ప్రైవేటు చేతికి బాలల ఆరోగ్య పథకం | Sakshi
Sakshi News home page

ప్రైవేటు చేతికి బాలల ఆరోగ్య పథకం

Published Wed, Jun 6 2018 12:05 PM

RBSK Scheme In Private Company Hand Kurnool - Sakshi

కర్నూలు(హాస్పిటల్‌): రాష్ట్రీయ బాల స్వాస్త్య స్కీమ్‌ (ఆర్‌బీఎస్‌కే)లోని స్కూల్‌ హెల్త్‌ ప్రోగ్రామ్‌ ప్రైవేటు చేతికి వెళ్లింది. ఈ పథకాన్ని ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గత నెల ఉత్తర్వులు జారీ చేసింది. మరో వారం రోజుల్లో పాఠశాలలు తెరవాల్సి ఉండగా ఇప్పటి వరకు స్కూల్‌ హెల్త్‌ ప్రోగ్రామ్‌ కింద వైద్యులను, సిబ్బందిని సైతం నియమించలేదు. జిల్లాలో 2,992 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, 3,549 అంగన్‌వాడీ కేంద్రాలు, 51 ప్రభుత్వ, ఎయిడెడ్‌ జూనియర్‌ కళాశాలలు ఉన్నాయి. ఇందులో మొత్తం 5.30 లక్షల మంది 18 ఏళ్లలోపు విద్యార్థులు అభ్యసిస్తున్నారు. వీరందరికీ గతంలో ఆర్‌బీఎస్‌కే ప్రోగ్రామ్‌ ద్వారా ప్రభుత్వ వైద్యులే నెలకు రెండుసార్లు పాఠశాలలకు వెళ్లి వైద్యపరీక్షలు చేసేవారు.

విద్యార్థులకు ఉన్న వ్యాధులను గుర్తించి చికిత్స చేయడం, వారికి సాధ్యంకాని వ్యాధులుంటే ప్రభుత్వ ఆసుపత్రికి రెఫర్‌ చేయడం చేసేవారు. ఈ ప్రోగ్రామ్‌ను ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య పద్ధతిలో ధనుష్‌ ఇన్ఫోటెక్‌ అనే సంస్థకు అప్పగించింది. ఈ సంస్థ జిల్లాలో 40 వైద్యబృందాలను ఏర్పాటు చేస్తుంది. ఒక్కో బృందంలో ఇద్దరు వైద్యులు, ఇద్దరు పారా మెడికల్‌ సిబ్బంది ఉంటారు. ఒక్కో బృందం ప్రతి రోజూ 120 మంది విద్యార్థులను పరీక్షించి చికిత్స చేయాలి. విద్యార్థులను పూర్తి స్థాయిలో 30 రకాల వ్యాధుల గురించి పరీక్షించి, వారికి సాధ్యంకాని వ్యాధులుంటే రెఫరల్‌ ఆసుపత్రులకు పంపించాలి. ఈ మేరకు ఒక్కో విద్యార్థికి రూ.47.50 ఇచ్చే విధంగా ఒప్పందం చేసినట్లు సమాచారం.  

నియామకాలూ మొదలు కాలేదు  
ఈ ప్రోగ్రామ్‌ కింద జిల్లాలో 40 బృందాల్లో 80 మంది వైద్యులు, 80 మంది పారా మెడికల్‌ సిబ్బందిని నియమించాల్సి ఉంది. జూన్‌ 12వ తేది నుంచి పాఠశాలలు పునఃప్రారంభమవుతాయి. కాని ఇప్పటి వరకు ధనుష్‌ ఇన్ఫోటెక్‌ సంస్థ నియామకాలు చేపట్టలేదు. నియామకాలతో పాటు 40 మొబైల్‌ వాహనాలను సైతం ఆ సంస్థ ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు ఈ ప్రోగ్రామ్‌కు సంబంధించి ఎంఓయూ, గైడ్‌లైన్స్‌ జిల్లా అధికారులకు కూడా చేరలేదు. 

ఎంపిక చేశారు..ఉత్తర్వులు ఇవ్వలేదు
ఆర్‌బీఎస్‌కే ప్రోగ్రామ్‌ కింద రెండేళ్ల క్రితం జిల్లాలో 40 వైద్యబృందాల కోసం జిల్లా కలెక్టర్‌ ఆధ్వర్యంలో నియామకాలు చేపట్టారు. ఈ మేరకు 15 మంది అల్లోపతి, 15 ఆయుర్వేద వైద్యులను ఎంపిక చేశారు. కానీ ఇప్పటి వరకు వారికి నియామక ఉత్తర్వులు జారీ చేయలేదు. ఓ వైపు ఆర్‌బీఎస్‌కే కింద ఎంపికయ్యామన్న ఆనందం ఉన్నా రెండేళ్‌లైనా నియామకపు ఉత్తర్వులు ఇవ్వక పోవడంపై వైద్యులు ఆందోళన చెందుతున్నారు.

పూర్తిస్థాయి వివరాలు అందలేదు
స్కూల్‌ హెల్త్‌ ప్రోగ్రామ్‌ను ధనుష్‌ అనే సంస్థకు ఇచ్చారని తెలిసింది. వారు చేసే ప్రోగ్రామ్‌లో భాగంగా రోజూ 40 వాహనాలు వెళ్తున్నాయా లేదా, రోజూ ఒక్కో బృందం 120 మంది విద్యార్థులను పరీక్షిస్తుందా లేదా అని పరిశీలించాలని చూచాయగా మాత్రమే మాకు చెప్పారు. ప్రోగ్రామ్‌ గురించి ఎంఓయూ, నియమ నిబంధనలకు సంబంధించి పూర్తి స్థాయి వివరాలు ఇంకా అందలేదు.    
– హేమలత, రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమ జిల్లా కో ఆర్డినేటర్‌

Advertisement
Advertisement