పేదల బియ్యం పెద్దల భోజ్యం | Sakshi
Sakshi News home page

పేదల బియ్యం పెద్దల భోజ్యం

Published Sun, Dec 15 2013 3:58 AM

పేదల బియ్యం పెద్దల భోజ్యం - Sakshi

సాక్షి, గుంటూరు :కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో రేషన్ బియ్యం అధిక మొత్తంలో దారి మళ్లుతోంది. మండల్ లెవల్ స్టాక్ పాయింట్ల నుంచి కోటా బియ్యం సరఫరా కాగానే పలువురు డీలర్లు దొడ్డిదారిన విక్రయించదలచిన సరుకును వేరు చేస్తున్నారు. కార్డుదారుల్లో 20 నుంచి 30 శాతం మంది కిలో రూపాయి బియ్యం తీసుకోరు. వీరికి కేటాయించిన బియ్యంతో పాటు మరికొన్ని క్వింటాళ్ల బియ్యాన్ని జత కలిపి లారీలకు ఎక్కిస్తున్నారు. బాగా పరిచయస్తులైన రైసు మిల్లుల యజమానులతో ముందే మాట్లాడుకుని వ్యూహాత్మకంగా బియ్యాన్ని రవాణా చేస్తున్నారు. మిల్లులకు చేరిన బియ్యాన్ని ఆయా మిల్లుల యజమానులు బాగా పాలిష్ పట్టించి బహిరంగ మార్కెట్లో అధిక ధరకు విక్రయించుకుంటున్నారు. 
 
 గడచిన రెండు నెలలుగా ఈ మూడు జిల్లాల్లోనూ రేషన్ బియ్యం అక్రమ రవాణా, ఆపైన విక్రయాలు బాగా పెరిగాయి. ఎప్పటికప్పుడు దీన్ని నియంత్రించాల్సిన పౌర సరఫరాల శాఖ అధికారులు కొందరు డీలర్లు ముట్టజెప్పే నెలసరి మామూళ్లు, నజరానాలకు కక్కుర్తిపడి పేదల బియ్యంపై నిర్లక్ష్యాన్ని కనబరుస్తున్నారు. దీంతో పేదలకు పంచాల్సిన బియ్యాన్ని కొందరు డీలర్లు, వ్యాపారులతో కలిసి కిలో రూ. 8 నుంచి రూ.10 చొప్పున మిల్లులకు విక్రయిస్తున్నారు. పాలిష్ వేయించిన ఈ బియ్యాన్ని మిల్లర్లు తిరిగి జనానికే కిలో రూ.16 చొప్పున విక్రయిస్తున్నారు. గుంటూరు, ప్రకాశం, తూర్పుగోదావరి జిల్లా మండపేట, రాజోలు, పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం, తణుకు పట్టణాల్లోని మిల్లుల యజమానులు అధికంగా ఈ తరహా బియ్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. 
 
 8 నెలల్లో 6342 క్వింటాళ్ల రవాణా..
 గుంటూరు జిల్లాలోనే రేషన్ బియ్యం పెద్ద మొత్తంలో బ్లాక్‌మార్కెట్‌కు చేరుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదలైన ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి నవంబరు నెలాఖరు వరకు జిల్లాలో అక్రమంగా రవాణా అవుతున్న 6342 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు పట్టుకున్నారు.  వీటి విలువ రూ.1.30 కోట్లు. 61 మందిపై క్రిమినల్ కేసులు పెట్టారు. మరో 161 మందిపై నిత్యావసర వస్తువుల ఉల్లంఘన చట్టం కింద 6ఏ కేసులు నమోదు చేశారు. మరో 83 వాహనాలను సీజ్ చేశారు. ఇంకా అధికారుల కళ్లుగప్పి అక్రమంగా సరిహద్దులు దాటించిన బియ్యం మరో 500 క్వింటాళ్లు ఉండొచ్చని అధికారుల అంచనా. నవంబరు నెలలోనే జిల్లా విజిలెన్సు అధికారులు రూ. 33 లక్షల విలువైన 1683 క్వింటాళ్ల బియాన్ని సీజ్ చేశారు. గుంటూరు ఆటోనగర్, చిలకలూరిపేట, చల్లగుండ్ల, గామాలపాడు, చమళ్లమూడి, వినుకొండ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అక్రమంగా రవాణా అవుతున్న పేదల బియ్యాన్ని విజిలెన్సు అధికారులు వ్యూహాత్మకంగా పట్టుకున్నారు. అదేవిధంగా ప్రకాశం,కృష్ణా జిల్లాల్లోనూ  పెద్ద ఎత్తున రేషన్ బియ్యం దారి మళ్లింది.
 

Advertisement
Advertisement