కాంగ్రెస్‌లో ‘రాయల’ దడ | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌లో ‘రాయల’ దడ

Published Thu, Dec 5 2013 5:29 AM

Rayala-Telangana proposal scared T congress leaders

 సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: రాయల తెలంగాణ ప్రతిపాదనలు అధికార పార్టీ నేతలను ఠారెత్తిస్తున్నాయి. రాష్ట్ర, జాతీయ స్థాయిలో కీలకంగా వ్యవహరించటంతోపాటు, తెలంగాణ ప్రకటన చేయించటంలో ప్రముఖ పాత్ర పోషించామని చెప్పుకుంటున్న జిల్లా కాంగ్రెస్ నేతలకు ప్రస్తుత పరిణామాలు మింగుడు పడడం లేదు. మరొక పక్క రాయల తెలంగాణ ప్రమాదాన్ని నివారించాల్సిన బాధ్యత తెలంగాణ కాంగ్రెస్ నేతలదేనని రాజకీయ జేఏసీ హెచ్చరించడం వారిని మరింత ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ మాట్లాడుతున్న తీరు కూడా ఇక్కడి నేతలను తీవ్ర అయోమయానికి గురి చేస్తోంది. తెలంగాణ బిల్లు అసెంబ్లీ నుంచి తిరి గి వచ్చిన తర్వాతే రాయల తెలంగాణపై స్పం దిస్తానని, ఈ ప్రతిపాదనను తోసిపుచ్చలేనననడం గందరగోళానికి దారి తీస్తోంది.
 
 గుణపాఠం నేర్వలేదు
 కాంగ్రెస్ పార్టీకి అనేక అనుభవాలు ఉన్నప్పటికీ, తెలంగాణ విషయంలో సృష్టతను సాధించలేకపోతోంది. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో పార్టీకి డిపాజిట్లు గల్లంతు అయినప్పటికిని ‘రాయల’ పేరుతో ైధైర్యం చేయటం ఏమిటని కొందరు నేతలు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సాకారంతో, వచ్చే సార్వత్రిక ఎన్నికలలో ప్రజల ముందుకు ఉత్సాహంతో వెళ్లి విజయఢంకా మోగిస్తామని జిల్లా కాంగ్రెస్ నేతలు భావిస్తున్న తరుణంలో ‘రాయల తెలంగాణ’ ప్రతిపాదన చిక్కులు తెచ్చి పెడుతోంది. తాజా ప్రతిపాదనలతో డిసెంబర్ 23 తరువాతి పరిస్థితులు పునరావృత్తం కాగలవని వారు ఆందోళన చెందుతున్నారు. రాయలతెలంగాణ బిల్లు కనుక నిజమే అయితే నేతలు  నియోజకవర్గాలలో పర్యటించకుండా ప్రజలు తరిమికొట్టే పరిస్థితులు ఎదురుకాగలవని అంచనా వేస్తున్నారు. తెలంగాణ ప్రకటన నేపథ్యంలో జైత్రయాత్ర పేరుతో ఘ నంగా నిర్వహించిన తెలంగాణ సభలు, విజయోత్సవ సభల మాటేమిటని ప్రశ్నించుకుంటున్నారు.
 
 ఆ మాటలకు అర్థమేమిటో
 ఈ తరుణంలో జిల్లాకు చెందిన ప్రభుత్వ విప్ ఈరవత్రి అనిల్ నిజామాబాద్‌లో బుధవారం జరిగిన బీసీ సంఘం కార్యక్రమంలో మాట్లాడుతూ, టీఆర్‌ఎస్ కాంగ్రెస్ లో విలీనం కావటానికి వెనుకంజవేయడంతోనే రాయల తెలంగాణ ప్రతిపాదన తెరపైకి వచ్చిందని ప్రస్తావించారు. ఇది కాంగ్రెస్ నేతలలో నెలకొన్న అయోమయానికి అద్దం పడుతోంది. టీఆర్‌ఎస్ కాంగ్రెస్‌లో విలీనంపై వెనుకడుగు వేయకపోతే ఈ ప్రతిపాదన వచ్చి ఉండేది కాదడంపై టీఆర్‌ఎస్ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడిని పెంచి సంపూర్ణ తెలంగాణ కోసం కృషి చేయాల్సింది పోయి వక్ర భాష్యాలు చెప్పడం ఎంతవరకు సమంజసమని ఆ వర్గాలు ప్రశ్నిస్తున్నా  యి. రాయల తెలంగాణను వ్యతిరేకిస్తున్నానంటున్న పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ అధిష్టానవర్గంపై ఒత్తిడి పెంచకపోవడంపై తెలంగాణవాదులు అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు.
 
 ఇదేనా చిత్తశుద్ధి
 రాయల తెలంగాణకు వ్యతిరేకంగా సాగుతున్న ఉద్యమంలో కూడా జిల్లా కాంగ్రెస్ నేతలు భాగస్వామ్యాన్ని పంచుకోకపోవడం వారి చిత్తశుద్ధిని తెలియజేస్తోందని తె లంగాణవాదులు పేర్కొంటున్నారు. తెలంగాణ ప్రకటన వెలువడడంలో కీలకపాత్రను పోషించామని చెప్పుకుంటున్న డి.శ్రీనివాస్, ఎమ్మెల్సీ షబ్బీర్‌అలీ ప్రస్తుతం సరైన విధంగా స్పందించకపోవడంపై జిల్లా ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. జిల్లా మంత్రి పి.సుదర్శన్‌రెడ్డి, మాజీ స్పీకర్ కేఆర్ సురేష్‌రెడ్డి సహా జిల్లాకు చెందిన ఎంపీలు మధుయాష్కీగౌడ్, సురేష్‌షెట్కార్ కూడా ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా స్పం దించక పోవటాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఇప్పటికైనా కేంద్రంపై హైదరాబాద్ రాజధానిగా పది జిల్లాలతో కూడిన ప్రత్యేక రాష్ట్రం కోసం ఒత్తిడి పెంచకపోతే పూర్వ పరిస్థితిని                     ఎదుర్కోవాల్సి వస్తుందని రాజకీయ జేఏసీతో పాటు తెలంగాణవాదులు హెచ్చరిస్తున్నారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement