పేదల బియ్యం బొక్కేస్తున్నారు..! | Sakshi
Sakshi News home page

పేదల బియ్యం బొక్కేస్తున్నారు..!

Published Mon, May 18 2015 2:13 AM

Ration irregularities

డీలర్లకు శఠగోపం పెడుతున్న ఎమ్మెల్‌ఎస్ పాయింట్ అధికారులు
ఒక్కో బస్తాకు కేజీ చొప్పున బియ్యం మాయం
నరసరావుపేట డివిజన్‌లోనే తూకం తేడాలు అధికం
గతంలో అమ్మహస్తం పథకంలోనూ ఇదే తీరు
మిల్లర్లతో కుమ్మక్కవుతున్న అధికారులు

 
 సాక్షి, గుంటూరు :  చౌకధరల దుకాణాల ద్వారా పేదలకు అందాల్సిన బియ్యాన్ని గోడౌన్‌లలోనే కొందరు అధికారులు బొక్కేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్‌ఎస్ పాయింట్‌ల ద్వారా రేషన్ దుకాణాలకు చేరేలోపు బస్తాల్లో బియ్యం మాయమౌతున్నాయి. బస్తాలో బియ్యం ఎలా మాయమౌతున్నాయి.. ఎలుకలు, పందికొక్కులు ఏమైనా బొక్కేస్తున్నాయేమో అని అనుకుంటున్నారా.. అదేమీ కాదు కొందరు అవినీతి అధికారులు ధనార్జనే ధ్యేయంగా రేషన్ డీలర్‌కు సరఫరా చేసే బియ్యాన్ని బస్తాకు కేజీ చొప్పున నొక్కేస్తూ నెలనెలా రెండు లారీల బియ్యాన్ని మిగులుస్తున్నారు.

ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక్కో బస్తా గోతంతో కలిపి 50.665 కేజీలు ఉండాల్సి ఉండగా, ఎమ్మెల్‌ఎస్ పాయింట్ నుంచి రేషన్ డీలర్‌కు చేరే సరికి దీని బరువు 49.500 కేజీలు మాత్రమే ఉంటుంది. ఒక్కోసారి రెండు కేజీల వరకూ తగ్గుతుంది. ఇటీవల కొందరు డీలర్‌లు 48 కేజీలు వచ్చిన బస్తాలను గుర్తించి రిటన్ కూడా పంపారు. అంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్ధమౌతుంది. మిగిల్చిన బియ్యాన్ని బ్లాక్ మార్కెట్‌కు, మిల్లర్లకు చేరవేస్తూ లక్షలు గడిస్తున్నారు. జిల్లాలో అక్కడక్కడా ఉండే ఈ జాఢ్యం రానురానూ అనేక ప్రాంతాల్లోని ఎమ్మెల్‌ఎస్ పాయింట్లకు పాకింది. ముఖ్యంగా నరసరావుపేట డివిజన్‌లోని అనేక చోట్ల ఈ తరహా దోపిడీ జరుగుతూనే ఉంది.

రేషన్ దుకాణాలకు బియ్యం బస్తాలు రాగానే వాటిని వెంటనే దిగుమతి చేసుకోవడం మినహా వారు కాటాలు వేసుకోకపోవడం అవినీతి అధికారులకు వరంగా మారింది. కొందరు రేషన్ డీలర్‌లు ఈ మోసాన్ని గుర్తించి ప్రశ్నిస్తే వారికి సరుకులు సక్రమంగా అందించకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారనే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. గతంలో నరసరావుపేట ఎమ్మెల్‌ఎస్ పాయింట్‌లో అమ్మహస్తం పథకం సరుకుల తూకాల్లో తేడాలు ఉన్నట్లు ఉన్నతాధికారులు గుర్తించిన విషయం తెలిసిందే. ఇక్కడ అదే పరిస్థితి మళ్లీ తిరిగి కొనసాగుతుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

 మిల్లర్లతో కుమ్మక్కవుతున్న అధికారులు..
 కొందరు అధికారులు మిల్లర్లతో కుమ్మక్కై తూకంలో మిగిల్చిన బియ్యాన్ని అక్కడకు తరలిస్తూ వారితో లాలూచీ పడుతున్నారు. మిల్లర్లు ఇదే బియ్యాన్ని వేరే గోతాల్లోకి మార్చి తిరిగి పౌరసరఫరాలశాఖకు చేరుస్తున్నారు. ఈ విధంగా అధికారులు, మిల్లర్లు కూడబలుక్కుని అదే బియ్యాన్ని రీసైక్లింగ్ చేస్తున్నారు. ఐదు నెలల క్రితం పల్నాడు ప్రాంతంలోని ఓ ఎమ్మెల్‌ఎస్ పాయింట్ డీటీ సంతకం చేయాలంటే డబ్బు డిమాండ్ చేస్తున్నాడంటూ ఏసీబీని ఆశ్రయించి పట్టించారు.

రేషన్ డీలర్లకు వ్యవహారం తెలిసినప్పటికీ కొన్ని చోట్ల ఎమ్మెల్‌ఎస్ పాయింట్ల నుంచే బ్లాక్ మార్కెట్‌కు బియ్యాన్ని తరలించేందుకు ఒప్పుకోరేమోననే భయంతో వారుకూడా మిన్నకుంటున్నారు. అధికారుల అండదండలు ఉండటంతో మిల్లర్లు సైతం నూకలు అధికంగా కలుపుతూ నాణ్యలేని బియ్యాన్ని ఇస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారాన్నంతా గమనిస్తే చివరకు నష్టపోతుంది మాత్రం పేద ప్రజలే అనే విషయం స్పష్టమౌతుంది. ఇప్పటికైనా విజిలెన్స్, పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులు స్పందించి తూకాల్లో జరుగుతున్న మోసాలు, మిల్లర్లతో అధికారుల కుమ్మక్కు వ్యవహారాలను బట్టబయలు చేయాలని పలువురు కోరుతున్నారు.

Advertisement
Advertisement