పార్టీ కోసం పనిచేయని ఎస్ఐ ఇక్కడ ఎందుకు? | Sakshi
Sakshi News home page

పార్టీ కోసం పనిచేయని ఎస్ఐ ఇక్కడ ఎందుకు?

Published Tue, Jul 15 2014 4:51 PM

పార్టీ కోసం పనిచేయని ఎస్ఐ ఇక్కడ ఎందుకు? - Sakshi

 వట్టిచెరుకూరు: ‘నీ ప్రవర్తన మార్చుకోవాలి. లేకుంటే సస్పెండ్ చేస్తాం... లేదంటే ఇక్కడి నుంచి మెడికల్ లీవ్‌లో వెళ్లిపో...’ అంటూ రాష్ట్ర మంత్రి రావెల కిశోర్‌బాబు ఎస్‌ఐపై ఆగ్రహంతో ఊగిపోయారు. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండల పరిధిలో సోమవారం పలు అభివృధ్ధి కార్యక్రమాలకు శంకుస్దాపన చేసేందుకు వచ్చిన ఆయన అధికారులతో మండల కేంద్రంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో మండల పరిధిలోని పలు సమస్యలపై ప్రజలు ఆర్జీలు అందజేశారు. దీనిపై అధికారులను వివరణ కోరిన మంత్రి టీడీపీ కార్యకర్తల పనులు శరవేగంతో చేయాలని హకుం జారీచేశారు.

ఈ సందర్భంగా కొందరు టీడీపీ కార్యకర్తలు వట్టిచెరుకూరు ఎస్ఐ ప్రసాద్‌రెడ్డిపై ఫిర్యాదు చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా వ్యవహరిస్తున్నారని, టీడీపీ నేతల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు చేశారు. దీంతో మంత్రికి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ‘నీ ప్రవర్తన మార్చుకో... లేకపోతే ఇబ్బందులు తప్పవు. లేని పక్షంలో మెడికల్ లీవు పెట్టి వెళ్లిపో... నీ స్ధానంలో మాకు కావాల్సిన వారిని ఎస్సైగా తెచ్చుకుంటాం’ అని బహిరంగానే బెదిరించారు. అంతటితో ఆగకుండా నేరుగా పోలీసు ఉన్నతాధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. మా పార్టీకి పని చేయని వాడిని ఇక్కడ ఎలా ఉంచారని ప్రశ్నించారు. డీఎస్పీ తక్షణమే ఇక్కడ ఉండాలని ఆదేశించారు. ఆయన అక్కడకు చేరుకోగానే ఎస్ఐని సస్పెండ్ అయినా చేయండి... లేకపోతే సిక్‌లీవ్‌లో వెళ్ళిపోమ్మనండి అంటూ ఆగ్రహాం వ్యక్తం చేశారు. సార్ మీడియా కవరేజ్ ఉందంటూ సదరు అధికారి సూచించినప్పటికీ ‘ఆ.. మీడియా ఏమి చేస్తారులే’ అని మంత్రి వ్యాఖ్యానించారు.

Advertisement
Advertisement