రాకుండా కాపాడి ఆరోగ్యాన్ని పదిలపరుస్తాయని చెప్పారు.
 
 అన్ని రంగులతో తీర్చిదిద్దిన ముగ్గులు మానసిక ప్రశాంతతను చేకూరుస్తాయని వివరించారు. జేపీఎన్ విద్యాసంస్థల అధిపతి కేఎస్ రవికుమార్ మాట్లాడుతూ ముగ్గుల పోటీలు క్రమశిక్షణను, పోటీతత్వాన్ని పెంచుతాయన్నారు. సాక్షి యాజమాన్యం సంక్రాంతి సంబరాలను ముగ్గుల పోటీ రూపంలో చేపట్టడం అభినందనీయం ప్రశంసించారు. కలెక్టర్ సతీమణి అన్నపూర్ణ మాట్లాడుతూ ముగ్గులు, సంక్రాంతి పండుగ విశిష్టతను వివరించారు. ‘సాక్షి’ యూనిట్ ఎడిషన్ ఇన్‌చార్టి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తొలికిరణంతో పాటు తలుపులు తట్టే సాక్షి పత్రిక వార్తలనే కాకుండా సామాజిక అంశాలను సృజిస్తుందన్నారు. ‘సాక్షి’ని పాఠకులు తమ కుటుంబ సభ్యురాలిగా భావిస్తున్నారని అన్నారు.
 
 అనంతరం విజేతలతోపాటు పోటీల్లో పాల్గొన్న వారందరికీ బహుమతులను అందజేశారు. అంతకుముందు ‘జగతి సిగలో జాబిలమ్మకు వందనం’ అంటూ నిహారిక, కొండల్లో నెలకొన్న కోనేటి రాయుడు అంటు అనూష చేసిన నృత్యాలు, చంద్రముఖి కల్చరల్ అకాడమీ డెరైక్టర్ చంద్రశేఖర్, వాసవీ క్లబ్ ప్రతినిధి శ్రీనివాసులు చేసిన వ్యాఖ్యానాలు అలరించాయి. న్యాయనిర్ణేతలుగా కవిత, రాగసుధ, మంజులత వ్యవహరించారు. డీఆర్‌ఓ సతీమణి రాణి, సాక్షి బ్రాంచ్ మేనేజర్ తిరుపతిరెడ్డి, బ్యూరో ఇన్‌చార్జి రాజగోపాల్, సాక్షి టీవీ కరస్పాండెంట్ సుభాష్‌చంద్రబోస్, యాడ్స్, సర్క్యూలేషన్ మేనేజర్లు వెంకటేశ్, రవిశంకర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
 
 విజేతలు వీరే...
 ముగ్గుల పోటీల్లో ప్రథమ బహుమతి ఎన్.శ్రీలక్ష్మి(మహబూబ్‌నగర్), ద్వితీయ బహుమతి ఎస్.కరుణ(నారాయణపేట), తృతీ య బహుమతి కవిత(కొత్తకోట), ప్రోత్సాహక బహుమతులు  జి.రమాదేవి(వనపర్తి), శుభాంగి, జ్యోత్స్న, సీహెచ్ నందిని (మహబూబ్‌నగర్), స్వప్న(షాద్‌నగర్) ఎంపికయ్యారు. పోటీల్లో పాల్గొన్న వారందరికీ ప్రత్యేక బహుమతులు అందజేశారు.  
 

Advertisement
Advertisement